అవినీతి జబ్బు! | DMHO Employee Caught Red Handed To ACB In Medak District | Sakshi
Sakshi News home page

అవినీతి జబ్బు!

Jul 24 2019 10:05 AM | Updated on Jul 24 2019 10:05 AM

DMHO Employee Caught Red Handed To ACB In Medak District - Sakshi

మెదక్‌ డీఎంహెచ్‌ఓ కార్యాలయం

సాక్షి, మెదక్‌: ‘‘ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల చేతులు తడపనిదే ఏ పనీ జరగడం లేదు. న్యాయంగా రావాల్సిన ప్రభుత్వ లబ్ధిని కూడా.. ఎంతో కొంత ముట్ట జెప్పకపోతే ఫైల్‌ కదలని పరిస్థితి నెలకొంది. తాజాగా జిల్లాలో డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేసి మృతి చెందిన ఓ మహిళ కుటుంబానికి న్యాయంగా రావాల్సిన బెనిఫిట్స్‌ను అందించడానికి రూ.30వేలు లంచం అడిగిన సీనియర్‌ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ’’

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేసి సీనియర్‌ అసిస్టెంట్‌ షౌకత్‌ అలీ లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు బాధితుడు పూర్ణచందర్‌ తెలిపిన వివారాలు ఇలా ఉన్నాయి.  

డబ్బులిస్తేనే పని.. 
శివ్వంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రైమరీ హెడ్‌నర్స్‌గా పనిచేస్తున్న లలిత అనే ఉద్యోగస్తురాలు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన బెన్‌ఫిట్స్‌ కోసం ఆమె కుమారుడు పూర్ణచందర్‌ అక్కడి ఆస్పత్రి అధికారులకు అర్జీ పెట్టుకున్నాడు. దీంతో అక్కడ విధులు నిర్వహించే యూడీసీ నర్సింలు మెదక్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలోని సీనియర్‌ అసిస్టెంట్‌ షౌకత్‌ అలీని కలవాలని, అతడు అడిగిన మొత్తం ఇస్తేనే పని జరుగుతుందని చెప్పాడని బాధితుడు పూర్ణచందర్‌ తెలిపారు. ఈ విషయంపై పూర్ణచందర్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ షౌకత్‌ అలీని కలువగా తనకు రూ.30వేలు ఇస్తేనే పనులు జరుగుతాయని చెప్పడంతో బాధితుడు రూ.15వేలకు ఒప్పుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. 

పట్టుకున్న ఏసీబీ అధికారులు.. 
దీంతో మంగళవారం ఏసీబీ అధికారులు చెప్పిన విధంగా పూర్ణచందర్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ షౌకత్‌ అలీకి రూ.15వేల లంచం ఇచ్చాడు. లంచం డబ్బులు తీసుకోగానే సీనియర్‌ అసిస్టెంట్‌ తన వాహనంపై ఐసీఐసీఐ బ్యాంకు వద్ద ఆగాడు. అతన్ని వాహనాన్ని వెంబడించిన ఏసీబీ అధికారులు షౌకత్‌అలీని డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి తీసుకొచ్చి లంచం డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  

లంచం కోసం వేధించారు: పూర్ణచందర్‌ 
మా అమ్మ లలిత 30 సంవత్సరాల వైద్యశాఖలో విధులు నిర్వహించి ఆరు నెలల క్రితం గుండెపోటుతో మరణించింది. ఆమెతోపాటు విధులు నిర్వహించిన యూడీసీ నర్సింలు కనికరం చూపాల్సింది పోయి అమ్మకు రావాల్సిన బెన్‌ఫిట్స్‌ ఇవ్వాలంటే లంచం ఇవ్వాల్సిందేనని వేధించాడని బాధితుడు పూర్ణచందర్‌ వాపోయాడు. ఆయనతోపాటు మెదక్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో విధులు నిర్వహించే సీనియర్‌ అసిస్టెంట్‌ షౌకత్‌అలీలు కలిసి రూ.30వేలు డిమాండ్‌ చేశారు. వారి వేధింపులు భరించలేకనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాను.  

ఉలిక్కిపడ్డ ప్రభుత్వ ఉద్యోగులు.. 
మెదక్‌ డీఎంహెచ్‌ఓ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకోవడంతో జిల్లాలోని ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత రెండేళ్ల క్రితం న్యాయస్థానమైన మెదక్‌ కోర్టులో ఓ ఉద్యోగి లంచం తీసుకుంటుండగా పట్టుబడిన విషయం విధితమే. నాటి నుంచి నేటి వరకు జిల్లాలో ఎలాంటి ఏసీబీ దాడులు జరగలేదు. తిరిగి రెండేళ్ల తరువాత ఏసీబీ దాడితో జిల్లాలోని ఉద్యోగస్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.  

లంచం అడిగితే సమాచారం ఇవ్వండి   
లంచం ఎవరు అడిగినా వెంటనే 94405 56149కు ఫోన్‌చేసి సమాచారం అందించాలని ఏసీబి డీఎస్పీ రవికుమార్‌ తెలిపారు. మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ షౌకత్‌ అలీ లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యండ్‌గా పట్టుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరు లంచం అడిగినా తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని చెప్పారు. సంపాదనకు మించి అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్నా..వారిపై దాడులు చేసే అధికారం తమకు ఉందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయించుకునేందుకు ఎవరు లంచం ఇవ్వకూడదని, ఎవరైన లంచం డిమాండ్‌చేస్తే మాకు సమాచారం ఇవ్వాలన్నారు.            
                      – రవికుమార్, ఏసీబీ డీఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement