జయరాం హత్య కేసులో విచారణ మొదలు | Jayaram murder case trial begins | Sakshi
Sakshi News home page

జయరాం హత్య కేసులో విచారణ మొదలు

Jun 11 2019 1:22 AM | Updated on Jun 11 2019 1:22 AM

Jayaram murder case trial begins  - Sakshi

హైదరాబాద్‌: పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్యకేసుకు సంబంధించి కోర్టులో విచారణ ప్రారంభమైంది. 23 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు అందులో 12 మందిని నిందితులుగా చేర్చారు. చార్జిషీట్‌లో ముగ్గురు పోలీసు అధికారులను సైతం నిందితులుగా పేర్కొన్నారు. జయరాంను దారుణంగా హత్య చేసిన రాకేశ్‌రెడ్డిని ఏ–1గా చార్జిషీట్‌లో చూపించారు. ఇక ఏ–2 గా విశాల్, ఏ–3గా వాచ్‌మన్‌ శ్రీనివాస్, ఏ–4గా రౌడీషీటర్‌ నగేశ్, ఏ–5గా సినీ నటుడు సూర్యప్రసాద్, ఏ–6గా సూర్య స్నేహితుడు కిషోర్, ఏ–7గా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సుభాష్‌రెడ్డి, ఏ–8గా మాజీ నేత టీడీపీ బీఎన్‌ రెడ్డి, ఏ–9గా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అంజిరెడ్డి, ఏ–10గా నల్లకుంట మాజీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు, ఏ–11గా రాయదుర్గం మాజీ ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు, ఏ–12గా ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ మల్లారెడ్డిని చేర్చారు. మొత్తం 73 మంది సాక్షులను విచారించగా.. 11వ సాక్షిగా శిఖా చౌదరి, 13వ సాక్షిగా ఆమె సన్నిహితుడు సంతోష్‌రావులు ఉన్నారు. హనీట్రాప్‌తో జయరాం హత్యకు కుట్రపన్నిన రాకేశ్‌రెడ్డి జనవరి 31న పిడిగుద్దులు గుద్ది ముఖంపై దిండుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు పక్కా ఆధారాలను చార్జిషీట్‌లో జతపర్చారు.  

ఆ పోలీసుల సూచనలతోనే.. 
ఈ కేసులో నిందితులుగా ఉన్న పోలీసుల సూచనతోనే మృతదేహాన్ని నందిగామకు తరలించాడని, జయరాంను చిత్రహింసలు పెట్టి చంపిన రాకేశ్‌.. ఆ మొత్తం దృశ్యాలను వీడియోలో చిత్రీకరించాడని పేర్కొన్నారు. 11 వీడియోలు, 13 ఫొటోలు తీసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఆస్పత్రికి తీసుకువెళ్ల.. ప్లీజ్‌ అంటూ జయరాం ప్రాధేయపడ్డా రాకేశ్‌ వినిపించుకోలేదు. ప్రతినెలా 50 లక్షలు ఇస్తా నన్ను చంపకుండా వదిలెయ్‌ అని మొరపెట్టుకున్నట్లు కూడా తేలింది. పాస్‌పోర్ట్‌ మీ దగ్గరే పెట్టుకో నన్ను ప్రాణాలతో వదిలేయ్‌ అంటూ కాళ్లావేళ్లా పడ్డ దృశ్యాలు కూడా సమర్పించారు. వీణ అనే పేరుతో తన ఇంటికి జయరాంను రాకేశ్‌ లంచ్‌కు ఆహ్వానించారు. అయితే జయరాం శరీరంలో ఎటువంటి విషపదార్థాలు లేవని పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది.

శిఖా చౌదరి బీఎండబ్ల్యూ కారును రాకేశ్‌ ఎత్తుకెళ్లడమే కాకుండా ఆమె కోసం ఖర్చు చేసిన డబ్బును వెనక్కివ్వాలంటూ డిమాండ్‌ చేసినట్లు కూడా తేలింది. శిఖా చౌదరి కోసం రాకేశ్‌ పెద్ద ఎత్తున ఖర్చు చేశాడని తేలింది. కిడ్నాప్‌ చేసి స్కెచ్‌ విఫలమయ్యాక రాయదుర్గం సీఐ రాంబాబును రాకేశ్‌ కలిశాడని స్పష్టం చేశారు. ఖాళీ స్టాంప్‌ పేపర్ల మీద జయరాం సంతకాలు తీసుకున్నట్లు కూడా స్పష్టమైంది. 4.5 కోట్లు జయరాంకు అప్పు ఇచ్చినట్లు అందులో సంతకాలు పెట్టించుకున్నట్లు కూడా తేలింది. మాజీ టీడీపీ నేత బీఎన్‌.రెడ్డి సమక్షంలో ఈ అగ్రిమెంట్‌ జరిగిందని స్పష్టమైంది. హత్య చేసిన విషయాన్ని రాయదుర్గం మాజీ సీఐ రాంబాబుకు ఫోన్‌లో చెప్పడం, కారులో మృతదేహంతో నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లడం ఇవన్నీ పోలీసుల దృష్టికి వచ్చాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement