ఆయన మిస్సింగ్‌.. ఓ మిస్టరీ.!

health department officer missing mystery - Sakshi

ఐదు నెలల క్రితం డీఎంహెచ్‌ఓ ఉద్యోగి ఉమామహేశ్వర్‌ రెడ్డి అదృశ్యం  

ఇంకా వీడని మిస్టరీ

తాజాగా డీఎంహెచ్‌ఓలో ఉద్యోగులను విచారించిన కర్నూలు పోలీసులు

ఏమి జరిగిందో అంతుచిక్కని వైనం

కడప రూరల్‌: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (డీఎంహెచ్‌ఓ)లో జిల్లా స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (ఎస్‌ఓ)గా పనిచేసిన ఈగ ఉమామహేశ్వరరెడ్డి గత ఏడాది ఆగస్టు 30వ తేదీన కర్నూలుకు బదిలీ అయ్యారు. అదే ఏడాది సెప్టెంబర్‌ 14వ తేదీ సాయంత్రం నుంచి ఆయన కనిపించకుండా పోయారు. ఐదు నెలలు దాటినప్పటికీ ఆయనకు సంబంధించిన కనీస సమాచారం కూడా  లభించకపోవడం గమనార్హం.  ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీసులు సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో రెండు సార్లు కడపకు వచ్చి ఆయన బంధువులను విచారించి వెళ్లారు. తాజాగా మంగళవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి కర్నూలు నుంచి పోలీసులు వచ్చారు. కొంతమంది ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించి వెళ్లారు. 

‘మిస్సింగ్‌’ వివరాలు ఇలా...
 కడప నగరం ఎన్జీఓ కాలనీకి చెందిన ఉమామహేశ్వర్‌రెడ్డి వయస్సు 48 సంవత్సరాలు. ఆయన ఇక్కడి డీఎంహెచ్‌ఓలో ఎస్‌ఓగా దీర్ఘకాలికంగా పనిచేశారు. ఆయనకు భార్య అనసూయ. ఒక కుమారుడు శివసాయిరెడ్డి ఉన్నారు. ఇతనికి మెడిసిన్‌లో విశాఖపట్నంలో ఫ్రీ సీట్‌ వచ్చింది. అక్కడ ప్రథమ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడు. కాగా ఉమామహేశ్వర్‌రెడ్డి  మంచి అధికారిగా గుర్తింపు పొందారు. గత జూన్‌ నెలలో జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన కర్నూలులోని హెల్త్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు బదిలీ అయ్యారు. అయితే ఆయన సేవలు ఇక్కడ కీలకమైనందున నాటి  డీఎంహెచ్‌ఓ రామిరెడ్డి ప్రభుత్వ అనుమతితో ఆయనను ఇక్కడే డిప్యుటేషన్‌పై విధులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆయన డిప్యుటేషన్‌ను ప్రభుత్వం రద్దు చేయడంతో గత ఆగస్టు నెల 30వ తేదీన కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఎస్‌ఓగా బదిలీ అయ్యారు.

14న సాయంత్రం 7.30కి చివరి ఫోన్‌ కాల్‌...
  బంధువుల సమాచారం మేరకు ఉమామహేశ్వర్‌రెడ్డి కర్నూల్‌లోని తన కార్యాలయం (మెడికల్‌ కాలేజీకి)కు ఎదురుగా ఉన్న శ్రీనివాస లాడ్జీలో బసచేశారు. సెప్టెంబర్‌ 14వ తేదీన సాయంత్రం 4.45 గంటలకు లాడ్జి నుంచి కిందకు వచ్చారు. ఈ సన్నివేశాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్‌  అయ్యాయి. అప్పుడు తెలుపు షర్టు, నల్లని ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. అనంతరం ఆయన 6.30 గంటలకు తన ఆఫీసు (డీఎంహెచ్‌ఓ) నుంచి బయటకు వెళ్లారు. తరువాత ఆయన లాడ్డీకి వెళ్లలేదు. అనంతరం 7.30 గంటలకు ఆఫీస్‌లోని రవి అనే ఉద్యోగికి ఫోన్‌ చేశాడు. అదే చివరి ఫోన్‌ కాల్‌.  అనంతరం అతని దగ్గర ఉన్న నాలుగు ఫోన్‌ నంబర్లు స్విచ్‌ ఆఫ్‌లోనే ఉన్నాయి. 

15వ తేదీన తెలిసిన విషయం...
15వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో కర్నూలులోని ఆఫీసు ఉద్యోగి వసంతరెడ్డి కడపలోని ఆఫీసులో ఉమామహేశ్వరరెడ్డి వద్ద పనిచేస్తున్న బాషాకు ఫోన్‌ చేశారు. ఉమామహేశ్వరరెడ్డి డ్యూటీకి రాలేదని చెప్పారు. దీంతో బాషా ఆ విషయాన్ని ఆయన భార్య అనసూయకు ఫోన్‌ చేసి తెలిపాడు. అప్పుడు అనసూయ తన భర్త సెల్‌కు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉంది. దీంతో ఆమె కర్నూలు డీఎంహెచ్‌ఓకు ఫోన్‌ చేయగా ఆయన కూడా ఈ విషయం తనకు తెలియదని చెప్పారు. కడప నుంచి ఆయన బంధువులు కర్నూలు వెళ్లి అక్కడ 3వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే అక్కడి అధికారులు కూడా ఫిర్యాదు చేశారు.

మూడు బృందాలు ఏర్పాటు...
ఉమామహేశ్వర్‌రెడ్డి బంధులు, కర్నూలు జిల్లా పోలీసులు ఆయన ఆచూకీ కోసం ఆ ప్రాంతాల్లో వెతికారు. ఇంతవరకు స్పష్టంగా ఎలాంటి ఆచూకీ లభించలేదు. అయితే అతను మంత్రాలయం, కోడుమూరు ప్రాంతాల్లో కనిపించినట్లుగా అక్కడ బస చేయడంతో పాటు హోటళ్లలో టిఫిన్‌ చేశారని  ఆయా ప్రాంతాల్లోనివారు కొంతమంది చెప్పినట్లుగా తెలుస్తోంది. ఉమామహేశ్వరరెడ్డి చేతికి ఉన్న వేళ్ల వ్యత్యాసాన్ని పలువురు ప్రశ్నించినట్లుగా తెలిసింది. అయితే ఈ అంశాలు కూడా అస్పష్టంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీ ఆచూకీ కోసం మూడు బృందాలను నియమించినట్లుగా సమాచారం. ఈ విషయమై ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని ఆయన బంధువులు తెలిపారు.  

గతంలో ఆయన భార్య అనసూయ ‘సాక్షి’తో మాట్లాడారు.   మా ఆయన కర్నూలుకు బదిలీ అయ్యాక చాలా డల్‌గా కని పించాడు. అంతేగాక ఆయనకు అప్పుడు కామెర్లు కూడా ఉన్నాయి. బీపీ ఉంది. అక్కడ భోజనం బాగాలేదని, వాతావరణం సరిగా లేదని చెప్పేవాడు. తనను కూడా అక్కడికి తీసుకుపోవడానికి సరైన ఇల్లు కోసం చూస్తున్నట్లుగా చెప్పాడు. ఇంతలోనే ఇలా అయింది. ఆయనకు ఎవరితోనూ గొడవలు, ఎలాంటి సమస్యలు లేవు. అలాగే మాకు ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా లేవు. అయితే ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడంలేదు అని తెలిపారు. మొత్తానికి ఉమామహేశ్వరరెడ్డి మిస్సింగ్‌ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top