కట్టుకున్నోడే కడతేర్చాడు..

Husband Killed Wife In YSR Kadapa - Sakshi

అనుమానంతో భార్యను నరికి చంపిన భర్త

అడ్డు వచ్చిన అత్తనూ హతమార్చే యత్నం

అదుపులో నిందితుడు

అనుమానం పెను భూతమైంది. భర్త క్షణికావేశం కట్టుకున్న భార్యను హతమార్చింది. తల్లి చనిపోయింది.. తండ్రి కటకటాల పాలయ్యాడు. ఇక మిగిలింది అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు.. సంఘటన ఎందుకు జరిగిందో.. ఎలా జరిగిందో వారికి తెలియదు.. కంటి నిండా కారుతున్న నీటితో బోరున విలపిస్తున్న ఆ చిన్నారులను చూసిన ప్రతి గుండె కన్నీరు కార్చింది. తల్లి లేక, తాను ఉండలేని పరిస్థితుల్లో కన్న బిడ్డల భవిష్యత్తు ఏంటన్న ఆలోచన రాకపోవడం బాధాకరం. ఈ సంఘటన చిన్నమండెం మండలం చాకిబండ కుమ్మర పల్లెలో శుక్రవారం చోటు చేసుకుంది.

వైఎస్‌ఆర్‌ జిల్లా, రాయచోటి(చిన్నమండెం) : చాకిబండ కుమరపల్లెకు చెందిన వల్లెపు ఆంజనేయులు(32) భార్య గంగాదేవి(29)ని శుక్రవారం మధ్యాహ్నం కొడవలితో నరికి చంపాడు. కూతురిని చంపేస్తున్నాడంటూ అడ్డు వెళ్లిన అత్త మల్లమ్మ(48)ను సైతం అదే కొడవలితో తలపై నరకడంతో తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ భార్య గంగాదేవి ఇంటిలోనే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మల్లమ్మను చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్‌ చేశారు. ఆంజనేయులు, గంగాదేవిలకు తేజశ్రీ(7), శ్రీనాథ్‌(4) చిన్నారులు ఉన్నారు.

వెంటాడిన అనుమానం
ఆంజనేయులు గత పదేళ్లుగా గల్ఫ్‌లో ఉంటూ రెండేళ్లకు ఒక మారు ఇంటికి వస్తుండేవాడు. రెండు నెలల కిందటనే స్వగ్రామానికి వచ్చిన ఆంజినేయులుకు భార్య నడవడికపై అనుమానాలు మొదలయ్యాయి. మరో వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉందన్న అనుమానం వెంటాడింది. దీంతో కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవని స్థానికుల సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం ఇరువురి మధ్య మాటమాట పెరిగి కొడవలితో నరికే వరకు దారి తీసినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఇంటివద్దనే ఉన్న గంగాదేవి తల్లి మల్లమ్మ బిడ్డను చంపొద్దని అడ్డుకున్నా ఫలితం లేకపోయింది. కన్న బిడ్డ కళ్లముందు చనిపోవడంతో పాటు తన ప్రాణం మీదకు తెచ్చుకుని కొన ఊపిరితో ఆసుపత్రికి చేరింది.

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
పులివెందుల డీఎస్పీ నాగరాజ, రాయచోటి రూరల్‌ సీఐ నరసింహరాజులు శుక్రవారం సాయంత్రం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు దారి తీసిన పరిస్థితులపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సంఘటన విషయం తెలిసిన వెంటనే చిన్నమండెం ఎస్‌ఐ రెడ్డి సురేష్‌ కుమ్మరపల్లెకు చేరుకుని గాయాల పాలై కొన ఊపిరితో ఉన్న మల్లమ్మను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. భార్యను నరికి చంపిన భర్త వల్లపు ఆంజినేయులును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీఎస్పీ విలేకరులకు తెలిపారు.

అనాథలుగా మారిన పిల్లలు
భార్యను భర్తే  హతమార్చడంతో అల్లారు ముద్దుగా పెరుగుతున్న ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. 7 సంవత్సరాలు వయసున్న తేజశ్రీ, నాలుగు సంవత్సరాలున్న శ్రీనాథ్‌లు అమ్మా నాన్న గొడవతో ఏడవడం తప్పా ఏమి చేయలేకపోయారంటూ స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తోడుగా ఉండాల్సిన తండ్రి కటకటాలలోకి వెళ్లగా, అండగా ఉండాల్సిన అమ్మమ్మ సైతం కొన ఊపిరితో ఆసుపత్రికి చేరడంతో ఆ చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top