మూడు రోజులు..రెండున్నర కోట్లు

Crores Of Rupees Valued Ganja Seized By Police In Srikakulam - Sakshi

సాక్షి, జయపురం: స్థానిక పట్టణ పరిధిలో దాదాపు మూడు రోజుల వ్యవధిలో పలు కేసుల్లో సుమారు రూ.2.5 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయమై జయపురం సబ్‌డివిజన్‌ పోలీసు అధికారిణి సాగరిక నాథ్‌ విలేకరుల సమావేశంలో శుక్రవారం మాట్లాడారు. గత రెండు రోజుల వ్యవధిలో జయపురం, బొరిగుమ్మ, బొయిపరిగుడ పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో సుమారు 1015 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. 

ఈ దాడులలో ఒక యువతి సహా దాదాపు 11 మంది నిందితులను అరెస్టు చేశామని ఆమె వెల్లడించారు. మల్కన్‌గిరి జిల్లాలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన గంజాయిను ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నారని ఆమె వివరించారు. విజయవాడ–రాంచీ కారిడార్‌లో గురువారం జరిపిన పోలీసుల తనిఖీల్లో దాదాపు 110 కేజీల గంజాయి పట్టుబడిందని ఆమె తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్‌కు చెందిన దాదాపు నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

నిందితుల్లో చందన నమాలి(25), అనూప్‌ గౌతమ్, హరిశంకర దువన్యాన్, స్థానికుడైన విష్ణు సాహు ఉన్నారని తెలిపారు. అలాగే అంబాగుడ సమీపంలో ఒక వాహనం ఒక వ్యక్తిని ఢీకొని వెళ్లిపోయిందన్న స్థానికుల సమాచారం మేరకు స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపు నిందితులు పరారీ కాగా, వాహనంలోని సుమారు 280 కేజీల గంజాయిను పట్టుకున్నారు. ఈ కేసు నుంచి తప్పించుకున్న వారిలో అనుగూలు వాసి భజనన్‌ సాహు, మల్కన్‌గిరికి చెందిన రామ ఖెముండులుగా పోలీసులు గుర్తించారు. 

10 బస్తాల్లో..
అలాగే జయపురం సదర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 26వ నంబర్‌ జాతీయ రహదారిలో నిర్వహించిన తనిఖీల్లో 10 బస్తాల్లో తరలిస్తున్న గంజాయిను పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి, మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రకాష్‌నాయి, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాకేష్‌కుమార్‌ బర్మన్, రాజవిశ్వ బర్మలను పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2500 నగదు, 2 మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు బొయిపరిగుడలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో సుమారు 400 కేజీల గంజాయిను పట్టుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌కుమార్, టింకు కుమార్, మురతధజ్‌ శుక్లాలను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే ఈ గంజాయి మల్కన్‌గిరి–కొరాపుట్‌ ప్రాంతాల నుంచి దేశంలోని అనేక రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆమె వెల్లడించారు. గంజాయి తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. సమావేశంలో జయపురం పట్టణ పోలీసు అధికారి బాలేశ్వర గిడి, సదర్‌ పోలీసు అధికారి ధిరెన్‌ కుమిర్‌ బెహరా, అంబాగుడ పంటి అధికారి నారాయణ పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

రాయగడలో..
రాయగడ: వచ్చే సాధారణ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ముమ్మరం చేసిన ఎక్సైజ్, పోలీస్‌ యంత్రాంగానికి పెద్దఎత్తున గంజాయి పట్టుబడుతోంది. జిల్లాలోని బిసంకటక్‌ ప్రాంతంలో భారీగా గంజాయి తరలిస్తున్న వాహనాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా గురువారం జరిపిన తనిఖీల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, వాటిల్లో తరలిస్తున్న సుమారు 193 కేజీల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే శుక్రవారం సాయంత్రం జరిపిన వాహన తనిఖీల్లో దాదాపు 100 కేజీల గంజాయి తరలిస్తున్న ఒక కారును పోలీసులు పట్టుకున్నారు.

అయితే కారులో అక్రమంగా తరలిస్తున్న ఈ గంజాయికి రక్షణగా నలుగురు వ్యక్తులు మోటారు సైకిల్‌తో ప్రయాణించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదే విషయమై ఆ నలుగురు వ్యక్తులను పట్టుకుని, విచారణ చేపట్టగా వారంతా పద్మపూర్, గజపతి, పుటాసింగి, గుణుపురం, మునిగుడ ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అనంతరం వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ల ఆధారంగా గంజాయి దొంగల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఐఐసీ అధికారి జశ్వంత్‌ హీయల్‌ తెలిపారు. అయితే ముఖ్యంగా యువతకు ఉపాధి లేకపోవడంతో పాకెట్‌ మనీ కోసం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తక్కువ వ్యయంతో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలను యువత అన్వేషిస్తోందని, ఈ క్రమంలో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించేలా చేస్తే చాలావరకు ఇలాంటి దుశ్చర్యలను అరికట్టవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top