ఇది ఓల్డ్‌ సిటీ కాదు.. ఒరిజినల్‌ సిటీ | Revanth Reddy inaugurated the Bamrukhanuddaula lake | Sakshi
Sakshi News home page

ఇది ఓల్డ్‌ సిటీ కాదు.. ఒరిజినల్‌ సిటీ

Mar 9 2026 4:58 AM | Updated on Mar 9 2026 4:58 AM

Revanth Reddy inaugurated the Bamrukhanuddaula lake

మూసీ పరీవాహక ప్రాంతంలో నైట్‌ బిజినెస్‌

బిర్యానీ, కుబానీతోపాటు అభివృద్ధినీ ఇస్తా

మూడు నెలల్లో పురాతన భవనాల పునరుద్ధరణ

సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి

హైడ్రా పునరుజ్జీవం కల్పించిన చెరువు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీ అనేది ఓల్డ్‌ సిటీ కాదు.. ఒరిజినల్‌ సిటీ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. హైడ్రా పునరుజ్జీవం కల్పించిన శివరాంపల్లిలోని చారిత్రక బమ్రుఖనుద్దౌలా చెరువును ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఓల్డ్‌ సిటీ ప్రజలకు అద్భుత సంస్కృతిని అందించడానికి ఈ చెరువును అభివృద్ధి చేశాం. ఇది చెరువు అభివృద్ధి మాత్రమే కాదు.. ఈ ప్రాంత ప్రజలకు కాలుష్యరహిత వాతావరణం అందించడం. 

నిజాం సర్కారు గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాద్‌ను లేక్స్‌ అండ్‌ రాక్స్‌ సిటీగా మార్చింది. ప్రపంచంలోనే అద్భుతమైన ఈ నగరాన్ని పాడు చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోంది. లండన్, దక్షిణ కొరియా, సింగపూర్‌ ఇలా అనేక నగరాల్లో నాగరికత, అభివృద్ధి నీటి సమీపంలోనే జరిగింది. నగరంలోనూ నిజాం సర్కార్‌ అనేకం నిర్మించింది. వరదల్లో అనేక మంది చనిపోతే వాటి నియంత్రణతో పాటు సాగునీరు, తాగునీరు అందించడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ నిర్మాణం చేపట్టింది. ఇవన్నీ రానురాను పాడవుతున్నాయి. 

నిజాం పురానాపూల్, ఉస్మానియా ఆస్పత్రి, ఉస్మానియా యూనివర్సిటీ, కౌన్సిల్‌ భవనం, ఫలక్‌నుమా ప్యాలెస్‌ సహా ఎన్నో భవనాలు నిర్మించి ఇచ్చారు. వాటిని రక్షించడం, నిర్వహించడం సాధ్యం కావవట్లేదు. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకున్నాం. రానున్న మూడు నెలల్లో పురాతన భవనాల పునరుద్ధరణ చేపడతాం. పాతబస్తీలో మెట్రో రైల్‌ను వీలైనంత త్వరలో నిర్మిస్తాం’ అని చెప్పారు.

పాతబస్తీలో అభివృద్ధి జరగాలి: ఒవైసీ
‘పాతబస్తీ హైదరాబాద్‌కు గుండెకాయ వంటిది. పాతబస్తీ­లో తగిన స్థాయిలో అభివృద్ధి జరగాలి. అంతా కలిసి దీనిపై ఉన్న అపార్థాలను దూరం చేద్దాం, మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లోపు మెట్రో పనులు చేస్తామని సీఎం చెప్పారు. ఆ స్థాయిలో పనులు జరుగుతున్నాయి. మీరాలం ట్యాంక్‌పై మంజూరైన బ్రిడ్జ్‌ పనులకు సీఎం ఈ నెల 14న శంకుస్థాపన చేస్తారు’ అని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. 

హెచ్‌ఎండీఏ కేటాయించిన రూ.20 కోట్లతో ఈ చెరువును అభివృద్ధి చేశామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్‌ బేగ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఎంఐఎం నుంచి మాకు మద్దతు
‘పాతబస్తీ నుంచి అసదుద్దీన్‌ దేశ ప్రతినిధిగా గొంతు వినిపిస్తున్నారు. ఒవైసీ, ఎంఐఎం నుంచి మాకు మంచి మద్దతు వస్తోంది. ప్రపంచంతో పోటీపడే నగరంగా చేయాలనే ఆక్రమణలు తొలగించి చెరువులు, పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. బమ్రుఖనుద్దౌలా చెరువు వద్ద లేక్‌ పోలీసింగ్‌ ఏర్పాటు చేయాలి. ఆడబిడ్డలు ధైర్యంగా ఇక్కడకు వచ్చేలా, వాకింగ్‌ చేసేలా చర్యలు తీసుకోండి. ప్రతి మహిళ స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా చేరాలి. మీరు ఉత్పత్తి చేసే వస్తువులను ఇక్కడ స్టాల్స్‌ పెట్టి విక్రయించుకునే అవకాశం ఇస్తాం. 

ఈ ప్రాంతంలో లేక్‌ ఎకానమీ ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ, హైడ్రా కమిషనర్లను ఆదేశిస్తున్నా. వాకింగ్‌ చేసిన వాళ్లు ఇక్కడే వారికి కావాల్సినవి కొనుక్కునే విధంగా స్టాల్స్‌ ఏర్పాటు చేయండి. పాతబస్తీలో రాత్రి ఒంటి గంట వరకు వ్యాపారాలకు అనుమతి ఇస్తున్నాం. మూసీ పరీవాహక ప్రాంతంలో నైట్‌ ఎకానమీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పాతబస్తీలో యువతలో నిరుద్యోగం ఉంది. వీరు నైట్‌ ఎకానమీ ద్వారా జీవనోపాధి పొందుతారు. గండిపేట నుంచి గౌరారం వరకు మూసీ వెంట లేక్‌ ఎకానమీ అభివృద్ధి చేస్తాం. 

మూసీలో పేదల ఇళ్లు ఉంటే వారిని వీధుల్లో వదిలేయం. వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తాం. దీని అభివృద్ధితో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఉపాధి కలుగుతుంది. మీరు అందరూ వచ్చి కూర్చుని పనులు చేయించండి. ఒవైసీ ఎంఐఎం పార్టీ వర్కర్లను ఈ కోణంలో ఆదేశించాలి. మీరు ఆదేశిస్తే అన్నీ జరుగుతాయి. ఈ ప్రాంతం అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మీదే. గతంలో రంజాన్‌ వస్తే బిర్యానీ, కుబానీ ఇచ్చి వెళ్లే వాళ్లు. నేను వాటితోపాటు అభివృద్ధి కూడా చేస్తా’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement