నకిలీ సంఘాల దొంగాట..

Fake Game Playing Agencies Cheating Players In Khammam - Sakshi

నకిలీ సంస్థలతో క్రీడా వ్యాపారం

 అమాయకులను దోచుకుంటున్న బోగస్‌ సంఘాలు 

జాతీయ, అంతర్జాతీయ టోర్నీల పేరిట కుచ్చుటోపీ 

చోద్యం చూస్తున్న గుర్తింపు క్రీడా సంఘాలు 

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ క్రీడా సంఘాలు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటలాడిస్తామంటూ ఆశ చూపించే కేటుగాళ్లు.. ట్రస్టులను ఏర్పాటు చేసి అందినకాడికి దండుకుంటూ.. గుర్తింపు లేని ఆటలు ఆడిస్తూ ఆటను వ్యాపారంగా మారుస్తున్నారీ బడా బాబులు. జాతీయ స్థాయిలో తమ సంఘానికి ప్రత్యేక గుర్తింపు ఉందంటూ.. భారత క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ఒలింపిక్‌ సంఘం అనుమతి ఉందని నమ్మబలుకుతూ ఏటా లక్షలు గడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి నకిలీ సంఘాలపై చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర, జాతీయ క్రీడా సంఘాలు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.  

సాక్షి, ఖమ్మం: జిల్లాలోని నకిలీ క్రీడా సంఘాలు ఆటల పేరుతో అమాయక క్రీడాకారులను దోపిడీ చేస్తున్నాయి. జాతీయస్థాయిలో ఏర్పాటైన క్రీడా సంఘం తొలుత రాష్ట్రస్థాయిలో తమకు అనువైన క్రీడాంశానికి సంబంధించిన సీనియర్‌ క్రీడాకారులతో పరిచయం పెంచుకుని.. రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసి.. తర్వాత జిల్లాస్థాయిలో సంఘ ఏర్పాటుకు పూనుకుంటుంది. జిల్లాలో ఏర్పాటైన క్రీడా సంఘం బాధ్యులు.. పేరున్న జిల్లాస్థాయి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు మాయమాటలు చెప్పి పావులుగా వాడుకుంటున్నారు. అయితే తమ సంఘం ద్వారా అందించే సర్టిఫికెట్లు క్రీడాకారులకు పనికి రావని రాష్ట్ర, జాతీయ సంఘం బాధ్యులకు మాత్రం తెలుసు. జిల్లాస్థాయి బాధ్యులకు ఆ విషయం తెలియనీయకుండా గోప్యంగా ఉంచుతున్నారు. తీరా తెలిశాక వారితోపాటు మోసపోయిన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏటా జాతీయ, అంతర్జాతీయ టోర్నీలకు క్రీడాకారులను తీసుకెళ్తున్నామని.. తామే ఖర్చులు భరించి.. తమ సంస్థ ద్వారా ఎంతో మందిని జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దామని మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో ప్రతిభ కలిగిన క్రీడాకారులతోపాటు అర్హత లేని వారిని భారత జట్టుకు ఎంపిక చేసి.. వారి నుంచి భారీ స్థాయిలో డబ్బులు గుంజుతున్నట్లు తెలుస్తోంది.  

అవగాహన లేని వారికే.. 
సంబంధిత క్రీడ పట్ల అవగాహన లేని వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తీసుకెళ్లి.. అక్కడ ఒకటో రెండో మ్యాచ్‌లు తూతూ మంత్రంగా ఆడించి తిరిగి ఇంటికి పంపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 29 క్రీడా సంఘాలకు రాష్ట్ర ఒలింపిక్‌ అసోసియేషన్‌ గుర్తింపు ఉంది. ఇందులోని క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన వారున్నారంటే వేళ్లమీద లెక్కించొచ్చు. అదే నకిలీ క్రీడా సంఘాల ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వారి సంఖ్య కూడా జిల్లాలో గణనీయంగానే ఉంది. కొన్ని క్రీడా సంస్థలు క్రీడలపై అవగాహన లేని వారికి మాయమాటలు చెప్పి.. టోర్నీలో పాల్గొంటే మంచి భవిష్యత్‌ ఉంటుందని నమ్మబలుకుతున్నారు. ఇందులో సీనియర్‌ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఉండడం గమనార్హం. మీడియా కంట పడకుండా నకిలీ క్రీడా సంఘాల నిర్వాహకులు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్‌ క్రీడాకారులకు ఆశ చూపించి.. మోసం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
 
ఇబ్బడి ముబ్బడిగా.. 
నకిలీ క్రీడా సంస్థలు ఢిల్లీ, హర్యాన, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. నకిలీ క్రీడా సంఘం ముసుగులో దోపిడీ జరుగుతుందనే దానికి జిల్లాలో జరిగిన పలు సంఘటనలే నిదర్శనం. పాఠశాల స్థాయిలో ఆడుతున్న ఓ క్రీడాకారుడు నకిలీ క్రికెట్‌ సంస్థ వలలో చిక్కుకున్నాడు. అతడిని శ్రీలంకకు తీసుకెళ్లి అక్కడ సరదాగా ఒక మ్యాచ్‌ ఆడించి.. నిర్వాహకులు తయారు చేసిన అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్‌ను సదరు క్రీడాకారుడికి ఇచ్చారు. అంతేకాక ఆ క్రీడాకారుడి వద్ద నుంచి రూ.లక్ష వరకు నిర్వాహకులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. కొందరు స్పాన్సర్ల వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా లండన్, నేపాల్‌కు పలువురు క్రికెటర్లను తీసుకెళ్లి ఇలాగే డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. నగరంలోని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన బాలుడిని నేపాల్‌ దేశంలో అంతర్జాతీయ కబడ్డీ పోటీలు ఉన్నాయని, ఇది అధికారిక సంఘం తరఫున జరుగుతుందని చెప్పి నమ్మించారు.

దీంతో ఈ క్రీడాకారుడు తనతోపాటు మరో పది మంది క్రీడాకారులను ఈ వలలో చిక్కుకునేలా చేశాడు. ఇదంతా నమ్మిన వారి తల్లిదండ్రులు నిర్వాహకుల మాటలు నమ్మి వేలాది రూపాయలు చెల్లించగా.. తీరా వారిచ్చిన సర్టిఫికెట్ల నకిలీవని తేలడంతో నోరెళ్లబెట్టారు. నగరంలోని బూర్హన్‌పురానికి చెందిన చిరు వ్యాపారికి ఇద్దరు పిల్లలు. ఉన్నట్టుండి పరిచయమైన ఓ వ్యక్తి క్రీడారంగంలో అత్యున్నత అవకాశాలు ఉన్నాయని,  తమ క్రీడా సంఘం ద్వారా ఆడిస్తే సర్టిఫికెట్లు రావడంతోపాటు పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయని నమ్మబలికాడు. ముందుగా రూ.25వేలు తీసుకుని పిల్లాడిని తమ వెంట తీసుకెళ్లారు. తర్వాత కొద్ది రోజులకే జాతీయస్థాయిలో మీ వాడు ప్రథమ స్థానంలో నిలిచాడని సమాచారం అందించారు. వెంటనే అంతర్జాతీయ పోటీలకు వెళ్లాలని చెప్పడంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. అయితే కొద్దిరోజుల తర్వాత తెలిసింది అవన్నీ ఉత్తుత్తి సర్టిఫికెట్లని, ఈ విషయంలో తాము మోసపోయామని లబోదిబోమన్నారు.

‘నకిలీ’పై అప్రమత్తంగా ఉండాలి.. 
జిల్లాలో కొన్ని నకిలీ క్రీడా సంఘాల పేరిట జాతీయ, అంతర్జాతీయస్థాయి టోర్నీలకు తీసుకెళ్తున్నామని నమ్మబలుకుతున్న వారి పట్ల క్రీడాకారులు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర, జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీలకు అనుబంధంగా ఉన్న క్రీడా సంఘాలు నిర్వహించే టోర్నీల్లో మాత్రమే పాల్గొనాలి. ఎటువంటి  గుర్తింపు లేని క్రీడా సంఘాల బాధ్యులు చెప్పే మాటలు నమ్మొద్దు. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో ఆడాలనుకునే వారు ముందుగా తమను సంప్రదిస్తే అన్ని విషయాలు తెలియపరుస్తాం.  

ఎం.పరంధామరెడ్డి, డీవైఎస్‌ఓ, ఖమ్మం    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top