‘డేటింగ్‌ ఫ్రెండే’ దోచేసింది

Dating Friend Cheat Boyfriend With Yono App in Hyderabad - Sakshi

రూ.11 లక్షలు స్వాహా

యూనో యాప్‌ ద్వారా బెంగళూరు ఖాతాలోకి మళ్లింపు

కందుకూరులో విత్‌ డ్రా

దర్యాప్తు ముమ్మరం చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ యువకుడు డేటింగ్‌ యాప్స్‌ మోజులో పడి రూ.11.3 లక్షలు కోల్పోయాడు. అతడి ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం బుధవారం మధ్యాహ్నం అతడి ప్రమేయం లేకుండానే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయిందని, ఆన్‌ చేశాక యాప్స్‌ అన్నీ డిలీట్‌ అయి ఉండటంతో అనుమానం వచ్చి ఏపీలో ఉన్న బ్యాంకు ఖాతా సరిచూడగా అందులో ఉండాల్సిన రూ.15 లక్షలకు బదులు రూ.3.7 లక్షలు మాత్రమే ఉన్నాయి. అంతు చిక్కకుండా ఉన్న ఈ కేసును సవాల్‌గా తీసుకున్న ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ ప్రత్యేకంగా దర్యాప్తు చేయించారు. ఫలితంగా గురువారం నాటికి ఈ వ్యవహారంలో స్పష్టత వచ్చింది. ప్రకాశం జిల్లా, గిద్దలూరుకు చెందిన కిషోర్‌ ప్రస్తుతం ఎస్సార్‌నగర్‌లో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నారు. అతడి తండ్రి స్వస్థలంలోనే ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం పదవీ విమరణ చేసిన ఆయనకు రూ.15 లక్షలు బెనిఫిట్స్‌ అందాయి. వీటిని స్థానిక ఎస్బీఐ బ్రాంచ్‌లో కుమారుడు కిషోర్‌ పేరుతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాడు. ఈ ఖాతాకు సంబంధించిన యూనో యాప్‌ను కిషోర్‌ తన స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని లావాదేవీలు జరిపేవాడు.

ఇదిలా ఉండగా... కొన్నాళ్ల క్రితం ఇతడికి ఓ డేటింగ్‌ యాప్‌ ద్వారా అఖిల అని చెప్పుకున్న యువతి పరిచయం అయింది. వాట్సాప్, ఐఎంఒ యాప్స్‌ ద్వారా చాటింగ్, ఫోన్‌ కాల్స్‌ వీరిద్దరి మధ్యా సాగాయి. కిషోర్‌ దగ్గర ఉన్న మొత్తం కొల్లగొట్టాలనే పథకం పన్నిత అఖిల అదును చూసుకుని అతడితో ఫోన్‌లో ‘గూగుల్‌ ప్లే సర్వీసెస్‌’  యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించింది. దానిని యాక్సస్‌ చేయడానికి అనువైన నంబర్‌ను అతడి నుంచే తీసుకుని తన ఫోన్‌ ద్వారా లింకు ఏర్పాటు చేసుకుంది. టీమ్‌ వ్యూవర్‌ తరహాకు చెందిన ఆ యాప్‌ ద్వారా అఖిల తన ఫోన్‌ నుంచే కిఫోర్‌ ఫోన్‌ను, అందులోని యాప్స్‌ను యాక్సస్‌ చేయవచ్చు. కొన్ని రోజుల తర్వాత తనకు కొంత డబ్బు అవసరం ఉందని, కావాల్సినప్పుడు అడిగితే సహాయం చేయాలని కోరడంతో కిషోర్‌ అందుకు అంగీకరించాడు. ఈ నెపంతో తనను యూనో యాప్‌లో బెనిఫిషియరీగా జోడించేలా చేసింది. ఎప్పటి లాగానే వీరిద్దరూ బుధవారం ఉదయం చాలాసేపు చాటింగ్‌ చేసుకున్నారు.

ఆ తర్వాత కిషోర్‌ తన ఫోన్‌ చార్జింగ్‌ పెట్టి బయటికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన సదరు అఖిల సదరు యాప్‌ ద్వారా కిషోర్‌ ఫోన్‌ను యాక్సస్‌ చేసింది. యూనో యాప్‌ ద్వారా గిద్దలూరులోని బ్యాంకు ఖాతాలో ఉన్న ఫిక్సిడ్‌ డిపాజిట్లు రద్దు చేసి ఆ మొత్తం నుంచి రూ.11.3 లక్షలు దఫదఫాలుగా బెంగళూరులో మహేశ్వర్‌ పేరుతో ఉన్న ఖాతాల్లోకి నిఫ్ట్, ఆర్టీజీఎస్‌ ద్వారా మళ్లించింది. ఆపై యూనో సహా అన్ని యాప్స్‌ డిలీట్‌ చేయడంతో పాటు ఫోన్‌ను ఫార్మాట్‌ చేసేసింది. కొద్దిసేపటి తర్వాత తన ఫోన్‌ను పరిశీలించిన కిషోర్‌ అన్ని యాప్స్‌ డిలీట్‌ కావడాన్ని గుర్తించి  గిద్దలూరులోని బ్యాంకు ఖాతాను పరిశీలించాలని తండ్రిని కోరాడు. ఆ పని చేసిన ఆయన ఫిక్సిడ్‌ డిపాజిట్లూ గల్లంతయ్యాయని, కేవలం రూ.3.7 లక్షలు ఉన్నట్లు చెప్పాడు. దీంతో బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన సైబర్‌ కాప్స్‌ ఆ మొత్తం బెంగళూరు ఖాతా నుంచి ప్రకాశం జిల్లా కందుకూరులో ఉన్న ఖాతాలకు వెళ్లినట్లు, అక్కడే డ్రా అయినట్లు గుర్తించారు. సదరు అఖిలగా చెప్పుకున్న యువతి ఎవరనేది గుర్తిస్తే ఈ కేసులో చిక్కుముడి వీడుతుందనే ఉద్దేశంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. డేటింగ్‌ యాప్స్‌లో ద్వారా జరిగే మోసాలకు ఇదో ఉదాహరణ అని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కోరుతున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top