టీడీపీ ఎమ్మెల్యే అనితపై చెక్‌బౌన్స్‌ కేసు

Court Issues Summons To TDP MLA Anitha In Cheque Bounce Case - Sakshi

కోర్టుకు హాజరు కావాలని సమన్లు

అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేధిస్తున్నారని ఆరోపణ

బాధితుడు దివ్యాంగుడు

డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): తనకు చెల్లని చెక్కు ఇవ్వడంతో..అధికార  పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు చెక్కు బౌన్స్‌ కేసు కింద కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయని వేగి శ్రీనివాసరావు అనే దివ్యాంగ కాంట్రాక్టర్‌ తెలిపారు. వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన తెలిపిన వివరాల మేరకు..విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం రాజుపేటకు చెందిన శ్రీనివాసరావు  సివిల్‌ కాంట్రాక్ట్‌ పనులు చేస్తుంటారు. పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వంగలపూడి అనిత 2015 అక్టోబర్‌ నెలలో అతని వద్ద రూ.70 లక్షలు అప్పుగా తీసుకుంది. అందుకు సంబంధించి ప్రాంసరీ నోటు, పోస్ట్‌ డేటెడ్‌ చెక్కును అనిత ఇచ్చారు .

అయితే చాలా రోజుల పాటు ఆ చెక్కును బ్యాంకులో వెయ్యొద్దంటూ శ్రీనివాసరావును ఆమె కోరుతూ వచ్చారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి బ్యాంకు లోన్‌ పెట్టానని, వచ్చిన వెంటనే  మొత్తం డబ్బులు ఇచ్చేస్తానని నమ్మబలికారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా.. తన అప్పు తీర్చాలని శ్రీనివాసరావు  ఒత్తిడి తేగా.. గతేడాది జూలై 30న రూ.70 లక్షల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చెక్కు (నంబరు 994220)ను అనిత ఇచ్చారు. ఆ చెక్కును బ్యాంకులో వేస్తే అకౌంట్లో బ్యాలెన్స్‌ లేదని బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాసరావుకు లేఖ పంపారు. దీంతో ఆయన  కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సివిల్‌ కేసుకు సంబంధించి 12వ అదనపు జిల్లా జడ్జి నుంచి కోర్టుకు హాజరు కావాలని అనితకు  (ఓఎస్‌ నంబరు 434/2018)తో సమన్లు అందాయి. ఇక క్రిమినల్‌ కేసు (సీసీ నంబరు 1919/2018)కి సంబంధించి ఈ నెల 26వ తేదీన వాయిదాకు హాజరు కావల్సి ఉంది. అధికారం తన చేతిలో ఉందని, ప్రజల్ని ఇలా మోసం చేయడం సరికాదని బాధితుడు వాపోతున్నాడు. 

అంత డబ్బు ఎందుకిచ్చానంటే..
తాను ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని, కొంత అప్పు ఉందని, ఎమ్మెల్యేగా పరువు పోతుందని అనిత బతిమాలుకున్నారు. ఆమెపై నమ్మకంతో అప్పు ఇచ్చా. దఫదఫాలుగా సమకూర్చుకున్న రూ.70 లక్షల మొత్తాన్ని ఆమెకు ఒక్కసారిగానే అందజేశా. ఇంత వరకు ఆమె అప్పు తీర్చకపోగా..చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేశారు. అందుకే కోర్టును ఆశ్రయించా.
–వేగి శ్రీనివాసరావు, బాధితుడు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top