వివాహేతర సంబంధమా.. వ్యాపారుల మధ్య పోటీయా..? | Fruit Merchant In Suspicious Condition Died Of Burns | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధమా.. వ్యాపారుల మధ్య పోటీయా..?

Jul 22 2019 10:32 AM | Updated on Jul 22 2019 10:32 AM

Fruit Merchant In Suspicious Condition Died Of Burns - Sakshi

మృతుని తల్లి, సోదరుని నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు, ఇన్‌సెట్‌లో మృతుడు వేణుగోపాల్‌ (ఫైల్‌)

సాక్షి, గిద్దలూరు: పండ్ల వ్యాపారి అనుమానాస్పద స్థితిలో.. కాలిన గాయాలతో మృతి చెందిన సంఘటన గిద్దలూరు–ఒంగోలు రోడ్డులోని రంగారెడ్డిపల్లె సమీపంలో గల జాతీయరహదారి చప్టా వద్ద ఆదివారం జరిగింది. ఈ సంఘటనలో పట్టణానికి చెందిన పండ్ల వ్యాపారి జోగి వేణుగోపాల్‌ (20) మరణించాడు. అందిన సమాచారం ప్రకారం రంగారెడ్డిపల్లె సమీపంలో గల చప్టా కింద పొగలు వస్తుండటాన్ని గుర్తించిన కొందరు 108కు సమాచారం అందించారు. అప్పటికే కాలిన గాయాలతో కేకలు వేసుకుంటూ చప్టా కింద నుంచి రోడ్డుపైకి వచ్చిన వేణుగోపాల్‌ వాహనాలను ఆపండంటూ ప్రాధేయపడుతున్నాడు. శరీరంపై అధికంగా కాలిన గాయాలతో ఉన్న అతన్ని వాహనం ఎక్కించుకునేందుకు ఇష్టపడని వాహనదారులు వాహనాల్ని నిలపలేదని తెలిసింది. రోడ్డుపై వెళ్లే వారు గుంపులుగా చేరి ఎలా జరిగిందని ప్రశ్నించగా తనను ముగ్గురు వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయారని చెప్పినట్లు సమాచారం. ఇంతలో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 వాహనం అక్కడ నిలబడగానే వేణుగోపాల్‌ చేరుగా వచ్చి వాహనం ఎక్కాడు. 108 సిబ్బంది స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించగా వైద్యులు చికిత్సలందిస్తుండగా అతను మృతి చెందాడు.

వైద్యశాలకు వచ్చినప్పుడు ఎలా జరిగిందని వేణుగోపాల్‌ను అడగ్గా కొద్ది సేపు ఉంటే అన్ని విషయాలు చెబుతానని చెప్పాడని, వైద్యం అందిస్తుండగానే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు వేణుగోపాల్‌ది  కర్నూలు జిల్లా బేతంచర్ల మండలంలోని కేకే కొట్టాల గ్రామం. అతనికి అన్న కృష్ణ, తల్లి పార్వతిలు ఉన్నారు. ఐదు సంవత్సరాల క్రితం క్రిష్ణంశెట్టిపల్లె గ్రామంలో ఉంటూ బేల్దారి పనులు చేసుకుంటూ ఉన్నారు. ఏడాదిన్నర క్రితం గిద్దలూరు పట్టణానికి చేరుకుని పండ్లు, కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములతో పాటు తాను వ్యాపారంలో సంపాదిస్తున్నామని అప్పులేమీ లేవని మృతుడి తల్లి పార్వతి తెలిపారు.

వేణుగోపాల్‌ తాజా పండ్లను మిగిలిన వ్యాపారులకంటే తక్కువ ధరలకే విక్రయించడం వల్ల ఎక్కువ వ్యాపారం చేసేవాడని, కొందరు వ్యాపారులు ఇతనిపై గుర్రుగా ఉండేవారని సమాచారం. ఆదివారం కావడంతో వ్యాపారానికి వెళ్లని వేణుగోపాల్‌ తాను సినిమాకు వెళ్తున్నానని చెప్పగా రూ. 200 ఇచ్చి పంపించినట్లు తల్లి పార్వతి తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో తమకు తెలియదని ఆమె చెబుతోంది. కూరగాయల వ్యాపారం చేసే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఇటీవల ఆమె భర్త గొడవపడినట్లు సమాచారం. మృతదేహాన్ని పరిశీలించిన సీఐ సుధాకర్‌రావు అరికాళ్లు కాలలేదంటే ఇది ఆత్మహత్య అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మోటారు సైకిల్‌ అక్కడే పార్క్‌ చేసి ఉందని, అతనే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడా, ఇంకేమైనా జరిగిందా అనేది తేలాల్సి ఉందని సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement