మహిళా దొంగల హల్‌చల్‌

Female Thieves Hulchul In Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం క్రైం:  వారికి ఆడ, మగ అనే తేడా ఉండదు.  రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఒకరిద్దరు, పిల్లలతో సంచరిస్తుంటారు.  లగేజ్‌ పట్టుకుని ఆటో ఎక్కే వారిపై కన్నేస్తారు. వారితో పాటూ అందరూ ఒకేసారి ఆటో ఎక్కేస్తారు.  పక్కన బ్యాగ్‌లతో కూర్చున్న వారి దృష్టి ఒకరు మరలిస్తారు. మరో వైపు నుంచి చక్కగా తమ పని కానిచ్చేస్తారు.  దొరికిన కాడికి దోచుకుంటారు. తమ పని పూర్తవగానే ఆటో దిగి తలో వైపు వెళ్లి, వేరే ఆటోలెక్కి పరారవుతుంటారు. ఇటువంటి సంఘటనలు  పట్టణంలో జోరుగా జరుగుతున్నాయి.  ఆడవాళ్లయితే ఒకరు మాటల్లో పెడతారు. మరోకరు పని కానిచ్చేస్తారు.  అదే మగవారైతే కిక్కిరిసినట్లు కూర్చొవడం, చూపు మరల్చడం వంటివి చేస్తూ దొంగతనాలకు పాల్పడతారు. ఏమాత్రం పొరపాటున కానీ దొరికిపోతే  చంటిపిల్లల ఏడుపులతో  కాళ్లపై పడిపోతారు. దీంతో మన డబ్బులు మనకు ఉన్నాయి కదా... అని విడిచిపెట్టేసే ఘటనలు లేకపోలేదు.

ఎవరు వీరు...
ఒడిశాలోని బరంపురంలో అసకా గ్రామం నుంచి బతుకు తెరువు కోసం జిల్లాలకు వచ్చిన ఎర్రగొల్లలు వీళ్లు.   పూర్వం పిక్‌ పాకెటింగ్, దొంగతనాలు చేసేవారు. క్రమేపీ వాటిని పక్కన పెట్టి, కొత్తగా ఆటోలో ప్రయాణిస్తూ  ప్రయాణికుల బ్యాగ్‌లు చాకచక్యంతో చించేస్తు, వారి నుంచి పర్సులు, వస్తువులను కాజేస్తుంటారు. వీరు  కుటుంబాలతో సహా జిల్లాల్లో మకాం వేస్తారు. పోలీసులు విస్త్రత తనిఖీలు చేసి సుమారు 50 మంది కుటుంబాలను గుర్తించారు. వారికి ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్‌  అందించారు. జైలుకు వెళ్లినా వీరి తమ చేతులకు పని చెప్పడం మాత్రం మానడం లేదు. విజయనగరం జిల్లాలో  కొత్తవలస 202 కాలనీ,  ఎల్‌కోటలో రంగారాయపురం, గజపతినగరంలో పిట్టాడ, బగ్గాం, ఆగూరు, కొత్తవలస బోర్డర్, కె.కోటపాడు మండలం, గొట్లాం వద్ద, పార్వతీపురం, జియ్యమవలస మండలం, తురకనాయుడువలస తదితర ప్రాంతాల్లో వీరు నివసిస్తుంటారు.

 వీరి భర్తలు పగటి పూట పిట్టలు, పక్షుల వేటకు వెళ్తుంటారు. రాత్రివేళల్లో దొంగతనాలు చేస్తుంటారు.  పల్లెటూర్లలో వ్యవసాయ పనులు చేసే వారిని గుర్తించి,  మూకుమ్మడిగా వారి వద్దకు వెళ్లి రోల్డ్‌ గోల్డ్‌ నగకు చిన్న  గ్రాము  బంగారం ముక్క చివరన అతికించి, వారికిచ్చి తమకు కష్టాలున్నాయని, అందుకే తమ దగ్గర ఉన్న నగను అమ్ముకుంటామని, నమ్మబలుకుతారు. వారు టెస్టింగ్‌కి పంపించినప్పుడు  ముందుగా ఉంచిన గ్రాము బంగారం ముక్క కాడను వారికిస్తారు. నిజమేననుకుని వారు తక్కువగా వస్తుందని చెప్పి లక్ష విలువ చేస్తే రూ.30 నుంచి రూ.50వేల వరకూ ఇచ్చేస్తారు. తర్వాత అది గిల్టుదని తెలుసుకుని లబోదిబోమంటారు.  వీరిని ఎర్రగొల్లలని,  ‘తెలగపాములు’ని అభివర్ణిస్తారు.  వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. అక్కచెల్లెల్లు, అత్తా కోడళ్లు ఉంటారు.

-ఇటీవల కోట వద్ద  ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద  ఓ మహిళ  పెళ్లి నగలను పర్సులో పెట్టుకుని  ఆటో ఎక్కింది.  ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలు ఆటో ఎక్కారు.  కోటవద్ద ఆమె దిగిపోయింది.  దిగిన తర్వాత బ్యాగ్‌ను సర్దుకున్నప్పుడు నగలు పర్సును చూడగా ఓపెన్‌ అయి బ్లేడ్‌తో కోసినట్లు ఉంది. అందులో నగలు లేవు. దీంతో లబోదిబోమంటూ టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించింది.

-తాజాగా శ్రీకాకుళం జిల్లా సెవెన్‌ రోడ్డు జంక్షన్‌కి చెందిన కె.లలిత ఉల్లివీధిలో ఫంక్షన్‌కి వచ్చారు. ఆమె ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద  శనివారం ఉదయం 9 గంటలకు ఆటో ఎక్కింది. ఎల్లమ్మ తల్లి గుడి వద్ద ఆటోలో మరో ఇద్దరు మహిళలు ఎక్కారు.  పైడితల్లి అమ్మవారిని దర్శించుకుందామని ఆమె మూడులాంతర్లు వద్ద దిగిపోయారు.  అమ్మవారికి  పూజా సామగ్రి కొందామని బ్యాగ్‌ చూడగా,  కవర్‌ చించేసి, లోపల ఉన్న పర్సును పట్టుకుపోయినట్లు గుర్తించింది.   వెంటనే వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించింది.  తన బ్యాగ్‌లో పెట్టిన పర్స్‌లో రూ.3,600 నగదు, కళ్లద్దాలు, కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top