నాన్న నన్ను తిట్టాడు

Duniya Vijay Daughter Complaint in Police Station Karnataka - Sakshi

పిన్నితో కలిసి కొట్టారు  

హీరో దునియా విజయ్‌పై కూతురి ఫిర్యాదు  

గిరినగర పీఎస్‌లో కేసు

కర్ణాటక, యశవంతపుర: నటుడు దునియా విజయ్‌ను వరుస వివాదలు వెంటాడుతున్నాయి. జిమ్‌ శిక్షకుడు మారుతీగౌడపై దాడి చేసి జైలుకెళ్లి వచ్చిన విజయ్‌పై ఈసారి ఏకంగా కూతురే కేసు పెట్టింది. తనను అసభ్యంగా తిట్టినట్లు విజయ్‌ కుతూరు మోనిక (14) బెంగళూరు గిరినగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయ్‌ జైలుకెళ్లిన సమయంలో కూతురు మోనికా తల్లి నాగరత్న జతలో ఉన్నారు. సోమవారం తండ్రి విజయ్‌ ఇంటికి  మోనిక వెళ్లి తనకు చెందిన వస్తువులు, కారు పత్రాలను తీసుకెళ్లారు. అప్పుడు విజయ్‌  నిన్ను ఎంత బాగా చూసుకున్నా, అయినా అమ్మ వెంట ఉంటావా? అని కోపగించుకుని తిట్టాడు. తనకు కూతురే లేదనుకుంటానని అన్నాడు.

తల్లితో కలిసి వెళ్లగా...  
మళ్లీ కొంతసేపటికి తల్లి నాగరత్నతో కలిసి మోనిక బట్టలు తీసుకురావాలని దునియా ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో విజయ్‌తో పాటు రెండో భార్య కీర్తి గౌడ, హేమంత్, వినోద్, కారుడ్రై వర్‌ మహ్మద్‌లు తనను తిట్టి, కాళ్లతో తన్ని మారణాయూధాలతో దాడి చేసిన్నట్లు మోనిక గిరినగర పోలీసులకు తండ్రితో పాటు మరో నలుగురిపై ఫిర్యాదు చేసింది. దాడిలో తలకు, చేతికి గాయాలు కావటంతో మోనిక ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన తల్లిని కూడా నోటికొచ్చిన్నట్లు దూషించారని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కొట్టలేదు: విజయ్‌  

కూతురి ఆరోపణలను విజయ్‌ ఖండించాడు. మోనికపై చేయి చేసుకోలేదని, దురుద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన్నట్లు వివరణ ఇచ్చాడు. మూడు రోజుల్లో అన్నీ విషయాలను బహిరంగం చేస్తానంటూ తన ఇంటి సీసీ కెమెరా దృశ్యాలను విడుదల చేశారు.  

సహించను: తల్లి నాగరత్న  
నేను చచ్చినా పర్వాలేదు. నా పిల్లలకు ఇబ్బంది కలిగిస్తే సహించను. బట్టలు తీసుకెళ్లటానికి వెళ్లిన కూతురిపై కీర్తి మనుషులు దాడి చేశారు. మోనికకు వైద్య పరీక్షలను నిర్వహించాం. గిరినగర పోలీసు స్టేషన్‌లో ఐదు మందిపై ఫిర్యాదు చేశాం. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top