హార్ధిక్ పటేల్‌కు ఝలక్.. ఎఫ్ఐఆర్ నమోదు | Sakshi
Sakshi News home page

హార్ధిక్ పటేల్‌కు ఝలక్.. ఎఫ్ఐఆర్ నమోదు

Published Wed, Dec 20 2017 5:00 PM

FIR filed against Hardik Patel due to a roadshow without permission - Sakshi

సాక్షి, అహ్మదాబాద్: అసలే తాను మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో నిరాశ చెందుతున్న పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నేత హార్ధిక్ పటేల్‌కు అహ్మదాబాద్ పోలీసులు ఝలక్ ఇచ్చారు. అహ్మదాబాద్ పోలీసులు హార్ధిక్ పటేల్‌పై బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డిసెంబర్ 11న అహ్మదాబాద్ లోని బోపాల్ మునిసిపాలిటీలో తన మద్ధతుదారులతో కలిసి హార్ధిక్ రోడ్ షో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే జిల్లా అధికారుల అనుమతి లేకున్నా.. బైక్ ర్యాలీ నిర్వహించిన కారణంగా పటేల్ రిజర్వేషన్ల ఉద్యమనేతపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు బోపాల్ ఇన్‌స్పెక్టర్ ఐహెచ్ గోహిల్ తెలిపారు.

రోడ్ షోకు జిల్లా అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండానే హార్థిక్ తన మద్దతుదారులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా చేశారని పేర్కొన్నారు. హార్ధిక్‌తో పాటుగా మరో 50 మంది అతడి కీలక అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు గోహిల్ వివరించారు. గుజరాత్ రెండో దశ ఎన్నికలకు మూడు రోజుల ముందు బైకులు, కార్లతో బోపాల్ ఏరియా నుంచి నికోల్ ఏరియాల మధ్య 15 కి.మీ మేర రోడ్ షో నిర్వహించిన హార్ధిక్‌పటేల్ సహా మరికొందరిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పోలీస్ కమిషనర్ ఏకే సింగ్ అన్నారు.

కాగా, గుజరాత్‌ రెండోదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిసెంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీలు అహ్మదాబాద్‌లో పర్యటించవలసి ఉంది. అయితే శాంతి భద్రతలతో పాటుగా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ర్యాలీలకు తాము అనుమతి ఇవ్వలేదని ఏకే సింగ్ వివరించారు. అయితే మోదీ, రాహుల్‌లు పోలీసుల నిర్ణయానికి కట్టుబడి ఉండగా.. ఉద్యమనేత హార్ధిక్ పటేల్ మాత్రం నిబంధనలు ఉల్లంఘించారని, అందుకే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు.

Advertisement
Advertisement