రామవరప్పాడులో భారీ చోరీ

Gold And Money Robbery In Krishna - Sakshi

రూ.7 లక్షల సొత్తు అపహరణ

రంగంలోకి దిగిన క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌

సీసీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు

రామవరప్పాడు (గన్నవరం) : ఎప్పుడూ రద్దీగా ఉండే రామవరప్పాడు పాత పోస్టాఫీసు రోడ్డులో గురువారం తెల్లవారుఝామున భారీ చోరీ జరగడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో 10 కాసుల బంగారం, అర కేజీ వెండి, రూ.1.80 లక్షల నగదు మొత్తం సుమారు రూ.7 లక్షల ఆస్తి చోరీ జరిగింది. వివరాలాలా ఉన్నాయి. పాత పోస్టాఫీసు రోడ్డులోని ఓ భవనంలో పంచకర్ల మధుకిరణ్, శారదా భవాని దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మనోజ్, మానస సంతానం. మనోజ్‌ పంజాబ్‌లోని జీఎన్‌ఏ యూనివర్శిటిలో బీటెక్‌ చేరాల్సి ఉండగా, మానస 10వ తరగతి చదువుతోంది. వీరికి పక్కనున్న మరో గదిలో మధుకిరణ్‌ తల్లిదండ్రులు సాంబశివరావు, వరలక్ష్మి›ఉంటున్నారు. మధుకిరణ్‌ ఆటోనగర్‌లో సిటీ కేబుల్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసిన అనంతరం ఉక్కబోతగా ఉందని ఏసీ ఉన్న గదిలో నలుగురు కలిసి నిద్రకు ఉపక్రమించారు.

తెల్ల వారుఝామున సుమారు 2 గంటల సమయంలో ఆగంతకుడు వీరు నివసిస్తున్న భవనంలోకి చేరుకున్నాడు. తలుపులన్నీ వేసి ఉండటంతో వంట గదిలోని కిటికి గ్రిల్‌ను రాడ్డు సహాయంతో తొలగించి రంధ్రం గుండా లోపలికి ప్రవేశించాడు. కుటుంబసభ్యులు నిద్రిస్తున్న గదికి బయట నుంచి గడియ పెట్టి పక్కనున్న గదిలోకి వెళ్లాడు. హ్యాంగర్‌కు తగిలించిన తాళంతో బీరువా లాక్‌ తీసి అందులోని నల్లపూసల గొలుసు, నాను తాడు, గాజులు, చెవి దుద్దులు, చైన్‌ (మొత్తం 10 కాసులు), సిటీ కేబుల్‌ కలెక్షన్‌ డబ్బు, మనోజ్‌ కళాశాలకు చెల్లించాల్సిన ఫీజు కలిపి బీరువాలో ఉంచిన రూ.1.80 లక్షల నగదు, దేవుడి గదిలోని వెండి సామాన్లు అపహరించాడు. మనోజ్‌ కళాశాల బ్యాగ్‌లోని పుస్తకాలను తీసేసి అపహరించిన సొత్తును అందులో వేసుకుని ఉడాయించాడు. మానస నిత్యం ఉదయం 5 గంటలకు నిద్ర లేచి చదువుకుంటుంది. రోజూ మాదిరిగానే మేల్కొన్న మానస తలుపు తీసేందుకు ప్రయత్నించగా రాలేదు. దీంతో తండ్రి మధుకిరణ్‌ను లేపింది. మరో మార్గం నుంచి బయటకు వచ్చి తలుపు గడియ తీశాడు. పక్కనున్న గది తీసి ఉండటం, బీరువాలోని సామాన్లు చిందరవందరగా పడి ఉండటం చూసి దొంగతనం జరిగిందని గుర్తించి పటమట పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ ఉమామహేశ్వరరావు, ఎస్‌ఐ సత్యనారాయణ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రంగంలోకి క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌..
సమాచారం అందుకున్న క్లూస్‌ టీమ్‌ సభ్యులు రంగంలోకి దిగారు. చోరీ జరిగిన తీరును పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. పోలీసు జాగిలాలు ఇంట్లో కలియతిరిగి ప్రసాదంపాడు వైపు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చాయి.

షార్ట్‌తో వచ్చి ఫ్యాంట్‌ షర్ట్‌తో వెళ్లి...
సమీపంలోని ఓ హార్డ్‌వేర్‌ దుకాణంలో రికార్డైన సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు, సీసీఎస్‌ పోలీసులు పరిశీలించారు. షార్ట్, బనీన్‌తో ఓ ఆగంతకుడు ప్రసాదంపాడు వైపు నుంచి వచ్చి మధుకిరణ్‌ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఫుటేజ్‌లో గుర్తించారు. సుమారు గంట తర్వాత అదే వ్యక్తి వైట్‌ షర్ట్, నల్ల ప్యాంట్‌తో వెనుక బ్యాగ్‌ తగిలించుకుని ముఖానికి మాస్క్‌ ధరించి బయటకు వచ్చి తాపీగా రామవరప్పాడు రింగ్‌ వైపు వెళ్లిపోయాడు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించిన మనోజ్‌ ఆగంతకుడు వేసుకున్న డ్రెస్, బ్యాగ్‌ తనవేనని గుర్తించాడు.

పక్కా ప్లాన్‌తోనే..
చోరీ తీరును పరిశీలిస్తే పక్కా ప్లాన్‌తోనే జరిగిందని అనుమానిస్తున్నారు. జాతీయ రహదారి నుంచి లోపలి వీధిలోకి వచ్చిన దుండగుడు ప్రారంభంలో ఉన్న నివాసాల్లోకి వెళ్లకుండా సరాసరి మధుకిరణ్‌ ఇంట్లోకి ప్రవేశించాడు. కేబుల్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న కిరణ్‌ ఇంట్లో కలెక్షన్‌ డబ్బు ఉంటుందని గ్రహించే ఈ దొంగతనానికి పాల్పడ్డాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెక్కీ నిర్వహించి ఇంట్లో విలువైన వస్తువులు, బీరువా తాళాలు ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసుకునే ఈ పనికి పాల్పడ్డాడని భావిస్తున్నారు. సుమారు 20 రోజుల క్రితం మధుకిరణ్‌ ఇంట్లోని తలుపు మరమ్మతుల నిమిత్తం ఇద్దరు వచ్చారని, ఒకవేళ ఇది వారి పని అయ్యి ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కిటికి గ్రిల్‌ తొలగించిన ప్రదేశంలో నేలపై తుప్పు పట్టిన మేకులు కూడా చల్లారని బాధితులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top