భార్య చనిపోయిందనే బాధతో..

Husband Commits Suicide After Wife Pass On In Visakhapatnam District - Sakshi

భార్య మృతి తాళలేక భర్త ఆత్మహత్య  

అనాథగా మిగిలిన ఎనిమిది రోజుల శిశువు

అన్యోన్యంగా ఉన్న జంటను చూసి విధికి కన్నుకుట్టిందేమో.. పగబట్టి మృత్యుపాశం విసిరింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రెండు రోజుల్లోనే ఆ మాతృమూర్తిని దూరం చేసింది. తనకు తోడునీడగా ఉంటుందనుకున్న భార్య అర్ధంతరంగా తనువు చాలించడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటన కుటుంబసభ్యులు, బంధువులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. తమ బిడ్డల భవిష్యత్‌ బంగారుమయం కావాలని ఆశపడితే ఇలా జరగడం తట్టుకోలేకపోతున్నామని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సాక్షి, విశాఖపట్నం: వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా సాగిన వారి ప్రేమకు, దాంపత్య జీవితానికి ప్రతిరూపంగా ఒక బిడ్డ కూడా పుట్టాడు. ఇక్కడే ఆ దంపతుల సంతోషంపై విధి కన్నెర్ర చేసింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రెండు రోజుల్లోనే ఆ మాతృమూర్తి ఈ లోకాన్ని వీడిపోయింది. తనకు తోడునీడగా ఉంటుందనుకున్న భార్య అర్ధంతరంగా తనువు చాలించడంతో మనస్తాపానికి గురైన భర్త కూడా ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. ఈ వరుస ఘటనలతో ఎనిమిది రోజుల పసికందు తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలాడు. హృదయ విదారకరమైన ఈ సంఘటన సింహగిరిపై ఉన్న గిరిజన గ్రామంలో చోటుచేసుకుంది.

ఇటీవల జన్మించిన శిశువుతో శ్రావణ్‌కుమార్‌ (ఫైల్‌) 

మృతుడు శ్రావణ్‌కుమార్‌ సోదరుడు వరహానరసింహం గోపాలపట్నం పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం... సింహగిరిపై ఉన్న గిరిజన గ్రామంలో ఇరుగుపొరుగు ఇళ్లళ్లో ఉంటున్న జలుమూరి శ్రావణ్‌కుమార్, అంబిక (ఇద్దరి వయస్సు ఇరవై ఏళ్లు) ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం వీరిరువురూ వివాహం చేసుకున్నారు. అంబికకి అప్పటికే ఫిట్స్‌ వ్యాధి ఉంది. అనంతరం గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 6న ఫిట్స్‌ రావడంతో 9 నెలల గర్భిణి అయిన అంబికను నగరంలోని కేజీహెచ్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకి శస్త్రచికిత్స చేయగా పండంటి మగబిడ్డని ప్రసవించింది. ప్రసవ సమయంలో కూడా తీవ్రంగా ఫిట్స్‌ వచ్చింది. దీంతో రెండు రోజుల తర్వాత ఈ నెల 8న బుధవారం ఆమె మృతిచెందింది. (చెత్తకుప్ప పక్కనే అందమైన అమ్మాయిని చూసి.. )

భార్య మృతిని తట్టుకోలేని శ్రావణ్‌కుమర్‌ అప్పటి నుంచి మనస్తాపానికి గురయ్యాడు. ఈ తరుణంలోనే ఆదివారం సాయంత్రం సింహగిరిపై గిరిజన కాలనీకి సమీపంలోనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రావణ్‌కుమార్‌ మృతి విషయం తెలుసుకున్న గోపాలపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. మృతుని సోదరుడు ఫిర్యాదు మేరకు గోపాలపట్నం సీఐ మళ్ల అప్పారావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ కళ్ల ఎదుటే అన్యోన్యంగా ఉండే శ్రావణ్‌కుమార్, అంబిక మృతితో సింహగిరిపై ఉన్న గిరిజన గ్రామంలో విషాదం నెలకొంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top