అతడి ఆత్మహత్యను లైవ్‌లో చూశారు | Sakshi
Sakshi News home page

2 వేల మంది లైవ్‌లో చూశారు

Published Wed, Aug 1 2018 10:46 AM

Gurugram Man Commits Suicide Live Streaming In Facebook - Sakshi

గురుగ్రామ్‌ : మనుషుల్లో మానవత్వ విలువలు తగ్గిపోతున్నాయనేది ఇటీవలి కాలంలో వినిపిస్తున్న మాట. తాజాగా గురుగ్రామ్‌లో జరిగిన సంఘటన గురించి చదివితే ఆ మాట నిజమనిపించక మానదు. ఓ వ్యక్తి ఆత్మహ్యత చేసుకుంటన్నది ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేస్తే.. 2వేల మంది దానిని సినిమాలా చూశారే తప్ప ఒక్కరు కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. వివరాల్లోకి వెళ్తే.. గురుగ్రామ్‌లోని పటౌడి గ్రామానికి చెందిన అమిత్‌ చౌహన్‌కు సోమవారం సాయంత్రం తన భార్యతో గొడవ జరిగింది. ఆమె 7 గంటల ప్రాంతంలో ఇద్దరు పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న అమిత్‌ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. దానిని ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయడం ప్రారంభించాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని, ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్‌ చేయండి అంటూ లైవ్‌ స్ట్రీమింగ్‌ చూస్తున్న వారికి తెలిపాడు. తర్వాత గంటకు అతడు సీలింగ్‌ ఫ్యాన్‌కు ఊరి వేసుకున్నాడు. దాదాపు 2 వేల మంది ఈ వీడియోను చూసినప్పటికీ ఒక్కరు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.

ఈ ఘటననపై పోలీసులు మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి మంగళవారం ఉదయం పది గంటలకు తమకు సమాచారం అందిందని తెలిపారు. తాము అక్కడికి చేరుకునే సరికే కుటుంబ సభ్యులు అతని అంత్యక్రిమలు పూర్తి చేశారని పేర్కొన్నారు. అమిత్‌ మరణంపై కుటుంబ సభ్యులు తమకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిచ్చేలా ఉందని.. దీనిపై విచారణ  చేపట్టామని వెల్లడించారు.

కాగా అమిత్‌ మానసికంగా కుంగిపోయాడని.. ఆరు నెలల నుంచి చికిత్స పొందుతున్నాడని అతని బంధువులు పోలీసులకు తెలిపారు. దీనిపై అమిత్‌ తండ్రి ఆశోక్‌ చౌహన్‌ మాట్లాడుతూ.. తనకు సోమవారం రాత్రి 9 గంటలకు ఈ విషయం తెలిసిందన్నారు. భార్యతో, ఇరుగుపొరుగు వాళ్లతో అమిత్‌ తరచు గొడవ పడుతుండేవాడని తెలిపారు.

Advertisement
Advertisement