సంతానం పేరుతో టోకరా

Fake Doctor Cheat to Couple in Anantapur - Sakshi

నాటుమందు పేరిట డబ్బు దండుకుని పరారైన నకిలీ డాక్టర్‌

పోలీసులను ఆశ్రయించిన బాధిత దంపతులు

అనంతపురం,కళ్యాణదుర్గం రూరల్‌: సంతాన భాగ్యం లేని వారికి తానిచ్చే నాటుమందుతో పిల్లలు కలుగుతారని నమ్మబలికి దంపతుల నుంచి డబ్బులు దండుకుని ఉడాయించిన నకిలీ డాక్టర్‌ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. కళ్యాణదుర్గం సీఐ సురేష్‌బాబు తెలిపిన మేరకు... కణేకల్‌ మండలం హనకనహాళ్‌ గ్రామానికి చెందిన శిరీష, కుళ్లాయప్పలకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఇప్పటి వరకు సంతానం కలగలేదు. పిల్లల కోసం వీరు తిరగని ఆలయాలు లేవు.. మొక్కని దేవుడు లేడు. పెద్దలు చెప్పిన పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో మిన్నకుండిపోయారు. ఇదే సమయంలో గురువారం ఉదయం డాక్టర్‌నంటూ ఓ వ్యక్తి హనకనహాళ్‌కు వచ్చాడు.

తానిచ్చిన నాటుమందు వాడితే సంతానం కలుగుతారని నమ్మబలికాడు. చివరకు శిరీష దంపతుల వద్దకు అతను వచ్చాడు. తానిచ్చే మందుతో కచ్చితంగా పిల్లలు పుడతారని, అయితే మందు విలువ రూ.లక్ష అవుతుందని చెప్పాడు. సంతానం కోసం తహతహలాడుతున్న ఆ దంపతులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్నారు. అయితే తమవద్ద అంత డబ్బు లేదనడంతో అడ్వాన్స్‌ కింద రూ.50 వేలు ఇవ్వాలని ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో అడిగిన వెంటనే దంపతులు తమ వద్ద ఉన్న బంగారు నగలను తీసుకుని కళ్యాణదుర్గంలోని ప్రైవేట్‌ ఫైన్సాన్‌ కంపెనీలో బంగారు తాకట్టు పెట్టి రూ.48 వేలు తీసుకొచ్చి ఆ వ్యక్తికి అప్పజెప్పారు.

రాగిపిండి. నన్నారి రసమే నాటు మందు!
అడ్వాన్స్‌ తీసుకున్న ఆ వ్యక్తి తన వద్ద ఉన్న ఓ కషాయాన్ని దంపతులకు కిచ్చి.. మిగిలిన డబ్బు త్వరలోనే ఇవ్వాలని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. కాసేపటి తర్వాత దంపతులు కషాయాన్ని పరిశీలించగా రాగిపిండి, నన్నారి రసం కలిపి ఇచ్చాడని నిర్ధారించుకున్నారు. నకిలీ డాక్టర్‌ చేతిలో మోసపోయామని గ్రహించి లబోదిబోమన్నారు. తమకు జరిగిన మోసంపై శుక్రవారం రాత్రి కళ్యాణదుర్గం పట్టణ సీఐ సురేష్‌బాబుకు ఫిర్యాదు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top