అమ్మాయిలను ఎరగా వేసి.. అసభ్య వీడియోలను తీసి!

A Gang Sketch For Blackmail And Collect Money - Sakshi

బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు గుంజుతున్న ముఠా అరెస్టు

సాక్షి, సామర్లకోట (పెద్దాపురం): అమ్మాయిని ఎరగా వేసి.. కొంతమందిని ప్రలోభ పెట్టి బ్లాక్‌ మెయల్‌ చేస్తూ సొమ్ములు గుంజుతున్న ఓ ముఠాను సామర్లకోట క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. సినీఫక్కీలో జరిగిన ఈ సంఘటన చాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అయితే ఇటువంటి ఊబిలో అనేక మంది చిక్కుకున్నా.. కొంతమంది బయటకు చెప్పుకోలేక ముడుపులు చెల్లించి చేతులుదులుపుకొంటున్నారు. ఈ సంఘటన వివరాలను  శుక్రవారం సామర్లకోట పోలీసు స్టేషన్‌లో పెద్దాపురం సీఐ వి. శ్రీనివాసు విలేకర్లకు వెల్లడించారు. జి.మామిడాడలో ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్న తాడి కేదారమణికంఠరెడ్డి, కాకినాడలో జై ఆంధ్రా ఛానల్‌ నడుపుతున్న తేతలి దుర్గారెడ్డి మధ్య స్థలం వివాదం ఏర్పడింది. దీంతో దుర్గారెడ్డి తన చానల్‌లో పని చేస్తున్న రాకేష్‌తో భార్యాభర్తలైన మహేష్, అశ్వినిల సహకారం తీసుకొని కేదారమణికంఠరెడ్డిని మడికి అశోక్‌ అనే వ్యక్తి ఇంటికి వచ్చేలా ఈనెల ఏడో తేదీన ఏర్పాటు చేశారు.

అశ్విని ఫోన్‌లో మాయమాటలు చెప్పి కేదారమణికంఠరెడ్డి వచ్చేలా చేసింది. కేదారమణికంఠరెడ్డి, అశ్వినిలు గదిలోకి వెళ్లిన వెంటనే బ్లాక్‌మెయిల్‌ ముఠా సభ్యులు అసభ్య వీడియోలను చిత్రీకరించి బెదిరించారు. అప్పటికీ అతడు లొంగకపోవడంతో కుర్చీకి కట్టి చిత్ర హింసలకు గురిచేశారని సీఐ తెలిపారు. రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా రూ. 50వేలకు ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఈ క్రమంలో కేదారమణికంఠరెడ్డి వద్ద ఉన్న రూ.63 వేల నగదు, అతడి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, చోరీ చేసి ప్రామిశరీ నోట్లు, తెల్లకాగితాలపై సంతకాలు, వేలి ముద్రలు వేయించుకొని ముఠా పరారైందన్నారు. బాధితుడు తాడి కేదారమణికంఠరెడ్డి ఈనెల 8వ తేదీన చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈనెల 14న ఇంద్రపాలెంలో ఒక ఇంటిలో ఉన్న ఆరుగుళ్ల మహేష్, భూరి అశ్విని, నిమ్మకాయల సతీష్, తోట సందీప్, బొడ్డుపు రాజేష్‌కుమార్, ఎలుడుట్టి లక్ష్మీనారాయణ, మడికి అశోక్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరాన్ని అంగీకరించినట్టు తెలిపారు. ఏ1 దుర్గారెడ్డి, రాకేష్‌ పరారీలో ఉన్నారని తెలిపారు. త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. సత్తి రాంబాబురెడ్డిని ఇదే విధంగా బ్లాక్‌ మెయిల్‌ చేసి సొమ్ములు వసూలు చేసేందుకు పథకం పన్నినట్టు అంగీకరించారని చెప్పారు. ఈ విలేకర్ల సమావేశంలో ఎస్సై సుమంత్, క్రైమ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top