చెల్లించి..వంచించి..! 

Haritaki powder scam in hyderabad - Sakshi

కరక్కాయ పొడిలో అందరూ బాధితులే 

పెరిగిన బాధితుల సంఖ్య... 

పథకం ప్రకారమే.... 

ఉద్యోగులకు సైతం టోకరా 

పోలీసుల అదుపులో సిబ్బంది.... 

ఆర్థిక నేరాల విభాగానికి కేసు బదిలీ... 

కేపీహెచ్‌బీకాలనీ: కరక్కాయపొడి పేరుతో వందలాదిమందికి టోకరా వేసిన  ‘సాప్ట్‌ ఇంటిగ్రేట్‌ మల్టీటూల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ సంస్థ యజమాని మాటూరి దేవరాజు అనిల్‌కుమార్‌ పథకం ప్రకారమే రూ. కోట్లు వసూలు చేసి ఉడాయించాడు. పెట్టుబడులు పెట్టిన వినియోగదారులతో పాటు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిణులతో పదోన్నతులు, ప్రోత్సాహకాల పేరుతో మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సంస్థ యజమాని అందులో పనిచేస్తున్న ఉద్యోగిణులకు కూడా మొఖం చూపించకుండా జాగ్రత్త పడటం, మేనేజర్, కిందిస్థాయి ఉద్యోగిణులకు అన్ని కార్యకలాపాలు అప్పగించడం ఇందులో భాగమేనని పేర్కొంటున్నారు. కరక్కాయలను కొనుగోలు చేసి మోసపోయిన బాధితులు మంగళవారం కూడా పెద్ద సంఖ్యలో కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌కు  తరలివచ్చి ఫిర్యాదు చేశారు.  

రూ. వేలల్లో ఎర..రూ.కోట్లల్లో టోకరా 
సంస్థను స్థాపించిన ఆరు నెలల వ్యవధిలో మొదటి మూడు నాలుగు నెలల పాటు డబ్బులను తిరిగి చెల్లించిన సంస్థ ప్రతినిధులు జూన్, జులై మాసాల్లోనే రూ.లక్షల్లో డిపాజిట్‌ల రూపంలో సేకరించారు. చివరి నెలరోజుల్లోనే రూ.కోట్లతో ఉడాయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తక్కువ మొత్తంలో కొనుగోలు చేసిన మహిళలకు మొదట్లో డబ్బులు తిరిగి చెల్లించి వారు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేలా ప్రోత్సహించారు.  దీంతో పలువురు రూ.లక్షలు చెల్లించి క్వింటాల కొద్ది కరక్కాయలను కొనుగోలు చేశారు. పలువురి వద్ద డబ్బులు తీసుకొని కరక్కాయలను కూడా ఇవ్వలేదని సమాచారం. వరంగల్‌ జిల్లా, పోచమైదాన్‌ ప్రాంతానికి చెందిన మహిళలు, పొదుపు సంఘాలు భారీగా పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లు తెలిపారు. వారు కరక్కాయ పొడిని సైతం తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అప్పులు చేసి కరక్కాయలు కొన్నామని, పోలీసులే తమను ఆదుకోవాలని బాధిత మహిళలు యాకూబీ, అక్తర్‌బీ, అసియా, సాబేరా, అహ్మదీ, మహాబూబీ, రెహానాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో ఆకర్షనీయమైన ప్రకటనలు ఇవ్వడంతో పలువురు నిరుద్యోగ యువతులను ఉద్యోగానికి కుదుర్చుకోవడంలోనే కుట్ర దాగిఉందని పోలీసులు పేర్కొంటున్నారు. ముందస్తు శిక్షణ, ప్రాథమిక దశల పేరుతో ఉద్యోగినులను కరక్కాయ పొడి కొనుగోలు, విక్రయాలకు ప్రోత్సహించినట్లు సమాచారం. తమతోనూ పెట్టుబడులు పెట్టించినట్లు ఉద్యోగిణులు వాపోయారు. పథకం ప్రకారం ఉద్యోగిణుల సెల్‌నెంబర్లనే మోసాలకు వాడుకోవడం, వారి ద్వారానే పెట్టుబడులు రాబట్టడం గమనార్హం.  ఫిర్యాదులు స్వీకరించేందుకు పోలీసులు ప్రత్యేకంగా రెండు కౌంటర్‌లను ఏర్పాటుచేసి వివరాలు నమోదు చేసుకున్నారు.  

ఆన్‌లైన్‌ యాడ్స్‌ పేరుతో మరో మోసం.... 
ఇంటివద్దనే రూ.పదివేలకు పైగా సంపాదించవచ్చునని పైన్‌మిత్రా ఆన్‌లైన్‌ సంస్థ ద్వారా యాడ్స్‌ ప్రమోషన్‌ పేరుతో ఒక్కో ప్రకటనకు రూ. 3వేలు వసూలు చేసి వాటిని ఆన్‌లైన్‌ మాద్యమాలలో పోస్టు చేసిన వారికి రోజుకు రూ.100 చొప్పున చెల్లిస్తామంటూ నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పద్మవాణి అనే మహిళ రూ. 2లక్షలు మోసపోయినట్లు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పైన్‌ మిత్రా సంస్థపై కేసులు నమోదు చేశారు.  

పరారీలో నిందితులు.... 
యజమాని మూడు రోజులుగా అందుబాటులో లేకపోవడం, సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ రావడంతో మేనేజర్‌ మల్లిఖార్జున్‌ కూడా కిందిస్థాయి ఉద్యోగులకు సమాచారం ఇచ్చి రెడ్‌ బస్‌ యాప్‌లో నెల్లూరుకు టికెట్‌ బుక్‌ చేసుకొని పరారైనట్లు తెలిసింది. దీంతో కిందిస్థాయి ఉద్యోగులు బాధితులకు సమాచారం ఇచ్చి పోలీసుల వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు అనిల్‌కుమార్, మేనేజర్‌ మల్లిఖార్జున్‌ ఆచూకీ కనిపెట్టేందుకు కేసును సైబరాబాద్‌ ఆర్ధిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. ఇటీవల సదరు విభాగానికి బదిలీ అయిన కేపీహెచ్‌బీ అదనపు సీఐ గోపీనా«థ్‌ దర్యాప్తు బాధ్యతలు చేపట్టారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top