సత్తెనపల్లిలో యువకుడి మృతి

Death of a young man in Sattenapalli - Sakshi

ఎస్‌ఐ కొట్టడంతో చనిపోయాడని బంధువుల ఆరోపణ

పోలీసులు కొడతారనే భయంతో అని చెప్పిన మృతుని తండ్రి

గౌస్‌కు గుండె సంబంధిత జబ్బు ఉందన్న పోలీసులు

సాక్షి, సత్తెనపల్లి, గుంటూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం ఆందోళనకు దారి తీసింది. వివరాలు.. పట్టణంలోని టింబర్‌ డిపో నిర్వాహకుడు షేక్‌ మహ్మద్‌ గౌస్‌(35) సోమవారం ఉదయం మందులు కొని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళుతుండగా నరసరావుపేటరోడ్డులో చెక్‌ పోస్టు వద్ద ఎస్‌ఐ రమేశ్‌ ఆపి మందలించారు. అప్పటికే పోలీసులు కొడతారనే భయంతో ఉన్న, హృద్రోగి కూడా అయిన గౌస్‌ పడిపోవడంతో తండ్రి  షేక్‌ మహ్మద్‌ ఆదం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గౌస్‌ మృతి చెందాడు.

పోలీసుల దాడితోనే గౌస్‌ మరణించాడని ఆస్పత్రి ముందు, మృతదేహంతో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బంధువులు ఆందోళన చేశారు. సీఐ పైనా దాడి చేశారు. ఎమ్మెల్యే అంబటి రాంబాబు జోక్యం చేసుకుని గౌస్‌ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని జిల్లా రూరల్‌ ఎస్పీని కోరడంతో ఆందోళన సద్దుమణిగింది. తర్వాత ఏఎస్‌పీ మాట్లాడుతూ ఆర్డీఓతో విచారణ చేయిస్తామని, పోలీసుల తప్పుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీసులు కొడతారనే భయంతోనే గౌస్‌ చనిపోయాడని అతని తండ్రి చెప్పారు. గౌస్‌కు పదేళ్ల క్రితం బైపాస్‌ సర్జరీ చేసి స్టంట్‌ కూడా వేశారు. 

ఎస్‌ఐను సస్పెండ్‌ చేశాం: ఐజీ ప్రభాకరరావు
ఈ ఘటనపై ఎస్‌ఐను సస్పెండ్‌ చేశామని గుంటూరు రేంజ్‌ ఐజీ జె.ప్రభాకర్‌రావు తెలిపారు. రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావుతో కలిసి మాట్లాడుతూ గౌస్‌కు గుండె సంబంధిత సమస్య ఉందని, చికిత్స కూడా తీసుకుంటున్నాడని తెలిపారు. డీజీపీ ఆదేశాలతో అసహజ మరణం కింద కేసు నమోదు చేసి శవ పంచనామా, పోస్టుమార్టం నిర్వహిస్తామని చెప్పారు. పోలీసులు దాడి లాఠీచార్జి చేసినట్లు రుజువైతే కారణమైన ఎస్‌ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top