మామయ్యను సాగనంపి... | Dental Doctor Died In Car Accident Srikakulam | Sakshi
Sakshi News home page

మామయ్యను సాగనంపి...

Sep 26 2018 7:13 AM | Updated on Sep 26 2018 7:13 AM

Dental Doctor Died In Car Accident Srikakulam - Sakshi

నుజ్జునుజ్జు అయిన కారు

శ్రీకాకుళం, సోంపేట:  కుమారుడు ప్రయోజకుడై కుటుంబాన్ని పోషించాలని, గ్రామంలో తమకు మంచి పేరు తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. తల్లిదండ్రులు కన్న కలలకు అనుగుణంగానే ఆ కుమారుడు కష్టపడి చదివాడు. ప్రయోజకుడు అయ్యాడు. గ్రామస్తులకు తోడునీడగా ఉంటూ, కుటుంబం బాధ్యతలు మోస్తూ అందరినోటా మంచివాడుగా పేరు తెచ్చుకున్నాడు. అంతా సక్రమంగా జరిగి ఉంటే మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుని తల్లిదండ్రులు, కుటుంబంతో హాయిగా గడిపేవాడు. ఇంతలో విధి వక్రీకరించింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో టి.శాసనాం గ్రామానికి చెందిన ప్రైవేటు వైద్యుడు వెదుళ్ళ భీమశంకర్‌ దుర్మరణం చెందాడు. ఈ సంఘటనపై బారువ పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టి.శాసనాం గ్రామానికి చెందిన వెదుళ్ళ కంగాళి, తులసమ్మ దంపతుల కుమారుడు భీమశంకర్‌. కంగాళి విశ్రాంత ఉపాధ్యాయుడు. వీరికి నలుగు కుమార్తెలు, కుమారుడు. కుమారుడు భీమశంకర్‌ను ముద్దుగా పెంచుకోవడంతో పాటు, వైద్యుడిని చేయాలని కలలు కన్నాడు. కలలు నిజం చేసే విధంగా భీమశంకర్‌ దంత వైద్యుడిగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాడు.

సోంపేటలో ప్రాక్టీస్‌ ప్రారంభించిన భీమశంకర్, గత పది సంవత్సరాలుగా మందస మండలం హరిపురం, పలాస మండలంలోని కాశీబుగ్గలలో విఘ్నేష్‌ దంత వైద్యశాల నిర్వహిస్తూ, దంత వైద్యుడిగా ప్రజలతో మమేకమయ్యాడు. అయితే తన మామయ్య అజేయ్‌కుమార్‌ను హరిపురం రైల్వేస్టేషన్‌లో డీఎంయూ రైలు ఎక్కించడానికి తురకశాసనాం గ్రామం నుంచి భీమశంకర్, 9వ తరగతి చదువుతున్న తన మేనకోడలు జాగృతితో కలిసి మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కారులో బయలుదేరి వెళ్లారు. మామయ్యను హరిపురం రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కించి తర్వాత జాగృతి, భీమశంకర్‌ వారి నివాసానికి తిరిగి పయనమయ్యారు. టి.శాసనాం గ్రామానికి మరో ఐదు నిమిషాల్లో చేరుకోబోతుండగా సుమారు 5.30 గంటలకు మండలంలోని చినమామిడిపల్లి, మామిడిపల్లి గ్రామాల మధ్య కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొని, రహదారి పక్కన తోటలోకి 50 మీటర్లు వరకు వెళ్లిపోయింది. చెట్టుకు కారు ఢీకొట్టడంతో నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో భీమశంకర్‌ మృతి చెందాడు. జాగృతి వెనుక సీటులో ఉండడంతో స్వల్పగాయాలతో బయటపడింది. ప్రమాదానికి కారణం నిద్ర మత్తా, బ్రేక్‌ ఫెయిల్‌ అయిందా అనే విషయం తెలియలేదు. నిద్రమత్తులోకి జారుకుని  చెట్టుకు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు, గ్రామస్తులు భావిస్తున్నారు. అటుగా వెళ్లిన మార్నింగ్‌ వాకర్స్‌ ప్రమాదాన్ని గుర్తించి మృతుని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. భీమశంకర్‌ మృతి విషయం తెలుసుకుని సంఘటనా స్థలంలో స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.

సరదాగా కారులో వెళ్లిన జాగృతికి గాయాలు
మామయ్యతో సరదాగా కారులో వెళ్లి తిరిగి రావచ్చునని భావించిన జాగృతికి కన్నీరు మిగిలింది. కారు చెట్టుకు ఢీకొట్టడం, మామయ్య చనిపోవడం కళ్లేదుటే చూసిన జాగృతి షాక్‌కు గురయింది. కారు ప్రమాదం జరుగుతుండగా ఏమి జరుగుతుందో తెలియక ఆందోళన చెందింది. కారులో ఇరుక్కుపోయి కొద్దినిమిషాలు భయభ్రాంతులకు లోనయింది. స్థానికులు వెళ్లి భీమశంకర్‌ను కారు నుంచి బయటకు తీసి, జాగృతిని ఓదార్చారు. కారులో వెళ్లిన నేను మామయ్య చావును చూడాల్సి వచ్చిందని జాగృతి తీవ్రంగా రోదిస్తుంది.

కన్నీరుమున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు
భీమశంకర్‌ తన పెద్ద అక్క కుమార్తె అనితను ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి పాప శ్రీమహి(3), శ్రీవెంకట మోహిత్‌(మూడు నెలలు) పిల్లలు ఉన్నారు. భీమశంకర్‌కు నలుగురు అక్కలు. కుటుంబ బాధ్యతను భీమశంకర్‌ మోస్తూ ఉన్నాడు. ఇతడి మృతితో ఆ కుటుంబ సభ్యుల రోదనను ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. కుమారుడి శవంపై çపడి తల్లి రోదించిన తీరు కన్నీరు తెప్పించింది. భార్య, తండ్రి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

టి.శాసనాంలో విషాదఛాయలు
ప్రైవేటు వైద్యుడు భీమశంకర్‌ మృతితో టి.శాసనాం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మండలంలో ప్రముఖ వ్యక్తిగా ఉంటూ, అందరికీ సహాయ సహకారాలు అందించే వాడని, యువతకు మంచి మార్గం చూపించేవాడని స్నేహితులు తెలియజేస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే బతికి ఉన్నాడనే ఆశతో హరిపురం ఆస్పత్రికి తీసుకువెళ్లి, అక్కడి నుంచి సోంపేట సామాజిక ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. ఇక్కడ మృతదేహానికి శవపంచనామా నిర్వహించారు. సంఘటనా స్థలాన్ని సోంపేట సీఐ సన్యాసినాయుడు, బారువ ఎస్‌ఐ సందీప్‌ కుమార్‌ పరిశీలించారు. బారువ ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement