కుటుంబం ఆత్మహత్య

family commit to suicide in visakhapatnam - Sakshi

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న దంపతులు.

కుటుంబ కలహాలే కారణమంటూ సూసైడ్‌ నోట్‌?

విశాఖలో ఘటన.. మృతులది ప్రకాశం జిల్లా కనిగిరి  

ఆరిలోవ(విశాఖపట్నం తూర్పు): ఎంతో అన్యోన్యంగా ఉంటున్న దంపతులకు ఏ కష్టమొచ్చిందో తెలియదు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఇద్దరు పిల్లలతో సహా హఠాత్తుగా తనువు చాలించారు. ముందుగా పిల్లలిద్దరికీ విషమిచ్చి.. ఆ తర్వాత తాము కూడా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన గురువారం విశాఖలో జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన దేవిరెడ్డి రాజేశ్‌రెడ్డి(35), భార్య సౌమ్య(30), పిల్లలు విష్ణు(7), జాహ్నవి(5)తో కలసి విశాఖ శివారులోని ఆరిలోవ ముస్తఫా కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న రాజేశ్‌ గురువారం ఉదయం పనికి వెళ్లి.. సాయంత్రం ఇంటికి తిరిగివచ్చాడు. ఏమైందో ఏమో గానీ ఆత్మహత్య చేసుకోబోతున్నామంటూ రాత్రి 7 గంటల సమయంలో చెన్నైలో ఉంటున్న బంధువులకు ఫోన్‌ చేసి చెప్పాడు.

ఆందోళన చెందిన వారు.. వెంటనే విశాఖ ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన ముస్తఫా కాలనీకి చేరుకుని రాజేశ్‌ నివాసముంటున్న ఇంటి ఆచూకీ కోసం గాలించారు. కొంతసేపటికి రాజేశ్‌ ఉంటున్న ఇంటిని గుర్తించిన పోలీసులు.. తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే రాజేశ్, సౌమ్య ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. పిల్లలు విష్ణు, జాహ్నవి మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు. ఘటనాస్థలిలో దొరికిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ మరణానికి కుటుంబ తగాదాలే కారణమని అందులో పేర్కొన్నట్లు తెలిసింది.

పిల్లలకు ముందు విషమిచ్చి ఆ తర్వాత దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఆరు నెలల నుంచి వారు ఇక్కడ ఉంటున్నారని, దంపతులిద్దరూ సఖ్యతగానే ఉండేవారని స్థానికులు తెలిపారు. ఇరుగుపొరుగు వారితో కూడా ఎలాంటి గొడవలు లేవని చెప్పారు. కేసును ద్వారకా ఏసీపీ రామచంద్రరావు నేతృత్వంలో ఆరిలోవ ఇన్‌చార్జి సీఐ షణ్ముఖరావు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రాజేశ్‌రెడ్డి ఓ హత్య కేసులో నిందితుడనే ప్రచారం జరుగుతోంది. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ రామచంద్రరావు చెప్పారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top