పెళ్లి ఇంట్లో బంగారం చోరీ

Gold Robbery In Wedding Home - Sakshi

తిమ్మాజిపేట (నాగర్‌కర్నూల్‌): పెళ్లి కోసం తెచ్చి ఇంట్లో దాచిన బంగారం చోరీకి గురైంది. ఈ సంఘటన మండలంలోని కోడుపర్తిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి తన కుమారుడు రాందేవ్‌రెడ్డికి గురువారం జడ్చర్లలోని ఫంక్షన్‌ హాల్‌లో వివాహం జరిపించారు. అనంతరం కుటుంబ సభ్యులతో సహా సొంత గ్రామానికి వచ్చారు. గురువారం రాత్రి శ్రీనివాసరెడ్డి కూతురు కల్పన తన నగలతోపాటు అత్తగారి బంధువులకు సంబంధించిన నగలను సూట్‌కేస్‌ బ్యాగులో దాచి పెట్టి ఇంటిపైన నిద్రించారు. ఉదయం లేచి గదిలో చూడగా సూట్‌కేస్‌ బ్యాగును కోసి అందులోని 24 తులాల బంగారాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు గమనించారు. శుక్రవారం బంగారం చోరీకి గురైనట్లు తిమ్మాజిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

విచారణ చేపట్టిన ఎస్పీ
కోడుపర్తిలో పెళ్లి ఇంట్లో 24 తులాల బంగారం అపహరణకు గురైనట్లు ఫిర్యాదు రావడంతో ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ విచారణ చేపట్టారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసులుతో కలిసి గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. బంగారు నగలు ఎలా అపహరణకు గురయ్యాయో ఫిర్యాదుదారు కల్పనను అడిగి తెలుసుకున్నారు. తన నగలతోపాటు బంధువుల నగలను సూట్‌కేసులో ఉంచి తాను మేడపైన నిద్రించినట్లు ఆమె పేర్కొన్నారు. ఉదయం లేచి చూసేసరికి నగలు లేవన్నారు. దీంతో ఎస్పీ గురువారం రాత్రి ఎవరెవరు ఇంట్లో తిరిగారు.. ఇంట్లో నిద్రించిన బంధువుల వివరాలు సీఐ చేత నమోదు చేయించుకున్నారు. ప్రాథమికంగా నగలు ఎవరు అపహరించింది గుర్తించలేదని, త్వరలో నగలు దొంగిలించిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top