వేలికి చికిత్స కోసం వస్తే..

Doctors Negligence Patient Died in Virinchi Hospital - Sakshi

విరించి ఆస్పత్రిలో దారుణం

ఎడమ పాదం చిటికెన వేలికి శస్త్ర చికిత్స.. మర్నాడే రోగి మృతి..

వెద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న మృతుడి బంధువులు

ఆస్పత్రి ఎదుట ఆందోళన

గుట్టుచప్పుడు కాకుండా ‘గాంధీ’కి మృతదేహం తరలింపు

పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో   ఫిర్యాదు.. కేసు నమోదు

సాక్షి, సిటీబ్యూరో: ఎడమపాదం చిటికెన వేలికి చికిత్స చేయించుకుంటే..చివరకు ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. నడుచుకుంటూ ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి విగత జీవిగా మారాడు. మృతుని బంధువులకు సమాచారం ఇవ్వకుండానే గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన సంఘటన ఆదివారం రాత్రి బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఈ విషయం తెలియడంతో బంధువులు ఆస్పత్రికి చేరుకుని వైద్యులను నిలదీశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రోగి చనిపోయాడని,. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు చేశారు. బాధితుల పిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం, రామవరానికి చెందిన సంగీతరావు(53) సింగరేణి క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. అతడి భార్య పదేళ్లక్రితమే మృతి చెందింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. కుటుంబానికి ఆయనే పెద్దదిక్కు.

గత కొంతకాలంగా సంగీతరావు ఎడమకాలి చిటికెన వేలిలో రక్తం గడ్డకట్టింది. రక్తప్రసరణ లేకపోవడంతో వేలిపై వాపు వచ్చి ఇన్‌ఫెక్షన్‌ సోకి చీముకారుతోంది. చికిత్స కోసం స్థానిక సింగరేణి ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా, వేలిని తొలగించాల్సి ఉంటుందని సూచించారు. మెరుగైన చికిత్స కోసం విరించి ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిలో అడ్మిట్‌ కావడంతో పరీక్షించిన వైద్యులు కాలి వేలికి రక్తం సరఫరా నిలిచిపోయినందున, సర్జరీ చేయాల్సి ఉందని సూచించారు. ఇందుకు ఆయన అంగీకరించడంతో ఈ నెల 22న ఎడమ కాలి చిటికెన వేలికి శస్త్రచికిత్స చేసి, ఇన్‌ఫెక్షన్‌ సోకిన భాగాన్ని తొలగించారు. ఆపరేషన్‌ విజయవంతమైందని చెప్పిన వైద్యులు ప్రస్తుతం సర్జరీ సమయంలో మత్తుమందు ఇచ్చినందున మగతగా ఉన్నాడని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులకు చెప్పారు. ఆ మరుసటి రోజు కూడా అతను స్పృహలోకి రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు వైద్యులను నిలదీశారు. అప్పటికే సంగీతరావు కోమాలోకి వెళ్లిపోవడంతో ఐసీసీయూలోకి తరలించి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు వైద్యులు నమ్మబలికారు. తీరా ఆదివారం రాత్రి 11.43 నిమిషాలకు అతను మృతి చెందినట్లు ప్రకటించారు. 

గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు
బంధువులకు కనీసం సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని పోలీసుల సహాయంతో గాంధీ మార్చురీకి తరలించారు. దీనిపై సమాచారం అందడంతో బంధువులు ఆస్పత్రికి చేరుకునేందుకు ముందే పోలీసులు భారీగా అక్కడ మోహరించడం, గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆరోగ్యంగా స్వయంగా ఆస్పత్రికి నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి.. సర్జరీ తర్వాత చనిపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కార్డియో ఫల్మొనరీ ఫెయిల్యూర్‌తోనే మృతి:  ‘విరించి’ యాజమాన్యం
సంగీతరావు ఎడమపాదం చిన్నవేలికి పుండుతో పాటు వాపు, చీముకారుతుండటం, ఇన్‌ఫెక్షన్‌ తదితర సమస్యలతో బాధపడుతున్నాడు. మధుమేహం, హైపర్‌టెన్షన్, రెస్ట్‌ఫెయిన్‌ సమస్యలు ఉన్నాయి. స్మోకింగ్‌ అలవాటు కూడా ఉంది. వాపు వల్ల పక్కన ఉన్న చర్మం కూడా దెబ్బతింది. నిపుణులతో కూడిన వైద్య బృందం అతడికి చికిత్స చేసింది. ఆ తర్వాత రోజు ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఐసీయూకు తరలించి చికిత్స అందించాం. కార్డియో ఫల్మొనరీ అరెస్ట్‌తో మృతి చెందాడు. ఇందులో ఎలాంటి వైద్యపరమైన నిర్లక్ష్యం లేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top