నా ‘పరువు’ తీస్తావా...నేనేం చేయగలనో చూడు!

Indonesian Woman Get Lewd Call From Boss But Now She Sentenced For 6 Months - Sakshi

‘ఒక మహిళగా... కాదు కాదు ఒక మనిషిగా నేను రక్షింపబడాలి. కానీ ఈరోజు బాధితురాలినైన నేను దోషిగా ప్రపంచం ముందు నిలుచున్నాను. ఇంతటి అన్యాయం ఎక్కడైనా ఉంటుందా. నిజానికి వేధింపబడిన వారిని శరణార్థులుగా స్వీకరించే చోటు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు’ అని ఆవేదన ‍వ్యక్తం చేస్తున్నారు ఇండోనేషియాకు చెందిన ఓ మహిళా లైబ్రేరియన్‌. లైంగిక వేధింపులకు గురైనందుకు ఇప్పటికే నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన ఆమె.. మరో ఆరు నెలల పాటు బంధీఖానాలో ఉండబోతున్నారు. అవును... వేధింపులకు గురైనందుకే ఆమెకు కారాగారవాసం. నమ్మశక్యంగా లేదు కదా.. కానీ ఇదే వాస్తవం. ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానమే ఈ తీర్పునిచ్చింది.. అదే విధంగా జరిమానా రూపంలో అక్షరాలా 35వేల డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. అలా జరగని పక్షంలో శిక్షను పొడగించాల్సి వస్తుందని హెచ్చరించింది కూడా. బాధితురాలే దోషిగా మారిన ఈ విచిత్ర ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది.

ఆ బాధితురాలి(దోషిగా పేర్కొనేందుకు మనస్కరించనందున) పేరు నురిల్‌ మక్‌నున్‌. వయస్సు 41 సంవత్సరాలు. ఇండోనేషియాలోని లంబోక్‌ ద్వీపంలో ఉన్న ఓ ఉన్నత పాఠశాలలో లైబ్రేరియన్‌గా పనిచేసేవారు.అయితే ఉద్యోగం చేస్తూ...కుటుంబానికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉంటున్నానన్న సంతోషం ఆమెకు ఎంతోకాలం నిలవలేదు. తాను పనిచేస్తున్న పాఠశాల హెడ్‌మాస్టర్‌ రూపంలో ఉపద్రవం ముంచుకొచ్చింది. సహోద్యోగి అయిన నురిల్‌తో అతడు నెమ్మదిగా పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తరచుగా ఫోన్‌ చేసి వృత్తికి సంబంధించిన విషయాలను ఆమెతో చర్చించేవాడు. కానీ కొన్నాళ్ల తర్వాత అతడిలో దాగున్న కామప్రకోపం నిద్రలేచింది. ఈ క్రమంలో ఓరోజు నురిల్‌కు ఫోన్‌ చేసి.. తన పడకగదిలో జరిగే విషయాలను ఆమెతో చర్చించసాగాడు. ఊహించని పరిమాణానికి కంగుతిన్న ఆమె ఒక్కసారిగా ఫోన్‌ కట్‌ చేసి.. ఇక అతడితో మాట్లాడటం మానేసింది. ఇంతటితో సమస్య ముగుస్తుందనుకుంది.

కానీ ఆ కామాంధుడు నురిల్‌ను వదిలిపెట్టలేదు. వేర్వేరు నంబర్ల నుంచి ఫోన్‌ చేస్తూ జుగుప్సాకర విషయాలు చెబుతూనే...తనతో సంబంధం పెట్టుకోవాలంటూ పశువులా మాట్లాడేవాడు. తన క్రూర వాంఛ తీర్చాలంటూ ఎంతగా బతిమిలాడినా నూరిల్‌ కరగకపోవడంతో ఆమె పరువు తీయాలని భావించాడు. ఈ క్రమంలో నురిల్‌తో తనకు అక్రమ సంబంధం ఉన్నట్లుగా స్కూల్‌ మొత్తం ప్రచారం చేయించాడు. దీంతో అక్కడ పనిచేసే వారంతా నురిల్‌ను ఓ వ్యక్తిత్వం లేని మహిళగా చూడటం మొదలుపెట్టారు. మనోవేదనను తట్టుకోలేని నురిల్‌ ఎలాగైనా తాను నిర్దోషినని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా అతడి ఫోన్లకు స్పందించడం మొదలుపెట్టింది. ఫోన్‌ చేసిన ప్రతీసారి ఆ మృగాడి మాటలు వింటున్నట్టుగా నటిస్తూ... కాల్స్‌ రికార్డు చేసింది. అయితే అదే తన పాలిట శాపమవుతుందని నురిల్‌ ఊహించలేకపోయింది.

నా ‘పరువు’ తీస్తావా?!
తనపై హెడ్‌మాస్టర్‌ వేసిన నిందలు చెరిపేసేకునే క్రమంలో కాల్‌ రికార్డులను తన భర్తతో పాటుగా సహోద్యోగులకు కూడా వినిపించింది నురిల్‌. ఈ విషయం ఈనోటా ఆనోటా పాకి చివరికి ఆ మృగాడి చెంతకు చేరింది. దీంతో తాను పెద్ద మనిషిని, ఒక బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నాననే విషయం స్ఫురణకు వచ్చి తనకున్న పరువు గురించి బెంబెలెత్తిపోయాడు. అంతేకాదు నురిల్‌ను మరోసారి ఇబ్బందుల పాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా మరో టీచర్‌తో కలిసి కుట్ర పన్ని.. ఆమెపై పరువునష్టం దావా వేశాడు. తనవి కాని మాటలు తనకు ఆపాదిస్తూ.. అసభ్యతను వ్యాప్తి చేస్తుందంటూ ఆమెపై ఫిర్యాదు చేశాడు.

నురిల్‌కు ఆర్నెళ్ల జైలు.. జరిమానా
2012లో మొదలైన వేధింపుల ఘటనకు సంబంధించిన ఈ కేసులో నురిల్‌ను దోషిగా తేలుస్తూ శుక్రవారం ఇండోనేషియా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో గతంలో ఇప్పటికే నెలరోజుల పాటు శిక్ష అనుభవించిన నురిల్‌కు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించడంతో పాటుగా.. 35 వేల డాలర్లు జరిమానా వేసింది. బాధితురాలినైన తనను దోషిగా తేల్చవద్దని.. తన ఫోన్‌లోని రికార్డింగ్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న మరో టీచర్‌ వాటిని సర్క్యులేట్‌ చేశారు కాబట్టి... తీర్పును సమీక్షించాలన్న ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది. తీర్పు ప్రకారం జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల పాటు శిక్ష పొడిగించాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఈ తీర్పు గురించి నురిల్‌ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘తనను తాను రక్షించుకోవడానికి నురిల్‌ చేసిన ప్రయత్నం ఆమెను దోషిని చేసింది. హెడ్‌మాస్టర్‌ ఎదుర్కొన్న అవమానం ముందు నా క్లైంట్‌కు ఎదురైన వేధింపులు చాలా చిన్నవిగా మారిపోయాయి’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి తీర్పుల కారణంగా లైంగిక వేధింపులకు గురయ్యే బాధితులనే నిందితులుగా చిత్రీకరించేందుకు ఊతం దొరుకుతుందంటూ లీగల్‌ ఎయిడ్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ప్రెస్‌ హెడ్‌ ఆడే వహీయుద్దీన్‌ అభిప్రాయపడ్డారు.

క్షమాభిక్ష పెట్టేందుకు సిద్ధం..
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నురిల్‌కు జరిగిన అన్యాయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మానవ, మహిళా హక్కుల సంఘాలు ఈ తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మాట్లాడుతూ...‘ ఈ కేసును నేను సునిశితంగా పరిశీలిస్తున్నాను. ఒకవేళ నురిల్‌కు న్యాయం జరగకపోయినట్లయితే తను క్షమాభిక్ష కోరవచ్చని గతంలో సూచించాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. నాకున్న అధికార పరిమితులకు లోబడి నా వంతు కర్తవ్యం నెరవేరుస్తా’ అని పేర్కొన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై నురిల్‌ లాయర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన క్లైంట్‌ క్షమాభిక్ష కోరినట్లైతే తప్పు చేసిందని ఒప్పుకొన్నట్లే అవుతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా మానవ హక్కుల కార్యకర్తలు కూడా ఈ ఘటనపై తీవ్ర స్థాయలో విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపి... సమాన హక్కులు కల్పించాలంటూ ఆ దేశ మహిళలు నిరసనలు చేపట్టి రెండు నెలలు కూడా తిరగకముందే ఇండోనేషియాలో ఇలాంటి తీర్పు రావడం బాధించే విషయమని ఆవేదన ‍వ్యక్తం చేస్తున్నారు.

రోజూవారీ ఘటనలను పరిశీలిస్తే నిజానికి కేవలం నురిల్‌ ఒక్కరికి మాత్రమే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకావడం లేదనే విషయం స్పష్టమవుతోంది. బాధితురాలిని నిందితురాలిగా చిత్రీకరించడం సమాజానికి పరిపాటిగా మారినా.. కోర్టుల్లోనైనా వారి సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఆశ ఉండేది. అయితే నూరిల్‌ విషయంలో ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక మన దేశంలో ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలతో కోర్టు మెట్లెక్కిన బాధిత మహిళ పరిస్థితి ఎలా ఉందో ఆమె దాఖలు చేసిన అఫిడవిట్‌ పూర్తిగా చదివితే అర్థమవుతుంది. పితృస్వామ్య వ్యవస్థలో ఓ మహిళ వ్యక్తిత్వాన్ని ఎంత హేయంగా చిత్రీకరించవచ్చో ఆ డాక్యుమెంట్‌ కళ్లకు కడుతుంది. అంతేకాదు బాధితురాలు.. క్యారెక్టర్‌లేని మనిషిగా ఎలా నిరూపించబడుతుందో తేటతెల్లం చేస్తుంది.

-సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్‌
(ది న్యూయార్క్‌ టైమ్స్‌ సౌజన్యంతో)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top