విషాదం

family dead in pond suspectly - Sakshi

నీటి కుంటలో పడి ముగ్గురు మృతి

మృతుల్లో భార్య, భర్త, కుమారుడు

తుగ్గలి మండల రామలింగాయపల్లిలో ఘటన

తుగ్గలి: పొలం పనులకెళ్లిన ఓ కుటుంబం తిరిగిరాని లోకాలకు వెళ్లిన సంఘటన  రామలింగాయపల్లిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి..గ్రామానికి చెందిన పసుపురాతి పెద్ద రంగన్నకు ఐదుగురు కుమారులు. వారిలో చిన్న కుమారుడైన గంగరాజు(29) వ్యవసాయం చేసుకుంటూ జీనవం సాగించేవాడు. కంది పంటకు పురుగు మందు పిచికారీ చేయాలని గురువారం ఉదయం ఇంటి నుంచి భార్య తిమ్మక్క(26), కుమారుడు రాధాకృష్ణ(8నెలలు)తో కలిసి ఎడ్లబండిలో పొలానికి వెళ్లారు. అయితే రాత్రి ఏడు గంటలైనా ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి వెతికారు. పొలం పక్కనే  ఉన్న నీటి కుంట వద్ద  ఖాళీ బిందెలు, చెప్పులు కనపడడంతో నీటిలో పడి ఉంటారేమోనని అందులో వెతికారు. నీళ్లు ఎక్కువగా ఉండడం, చీకటి కావడంతో  పత్తికొండ ఫైర్‌ స్టేషన్‌కు సమాచారమిచ్చారు. వారు వచ్చి నీటి కుంటలో నీటిని బయటకు తోడేశారు. శుక్రవారం తెల్లవారుజామున నీటి కుంటలో పడి ఉన్న మృత దేహాలను గుర్తించి బయటకు తీశారు. మృత దేహాలను చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. 

మృతిపై పలు అనుమానాలు..
వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్య, భర్తల మధ్య గొడవ జరిగి క్షణికావేశంతో ఇద్దరూ  బిడ్డతో సహ కుంటలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారని కొందరు,  ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి మృతి చెందారని కొందరు అనుమానిస్తున్నారు. నీటిని తెచ్చేందుకు కుంట వద్దకు వెళ్లిన గంగరాజు ప్రమాదవశాత్తూ కుంటలో జారిపడడంతో అతన్ని కాపాడే క్రమంలో పక్కనే బిడ్డనెత్తుకున్న తిమ్మక్క కూడా అందులో పడి మృతి చెందారని మృతుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

గ్రామంలో విషాద ఛాయలు
మృతుడు గంగరాజు ఐదేళ్ల క్రితం గ్రామంలోని తన అక్క కూతురు తిమ్మక్కను పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ల క్రితం అన్నదమ్ములు విడి భాగాలు పోయి జీవనం సాగిస్తున్నారు. ఒకేసారి ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఏ కష్టమొచ్చింది నాయనా ఇంత పని చేశావంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారందనీ కలచి వేసింది. విషయం తెలుసుకున్న డోన్‌ డీఎస్పీ బాబాపకృద్దీన్, ఇన్‌చార్జ్‌ సీఐ రామకృష్ణ, జొన్నగిరి ఎస్‌ఐ నజీర్‌ అహ్మద్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తండ్రి పులికొండ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top