‘ఇంటి’వాడవుదామని.. | Driver Arrest in Robbery Case | Sakshi
Sakshi News home page

‘ఇంటి’వాడవుదామని..

Sep 17 2019 11:22 AM | Updated on Sep 17 2019 11:22 AM

Driver Arrest in Robbery Case - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌

సాక్షి,సిటీబ్యూరో:  మంచి ఇల్లు కట్టుకోవాలనేది అతడి కల. ఆ కల నెరవేరాలంటే రూ. లక్షలు అవసరం. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో చోరీలను ఎంచుకున్నాడు. ఏ మాత్రం అనుమానం రాకుండా స్క్రూడ్రైవర్, సుత్తితో తలుపులు తెరిచి లోపలికి ప్రవేశిస్తాడు. చప్పుడు రాకుండా తన పని పూర్తి చేసి నిమిషాల్లో అక్కడినుంచి జారుకుంటాడు. ఇలా ఏకంగా 9 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఘరానా దొంగ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. చంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న మహ్మద్‌ సమీర్‌ అలియాస్‌ లాల(36)ను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఇతడి నుంచి 520 బంగారు నగలు, 1040 గ్రాముల వెండి, ఒక సోనీ కంపెనీ ఎల్‌సీడీ, 2వేలు సౌదీ కరెన్సీ, ఒక స్క్రూడ్రైవర్, సుత్తిని స్వాధీనం చేస్తున్నారు. నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సోమవారం వివరాలు వెల్లడించారు. కేసును ఛేదించిన క్రైం ఎస్సై కొండలరావు, కానిస్టేబుళ్లు ప్రశాంత్, నిఖిల్‌సాయి, రుద్రభాస్కర్‌లకు నగదు పురస్కారాలు అందజేశారు.

ఒకే పోలీసు స్టేషన్‌లో తొమ్మిది కేసులు..
మహ్మద్‌ సమీర్‌ అలియాస్‌ లాల పదేళ్లక్రితం మహ్మద్‌నగర్‌లో స్థిరపడ్డాడు. డ్రైవర్‌గా పని చేస్తున్న అతను  2012లో చార్మినర్‌ పీఎస్‌ పరిధిలో బైక్‌ చోరీ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత బతుకుదెరువు నిమిత్తం సౌదీకి వెళ్లిన అతను అక్కడ కొంత డబ్బు సంపాదించి మళ్లీ నగరానికి వచ్చాడు. తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో దొంగతనాలకు శ్రీకారం చుట్టాడు. 2015 నుంచి గత ఆగస్టు 14న చేసిన చోరీతో మొత్తం అతనిపై చంద్రాయణగుట్ట పీఎస్‌లో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. రూ.25లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. 

సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి
నగరవ్యాప్తంగా పదిలక్షల నేనుసైతం కెమెరాలను ఏర్పాటు చేయాలనేది లక్ష్యమని, ఇప్పటికే మూడు లక్షల కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. రానున్న రోజుల్లో మేం అనుకున్న పదిలక్షల కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కమిషనర్‌ అంజనీకుమార్‌ పిలుపునిచ్చారు.

ఇల్లు కట్టుకునేందుకే..
ఓ మంచి ఇల్లు కట్టుకోవాలనేది లాల కోరిక. ఇందుకోసమే చోరీలకు పాల్పడ్డాడు. కేవలం స్క్రూడ్రైవర్, సుత్తితో తను అనుకున్న పని పూర్తి చేసేస్తాడు. వేసిన తలుపులు వేసినట్టే ఉంటాయి. స్క్రూడ్రైవర్‌తో లాక్‌ను బ్రేక్‌ చేసి లోపలికి వెళ్లి సుత్తితో బీరువాను బద్దలు కొట్టి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు కాజేస్తాడు. ఇలా తొమ్మిది కేసుల్లో రూ.25లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు రూ.3 లక్షలకు పైగా నగదు దొంగిలించాడు. సోమవారం ఉదయం ఎర్రకుంట ఎక్స్‌రోడ్స్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న లాలని పెట్రోలింగ్‌ సిబ్బంది ప్రశాంత్, నిఖిల్‌సాయి, రుద్రభాస్కర్‌ గుర్తించి అదుపులోకి తీసుకుని సోదా చేయగా కొన్ని బంగారు ఆభరణాలు దొరికాయి. దీంతో లాలని చంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్‌కు తీసికెళ్లి విచారించగా చోరీల చిట్టా బయటపెట్టాడు. దీంతో అతడికి ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు 2015 నుంచి ఇప్పటి వరకు దొంగలించిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కొత్త ఇల్లు కట్టుకోవాలనే కోరికతోనే చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో లాల అంగీకరించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement