నిజాం రాణులు జలకాలాడిన తటాకం! | bamruk ud daula lake was restored in old city | Sakshi
Sakshi News home page

నిజాం రాణులు జలకాలాడిన తటాకం!

Mar 9 2026 4:52 AM | Updated on Mar 9 2026 4:52 AM

bamruk ud daula lake was restored in old city

చెరువులో వనమూలికల మొక్కలు.. చుట్టూతా పూల మొక్కలు 

అరబ్‌ దేశాలకు సైతం ఎగుమతి అయిన చెరువు నీరు 

బమ్రుఖనుద్దౌలా చెరువుకు వందల ఏళ్ల చరిత్ర

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం పాతబస్తీలో ప్రారంభించిన బమ్రుఖనుద్దౌలా చెరువు కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. 1770లో హైదరాబాద్‌ మూడో నిజాం సికందర్‌ జా ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్‌ రుక్న్‌ ఉద్‌ దౌలా దీన్ని నిర్మించారు. చారిత్రక ఆనవాళ్ల ప్రకారం తొలినాళ్లలో ఈ చెరువు 100 ఎకరాలకుపైగా విస్తరించి ఉండేది. రాజేంద్రనగర్, ఆరాంఘర్, కాటేదాన్‌ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఈ చెరువులోకి చేరేది. నిజాం కాలంలో మీరాలం ట్యాంక్‌ను రాజులు.. బమ్రుఖనుద్దౌలా చెరువును రాణులు స్నానాల కోసం ఉపయోగించేవారు. 

ఈ చెరువులో వనమూలికల మొక్కలు, కొమ్మలు వేసి దిగువున నిర్మించిన బావిలోకి వచి్చన ఊటని తాగునీరుగా వినియోగించేవారు. ఔషధగుణాలున్న ఆ నీటినే నిజాం వాడారు. ఈ చెరువు చుట్టూ సువాసనలు వెదజల్లే పూల మొక్కలు విరివిగా ఉండేవని.. అవి చెరువులో పడటంతో ఇక్కడి నీటిని సెంట్‌ల తయారీకి వినియోగించేవారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ కారణంగానే బమ్రుఖనుద్దౌలా చెరువు నీరు అరబ్‌ దేశాలకు ఎగుమతి అయ్యేదని చెబుతున్నారు. 

కబ్జాల చెర విడిపించిన హైడ్రా..: హైదరాబాద్‌ నగరం కాలక్రమేణా విస్తరించడం, ఇతర ప్రాంతాల నుంచి వరద రాకపోవడంతో బమ్రుఖనుద్దౌలా చెరువు చివరకు 18 ఎకరాల్లో మిగిలింది. కానీ అక్రమార్కులు క్రమంగా చెరువును కబ్జా చేయడంతో 4.12 ఎకరాలకు కుంచించుకుపోయొంది. దీంతో 2024 ఆగస్టులో రంగంలోకి దిగిన హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) ఆయా ఆక్రమణలను తొలగించి దశలవారీగా చెరువును తిరిగి 18 ఎకరాలకు విస్తరించింది. దాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. 

నాటి చారిత్రక ఆనవాళ్లను పరిరక్షిస్తూనే తాజా ఆకర్షణలతో తీర్చిదిద్దింది. అలాగే జల కాలుష్యానికి తావు లేకుండా మురుగునీటి కట్టడి, చెరువులోకి ఇన్‌లెట్, ఔట్‌లెట్స్‌ను పక్కాగా ఏర్పాటు చేసింది. నిజాం కాలంలో రాతితో నిర్మించిన బండ్‌ను చెక్కు చెదరకుండా కాపాడుతూ మరింత పటిష్టం చేసింది. చెరువు పూడికలో కలిసిపోయిన నాటి రాళ్లను బయటకు తీసి భద్రపరిచింది. చెరువు చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌లు, చిన్నారుల కోసం ప్లే ఏరియాలు, ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఆక్రమణలకు వీల్లేని రీతిలో చెరువు కట్ట చుట్టూ, చెరువు లోపలి వైపు కూడా ఫెన్సింగ్‌ వేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement