బెంగళూరు మహిళలే వారి టార్గెట్‌

Chain Snatchers Targets to Bangalore Womens - Sakshi

వారి మెడల్లో ఎక్కువ బంగారం ఉంటుందని  దొంగల అంచనా

అందుకే ముంబై నుంచి వచ్చి స్నాచింగ్‌లు

ఇద్దరు ఇరానీ గ్యాంగ్‌ సభ్యుల అరెస్ట్‌

రూ.15 లక్షల చోరీ సొత్తు స్వాధీనం  

బనశంకరి :  విమానాల్లో బెంగళూరు నగరానికి చేరుకుని చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముంబైకి చెందిన   మహ్మద్‌అలియాస్‌ మోహమ్మద్, సయ్యద్‌ కతరార్‌హుసేన్‌ అలియాస్‌ సైయ్యద్‌ అనే  చైన్‌స్నాచర్లను  ఈశాన్య విభాగం  పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి రూ.15 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈశాన్య విభాగం డీసీపీ కలాకృష్ణస్వామి మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితులు ముంబై నుంచి బెంగళూరు నగరానికి విమానాల్లో చేరుకుని అక్కడ నుంచి రైలులో కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకునేవారు. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న డ్యూక్‌ బైక్‌ల్లో సంచరిస్తూ ఒంటరిగా సంచరిస్తున్న మహిళలను టార్గెట్‌ చేసుకుని చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడేవారు. 

తర్వాత చోరీ సొత్తును  రైలు లేదా బస్సులో ముంబైకి తరలించి విక్రయించేవారు.  ఇప్పటి వరకు ఐదు సార్లు నగరానికి చేరుకున్న  చైన్‌స్నాచర్లు  విద్యారణ్యపుర, సదాశివనగర, ఆర్‌టీ.నగర, బాణసవాడి, అన్నపూర్ణేశ్వరినగర తదితర 20 కి పైగా ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌లకు తెగబడ్డారు. గత నవంబరులో విద్యారణ్యపుర సింగాపుర ఎక్స్‌ప్రెస్‌లేఔట్‌లో విజయలక్ష్మీ అనే మహిళ ఇంటి ముందు నడుచుకుని వెళుతుండగా ఆమె మెడలో ఉన్న 30 గ్రాముల బరువు గల బంగారుచైన్‌ లాక్కెళ్లారు. కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగాపార్కింగ్‌ చేసిన డ్యూక్‌ బైక్‌పై దృష్టిసారించి అక్కడి సీసీకెమెరాల ఫుటేజీల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలించిన అనంతరం తీవ్రంగా గాలించి నిందితులను అరెస్ట్‌ చేశామని డీసీపీ తెలిపారు.   బెంగళూరు  నగర మహిళలు అధిక బరువు కలిగిన బంగారుచైన్లు ధరిస్తారని, ఒక చైన్‌ దొంగలిస్తే రూ.2 లక్షల వరకు లభిస్తుందనే అంచనాతో నిందితులు బెంగళూరును టార్గెట్‌ చేసుకున్నట్లు విచారణలో తేలిందని డీసీపీ తెలిపారు. గ్యాంగ్‌లో మరికొందరు ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top