డోర్నకల్‌లో కార్డన్‌ సెర్చ్‌  

Cordon Search In The DORNAKAL - Sakshi

తెల్లవారుజామునే తనిఖీలు చేసిన పోలీసులు

మద్యం, వాహనాలు, రైల్వే సామగ్రి స్వాధీనం

డోర్నకల్‌ : డోర్నకల్‌ పట్టణంలోని పలు వీధుల్లో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. మహబూబాబాద్, డోర్నకల్, బయ్యారం, గార్ల, కురవి, కేసముద్రం, నెక్కొండ తదితర పోలీస్‌స్టేషన్ల సీఐలు, ఎస్సైలు, సిబ్బంది, స్పెషల్‌పార్టీ పోలీసులు నాలుగు బందాలుగా తనిఖీలు చేశారు. మహబూబాబాద్‌ డీఎస్పీ నరేష్‌కుమార్‌ కార్డన్‌ సెర్చ్‌ను పర్యవేక్షించారు.

ఎస్సీ, బీసీ కాలనీ, అంబేడ్కర్‌ నగర్, శాంతినగర్, యాదవనగర్‌ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇళ్లలోకి వెళ్లి క్షుణ్ణంగా సోదాలు చేశారు. ఇళ్లలో పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్టేషన్‌కు తరలించారు. రోడ్లపై వెళ్తున్న వాహనాలను నిలిపి తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజామున వీధుల్లో పోలీసులు సంచరించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

తనిఖీల్లో అనుమతి పత్రాలు లేని 63 ద్విచక్ర వాహనాలు, 8 గ్యాస్‌ సిలిండర్లు, నాలుగు ఆటోలు, రూ.15వేల విలువైన 45 బీర్లు, 31 క్వార్టర్‌ మద్యం బాటిళ్లు, 12లీటర్ల కిరోసిన్, రైల్వేశాఖ, విద్యుత్‌శాఖ ఇనుప సామగ్రి, 20 అంబర్‌ ప్యాకిట్లను స్వాధీనం చేసుకున్నారు. డోర్నకల్‌లో మొదటిసారిగా కార్డన్‌సెర్చ్‌ నిర్వహించడం, తెల్లవారుజామున పోలీసులు వీధుల్లోకి రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

శాంతిభద్రతల పరిరక్షణకే...ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి 

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం డోర్నకల్‌ కార్డన్‌ సెర్చ్‌ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో 99శాతం మంది ప్రజలు చట్టాలకు లోబడి ప్రశాంతంగా జీవిస్తున్నారని, ఒక్కశాతం మాత్రమే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.

వారి ఆగడాలను అరికట్టేందుకే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించినట్లు తెలిపారు. డోర్నకల్‌లో పట్టుబడిన వస్తువులను ఆయా శాఖలకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నరేష్‌కుమార్, డోర్నకల్‌ సీఐ ఆవుల రాజయ్యతోపాటు పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top