గంటలో వస్తానన్నాడు..

Inter Students Died in Bheemili Beach Visakhapatnam - Sakshi

తిరిగిరాని లోకాలకువెళ్లిపోయాడు

దువ్వి శ్రీను విషాదగాథ ఇది..  

భీమిలి తీరంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు

ఒడ్డుకు చేరిన శ్రీను మృతదేహం లభించని మరొకరి ఆచూకీ

ప్రాణాలతో బయటపడ్డ ముగ్గురు ఆరిలోవలో విషాదఛాయలు

భీమునిపట్నం/ఆరిలోవ(విశాఖ తూర్పు): నాగుల చవితి రోజున ఆరిలోవలో విషాద చాయలు అలముకున్నాయి. భీమిలి తీర ప్రాంతంలో గురువారం ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు గల్లంతైన ఘటనలో ఓ విద్యార్థి మృతదేహం తీరానికి కొట్టుకురావడంతో అతని కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. మరో విద్యార్థి ఆచూకీ లభ్యంకాకపోవడంతో అతని కుటుంబం ఆందోళన చెందుతోంది. ఈ ఘటనలో మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు, కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలివి.. 

ఆరిలోవ ప్రాంతం ఒకటో వార్డు నెహ్రూనగర్‌కు చెందిన దువ్వి శ్రీను(16), రెండోవార్డు పరిధి టి.ఐ.సి పాయింట్‌ ఎస్టీకాలనీకి చెందిన లంకిలపల్లి నవీన్‌(16), అదే ప్రాంతానికి చెందిన ఎస్‌.కె.గఫూర్, కె.అరుణ్, కె. సంతోష్‌లు నగరంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌(ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరు గురువారం భీమిలి సముద్ర తీరానికి చేరుకుని.. ఇసుకలో కొద్ది సేపు సరదాగా గడిపారు. అనంతరం గోస్తనీ, సముద్రం కలిసే సాగర సంగమం ప్రాంతంలో స్నానానికి దిగి బంతితో ఆడుకున్నారు. ఆ సమయంలో ఓ అల ఎల్‌.నవీన్, దువ్వి శ్రీనులను(17) లోపలకు లాక్కుపోయింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు మిగిలిన ముగ్గురు బిత్తరపోయి తీరానికి చేరుకున్నారు. ఇది గమనించిన మత్స్యకారులు పరుగెత్తుకుంటూ వచ్చి.. వారి కోసం చాలా సేపు గాలించినా ఫలితం లేకపోయింది. సాయంత్రానికి దువ్వి శ్రీను మృతదేహం గోస్తనీ అవతల వైపున తీరానికి కొట్టుకు వచ్చింది. నవీన్‌ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. భీమిలి ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

ఉదయం పుట్టలోపాలుపోసి..  
దువ్వి శ్రీను ఉదయం తల్లిదండ్రులతో కలసి ముడసర్లోవలో నాగుల చవితి వేడుకలు జరుపుకున్నాడు. అక్కడ పుట్టలో పాలుపోసి తిరిగి వచ్చారు. ఒంటి గంట సమయంలో ఇంటి వద్ద తల్లి సునీత ప్రసాదం పెట్టింది భోజనం వడ్డిస్తుండగా.. ఓ స్నేహితుడు వచ్చి బయటకు రమ్మన్నాడు. దీంతో శ్రీను తోటగరువు హైస్కూ ల్‌ మైదానానికి వెళ్లి గంటలో వచ్చేస్తానని, ఆ తర్వాత భోజనం చేస్తానని తల్లితో చెప్పి వెళ్లిపోయాడు. భోజనం కోసం వస్తాడని ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులకు భీమిలి తీరంలో కొడుకు మరణించాడన్న వార్త కలచివేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న తమ కుమారుడు ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి పైడిరాజు, తల్లి సునీత కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు కుమారులు శ్రీను, కిట్టు(8వ తరగతి)లను చదివిస్తున్నారు. గల్లంతైన మరో విద్యార్థి నవీన్‌ తండ్రి నారాయణరావు కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. నవీన్‌కు తల్లి ఆదిలక్ష్మి, తమ్ముడు శివ (8వ తరగతి) ఉన్నారు. వీరిద్దరూ ఆయా కుటుంబాలకు పెద్ద కుమారులే. ఈ ఘటనతో ఆరిలోవ ప్రాంతంలో విషాద చాయలు నెలకొన్నాయి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top