నకిలీ కరెన్సీ ముఠా అరెస్టు

fake currency gang arrest - Sakshi

నిందితుల్లో ఒకరు విశాఖ వాసి..

మరో ఇద్దరు పశ్చిమగోదావరి వాసులు

నకిలీ రూ.2 వేల నోట్లు స్వాధీనం

అన్నవరం (ప్రత్తిపాడు): నకిలీ కరెన్సీ మారుస్తున్న ముగ్గురు వ్యక్తులను అన్నవరం పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పెద్దాపురం డీఎస్పీ చిలకా వెంకటరమణ అన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో బు«ధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపిన వివరాల మేరకు స్థానిక ఆర్‌టీసీ బస్‌స్టేషన్‌ వద్ద గల దేవస్థానం ఆస్పత్రి వద్ద ఆగి ఉన్న కారులో నకిలీ కరెన్సీ ఉందన్న సమాచారం మేరకు అన్నవరం ఎస్‌ఐ పార్థసారథి, ఇతర సిబ్బంది అక్కడకు వెళ్లి ఆ ముగ్గురు  వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా రూ.రెండు వేల నకిలీ కరెన్సీ నోట్లు 50, రూ.50 వేల అసలు కరెన్సీ లభ్యమైంది. వీరిలో ప్రధాన నిందితుడు నమ్మి శ్రీనివాసరావు రూ.లక్ష విలువైన 50 నకిలీ రెండు వేల నోట్లు తీసుకురాగా, అవి తీసుకుని అసలు కరెన్సీ రూ.50 వేలు ఇచ్చేందుకు వల్లభదాసు లక్ష్మణరావు, అతని సహాయకుడు మిద్దే రవికుమార్‌ వచ్చారని తెలిపారు. వీరు ముగ్గిరిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

నిందితులు విశాఖ, పశ్చిమగోదావరి వాసులు
నమ్మి శ్రీనివాసరావుది విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం. ఇతడు కలకత్తా నుంచి నకిలీ కరెన్సీ తెచ్చి వివిధ జిల్లాలలోని ఏజెంట్లకు నకిలీ కరెన్సీ విలువకు సగం అసలు కరెన్సీ ఇచ్చే షరతు మీద సరఫరా చేస్తుంటాడని తెలిపారు. గతంలో ఇదే నేరంపై శ్రీకాకుళం, రాజమండ్రిలో అరెస్టై బెయిల్‌ మీద వచ్చాడని, అతనిపై నాలుగు కేసులు ఉన్నట్లు డీఏస్పీ తెలిపారు. ఆ కేసుల్లో సుమారు రూ.25 లక్షల నకిలీ కరెన్సీ అతని నుంచి రికవరీ చేసినట్లు విచారణలో  తెలిసిందని వివరించారు. అసలు కరెన్సీ ఇచ్చేందుకు వచ్చిన వల్లభదాసు లక్ష్మణరావుది పశ్చిమగోదావరి జిల్లా మెట్టు ఉప్పరగూడెం కాగా, సహాయకునిగా వచ్చిన మిద్దే రవికుమార్‌ది భీమడోలు జంక్షన్‌ అని తెలిపారు. వీరిద్దరు మారుతి సుజికీ వెర్టికా కారులో అన్నవరం వచ్చినట్టు తెలిపారు.

50 నోట్లపైనా ఒకటే నంబరు..
రూ.రెండు వేల నకిలీ కరెన్సీ నోట్లన్నీ ఒకే నెంబర్‌తో ఉండడం విశేషం. ఆ నోట్లన్నీ 8 సీబీ 608207 నెంబర్‌తో ఉన్నాయి. నిందితులను నకిలీ కరెన్సీ రవాణా, మార్పిడి తదితర కేసులపై నమోదు చేశామని వివరించారు. ప్రత్తిపాడు సీఐ ఎ.శ్రీనివాసరావు, అన్నవరం ఎస్‌ఐ పార్థసారథి, అడిషనల్‌ ఎస్‌ఐ చిరంజీవి  ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top