జీతానికి.. దొంగలు? | Increasing Mobile theft In Eluru | Sakshi
Sakshi News home page

 జీతానికి.. దొంగలు?

Jul 29 2019 9:55 AM | Updated on Jul 29 2019 9:55 AM

Increasing Mobile theft In Eluru - Sakshi

సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : జిల్లాలో సెల్‌ఫోన్‌ దొంగల మాఫియా చెలరేగిపోతోంది. రెండేళ్ల కాలంలో వేల సంఖ్యలో సెల్‌ఫోన్లు చోరీ అయ్యాయి. ఫోన్‌ కోసం కేసులెందుకులే అనుకునే వారు కొందరైతే.. కేసు పెట్టేందుకు వెళ్లినా నమోదు, దర్యాప్తులో పోలీసు అధికారులు పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. ‘హలో’ అనే తెలుగు సినిమాలో చూపించిన తరహాలో ఆకివీడు కేంద్రంగా ఏకంగా ఒక గ్యాంగ్‌ సెల్‌ఫోన్‌ చోరీలు చేస్తున్నట్టు తెలుస్తోంది.  ఇటీవల ఏలూరులోని ఒక పోలీసు స్టేషన్‌లో చోరీ కేసులో దొరికిన దొంగను విచారించగా ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆ దొంగను ఏకంగా జీతానికి పెట్టుకున్నట్లు తేటతెల్లం కావటంతో పోలీసు అధికారులే ఆశ్చర్యపోయారట. మరో కేసులో సెల్‌ఫోన్‌ ఐఎంఏ నంబర్‌ను ట్రేస్‌ చేయగా ఆ ఫోన్‌ పక్క రాష్ట్రాల్లో ఉన్న ట్లు నిర్ధారణ కావటం గమనార్హం. మొత్తానికి బాధితులకు న్యాయం జరిగే పరిస్థితి కానరావటం లేదు. 

జీతానికి దొంగలా ? 
ఏలూరులోని ఒక పోలీసు స్టేషన్‌లో ఇటీవల ఒక దొంగను విచారించిన పోలీసులకు అతను చెప్పిన సమాధానంతో దిమ్మతిరిగింది. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఒక దొంగ తనను జిల్లాకు చెందిన ఒక గ్యాంగ్‌ పనిలో పెట్టుకుందని, ఏడాదికి రూ.2 లక్షలకుపైగా  వేతనం చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుందని విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ అతను పోలీసులకు దొరికిపోయి జైలుకు వెళ్ళినా బెయిల్, ఇతర ఖర్చులన్నీ ఈ గ్యాంగ్‌ చూసుకుంటుందట. దీంతో జల్సాలకు అలవాటు పడిన కొందరు ఈ తరహా చోరీలు చేస్తున్నట్టు సమాచారం.

రాష్ట్రాలు దాటిపోతున్న వైనం 
జిల్లాలో చోరీ చేసిన సెల్‌ఫోన్లను బల్క్‌గా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారట. తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు సెల్‌ఫోన్లను తరలిస్తున్నట్లు తెలు స్తోంది. ఇతర రాష్ట్రాల్లో తక్కువ రేటుకే ఫోన్లను విక్రయిస్తూ భారీగా ఆదాయం సంపాదిస్తున్నారట. ఆకివీడు కేంద్రంగా ఈ గ్యాంగ్‌ కార్యకలాపాలు సాగుతున్నట్లు సమాచారం. గతంలో బంగారు, వెండి ఆభరణాలపైనే ఎక్కువగా దృష్టి సారించగా.. కొంత కాలంగా సెల్‌ఫోన్‌ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. హలో సినిమాలో చూపించిన తరహాలో భారీ సంఖ్యలో సెల్‌ఫోన్లు రాష్ట్రాలు దాటిపోతున్నట్లు సమాచారం. ఏలూరు తోపాటు, పలు పట్టణాల్లో ఈ గ్యాంగ్‌ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 

కేసుల నమోదుపై అనాసక్తి
సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న వ్యక్తులు పోలీసు స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం కేసుల నమోదుకు పెద్దగా ఆసక్తి చూపించటంలేదనే ఆరోపణలు ఉన్నాయి. రూ.5వేలు, రూ.10వేలు, రూ.20వేలు ఖరీదు ఫోన్లు అయితే వాటి కోసం కేసులు పెట్టినా దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతూ ఉంటుంది. పైగా అనేక కేసులను ఛేదించే పనిలో బిజీగా ఉండే పోలీసులకు ఈ సెల్‌ఫోన్ల కేసుల దర్యాప్తు తలనొప్పిగా మారుతుందనే కారణంగా వీటిపై పెద్దగా ఆసక్తి చూపించటంలేదనే అభిప్రాయం ఉంది. ఎవరైనా పెద్ద వ్యక్తులు చెబితేనో, ఏదైనా సిఫారసు వస్తేనో తప్ప సెల్‌ఫోన్ల చోరీ కేసులు నమోదు కావటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తక్కువ ఖరీదు చేసే ఫోన్ల కోసం సమయాన్ని, ధనాన్ని వెచ్చించాల్సి రావటం కూడా పోలీసులు ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇదే సెల్‌ఫోన్‌ మాఫియాకు వరమనే వాదన వినిపిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement