అధికారులను వణికించిన పవర్‌ బ్యాంక్‌

Grenade like powerbank Stops Passenger in Delhi Airport - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులను పవర్‌ బ్యాంక్‌ కాసేపు వణికించింది. లగేజీ తనిఖీ సందర్భంగా ఓ  ప్రయాణికుడి బ్యాగ్‌లో హ్యాండ్‌ గ్రెనేడ్‌ తరహా వస్తువు దర్శనమిచ్చింది. దీంతో ఉలిక్కి పడ్డ భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు గో ఎయిర్‌ సర్వీస్‌ ద్వారా వెళ్లేందుకు సదరు ప్రయాణికుడు సిద్ధమయ్యాడు. ఇంతలో అతని లగేజీలో హ్యాండ్‌ గ్రనేడ్‌ షేప్‌లో ఉన్న వస్తువు ఒకదానిని గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అదొక పవర్‌ బ్యాంక్‌ అని.. కావాలంటే పరిశీలించుకోండంటూ అధికారులను ఆ ప్రయాణికుడు కోరాడు. 

దీంతో రంగంలోకి దిగిన సాంకేతిక నిపుణులు అదొక పవర్‌ బ్యాంక్‌ అని తేల్చటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆపై అతన్ని ఫ్లైట్‌ ఎక్కేందుకు అనుమతించారు. గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలో అలర్ట్‌ ప్రకటించిన అధికారులు అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా విస్తృతంగా తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top