మత్తు ఇంజక్షన్లు విక్రయించే ముఠా గుట్టు రట్టు

Drug Injection Gang Arrest in Vijayawada - Sakshi
ఐదుగురు నిందితుల అరెస్టు

విజయవాడ: విజయవాడలో గుట్టుగా సాగుతున్న మత్తు ఇంజక్షన్లు విక్రయించే ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం నగరంలో పలు ప్రాంతాలకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 30 ఎం.జి. పోర్ట్‌విన్‌ (మత్తు) ఇంజక్షన్లు 75, నగదు రూ.7,480, నాలుగు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. బిహార్‌కు చెందిన విశ్వరూప్‌ బారిక్‌ (36) 13 ఏళ్ల క్రితం విజయవాడ వచ్చి, అరండల్‌పేటలో నివాసం ఉంటున్నాడు. తనకు పరిచయం ఉన్న అరండల్‌పేటకు చెందిన తంగిళ్ల హరికృష్ణతో కలిసి మత్తు ఇంజక్షన్లు ఇతర ప్రాంతాల్లో కొనుగోలు చేసి నగరంలో విక్రయాలు చేస్తున్నాడు. వారిద్దరు కాల్వగట్టుపై నివాసం ఉంటున్న కందుకుట్ల నాగమణి అనే మహిళకు ఇంజక్షన్లు విక్రయిస్తున్నారు. పోర్ట్‌విన్‌ ఇంజక్షన్‌ అసలు ధర రూ.5.30 కాగా నాగమణికి దీన్ని రూ.100కు విక్రయిస్తున్నారు. అదే ఇంజక్షన్‌ నాగమణి మారుబేరానికి రూ.200కు విక్రయిస్తోంది.

నాగమణి వద్ద చిట్టినగర్‌కు చెందిన పిళ్లా మహేష్‌కుమార్, పాతరాజరాజేశ్వరీపేటకు చెందిన పైడి దీపక్‌ ఇంజక్షన్లు కొనుగోలు చేసి మరికొంత మంది వ్యక్తులను తీసుకువచ్చి వారితో కూడా ఇంజక్షన్లు కొనుగోలు చేయిస్తున్నారు. పోర్ట్‌విన్‌ ఇంజక్షన్‌ సాధారణంగా శస్త్ర చికిత్సలు చేసే సమయంలో మానసిక రోగులకు వైద్యుని పర్యవేక్షణలో వినియోగించాల్సి ఉంది. వైద్యుల అనుమతి లేకుండా మత్తు ఇంజక్షన్లు విక్రయించడం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరం. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న మత్తు ఇంజక్షన్ల విక్రయాలపై విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అందిన సమాచారం మేరకు నిఘా వేసి ముఠాను పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ రాజీవ్‌కుమార్, సీఐ ఆర్‌.సురేష్‌రెడ్డి, సిబ్బంది ఇంజక్షన్ల ముఠాను అరెస్టు చేసి సూర్యారావుపేట పోలీసులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top