పోలీసుల అదుపులో నటుడు శివాజీ

Cyberabad police arrested Actor Sivaji - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అలంద మీడియా కేసులో సినిమా నటుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీని సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం ఆయనను శంషాబాద్‌ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకుని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గత రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న శివాజీ విదేశాలకు వెళ్లే క్రమంలో పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. కాగా టీవీ-9లో అక్రమాలకు పాల్పడినట్లు కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. టీవీ9 కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో ఎన్‌సీఎల్‌టీని అడ్డుపెట్టుకుని ఆ సంస్థ రవిప్రకాశ్‌, సినీనటుడు శివాజీ కుట్రలు పన్నారు.

వీరిద్దరి మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని..ఎన్‌సీఎల్‌టీలో కేసు వేయడం కోసం కుట్ర పన్ని..పాత తేదీతో నకిలీ షేర్‌ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సైబర్‌ క్రైం పోలీసులు గుర్తించారు. ఈ కుట్రకు సంబంధించి శక్తి అనే వ్యక్తితోపాటు డైరెక్టర్‌ ఎంకేవీఎన్‌ మూర్తి, రవిప్రకాశ్‌, ఆయన సన్నిహితుడు హరి, ఏబీసీఎల్‌ ఫైనాన్స్ అధికారి మూర్తి, మరో వ్యక్తి మధ్య బదిలీ అయిన పలు ఈ-మెయిళ్లను పోలీసులు గుర్తించారు. ఈ- మెయిళ్ల ఆధారాలు దొరకకుండా సర్వర్ల నుంచి రవిప్రకాష్, ఆయన అనుచరులు డిలీట్‌ చేసినప్పటికీ..సైబర్‌ క్రైం పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానంతో వాటిని వెలికి తీశారు. ఈ కేసుతో సంబంధమున్న శొంఠినేని శివాజీ అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

దీంతో రవిప్రకాశ్‌తో పాటు శివాజీపై గతంలో పోలీసులు లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అమెరికా వెళ్లేందుకు శివాజీ ప్రయత్నించడంతో ఇమిగ్రేషన్‌ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా సైబరాబాద్‌ పోలీసులు మాట్లాడుతూ...’దేశం పాటి వెళ్లాలని శివాజీ పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నాం. శివాజీని అరెస్ట్‌ చేయము. కోర్టు ఆదేశాల మేరకు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశాం. శివాజీని విచారణకు సహకరించాలని కోరాం. నోటీసులు ఆధారంగా ఆయనను విచారణ చేస్తాం.’ అని తెలిపారు. ఇప్పటికే శివాజీపై లుక్‌ఔట్‌ నోటీసులు ఉన్నాయి. శివాజీ అమెరికా వెళ్లేందుకు శంషాబాద్‌ విమానాశ్రయానికి రాగా...ఇమిగ్రేషన్‌ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.

శివాజీకి మరోసారి నోటీసులు
సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు మరోసారి నటుడు శివాజీకి నోటీసులు జారీ చేశారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న ఆయనను  బుధవారం ఉదయం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి...ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని శివాజీకి సూచించారు. నోటీసులు అందుకున్న అనంతరం ఆయన పీఎస్‌ నుంచి వెళ్లిపోయారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top