నీ భార్య, కొడుకును కాల్చేశా! | Gurugram Judge Wife Son Shot By His Gunman | Sakshi
Sakshi News home page

నీ భార్య, కొడుకును కాల్చేశా!

Oct 13 2018 6:47 PM | Updated on Oct 14 2018 4:01 AM

Gurugram Judge Wife Son Shot By His Gunman - Sakshi

గురుగ్రామ్‌: ఓ న్యాయమూర్తి భార్య, కొడుకుపై కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డ్, అనంతరం ఆ జడ్జీకి ఫోన్‌ చేసి ‘నీ భార్య, కొడుకును కాల్చేశా’ అని చెప్పాడు. ఆతర్వాత  పరారయ్యాడు. హరియాణాలోని గురుగ్రామ్‌లో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనతో కలకలం చెలరేగింది. హరియాణా పోలీస్‌శాఖలో హెడ్‌ కానిస్టేబుల్‌గా ఉన్న మహిపాల్‌ సింగ్‌ అదనపు సెషన్స్‌ జడ్జి కృష్ణకాంత్‌ శర్మ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే చాలా కాలంగా ఇంటికి వెళ్లేందుకు సెలవు ఇవ్వాలని మహిపాల్‌ సింగ్‌ విజ్ఞప్తి చేసినా ఫలితం దక్కలేదు. దీనికితోడు న్యాయమూర్తితో పాటు ఆయన కుటుంబీకులు మహిపాల్‌ సింగ్‌ను తరచూ దూషించేవారు.

జడ్జి భార్య రీతూ, కొడుకు ధ్రువ్‌లు మహిపాల్‌తో కలిసి శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు షాపింగ్‌ కోసం ఇక్కడి అర్కాడియా మార్కెట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కారులో రీతూ మరోసారి దూషించడంతో సహనం కోల్పోయిన మహిపాల్‌ మార్కెట్‌ వద్ద కారు దిగి∙సర్వీస్‌ రివాల్వర్‌ను బయటకు తీసి రీతూ, ధ్రువ్‌పై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపాడు. తర్వాత ధ్రువ్‌ను మళ్లీ కారులోకి తీసుకెళ్లబోయాడు. అయితే, కంగారులో ధ్రువ్‌ను అక్కడే పడేసి అదే కారులో పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం వీరిలో రీతూ ఆరోగ్యం స్థిరంగా ఉండగా, తలలోకి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో ధ్రువ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, కాల్పుల అనంతరం పరారైన హెడ్‌ కానిస్టేబుల్‌ మహిపాల్‌ సింగ్‌ను ఫరీదాబాద్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గత రెండేళ్లుగా జడ్జి వద్ద పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. సెలవులు ఇవ్వకపోవడం, వేధించడంతోనే మహిపాల్‌ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలిందని పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు. మహిపాల్‌ స్వగ్రామం మహేంద్రగఢ్‌ అనీ, అతనికి ఇద్దరు పిల్లలున్నారని చెప్పారు. మహిపాల్‌ భార్య టీచర్‌గా పనిచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement