ప్రియురాలి కోసం దొంగగా మారిన యువకుడు

Chain Snatcher Arrested In Rangareddy - Sakshi

శంషాబాద్‌: చదువుతో పాటు బతుకు దెరువు కోసం నగరబాట పట్టిన యువకుడు ఓ యువతి మెప్పు కోసం, విలాసవంతమైన జీవితం కోసం చోరీల బాటపట్టాడు. ఇటీవల రాజేంద్రనగర్‌ పరిధిలో కిరాణా షాపులను ఎంచుకుని అందులో ఉన్న వారి నుంచి చైన్‌లు దొంగిలించిన యువకుడిని రాజేంద్రనగర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం శంషాబాద్‌ డీసీపీ ఎన్‌.ప్రకాష్‌రెడ్డి తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం తిరుమలగిరి గ్రామ పరిధిలోని బల్యానాయక్‌ తండాకు చెందిన పత్లావత్‌ మోహన్‌(21) చదువుతో పాటు బతుకు దెరువు కోసం హైదరాబాద్‌ వచ్చాడు.

అత్తాపూర్‌లోని డీమార్ట్, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు చేసి మానేసాడు. బాలాపూర్‌ మండలం జల్లపల్లి గ్రామంలో నివసిస్తున్న అతడు ఓలా క్యాబ్‌  డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ యువతితో అతడికి పరిచయం పెరగింది. ఆమెను మెప్పించడంతో పాటు విలాసవంతంగా గడిపేందుకు చోరీలను మార్గంగా ఎంచుకున్నాడు. ఇందుకోసం సామాజిక మాధ్యమాల్లో చోరీలు చేసే కథనాలు, వీడియోలను చూసి అవగాహన పెంచుకున్నాడు. కేవలం కిరాణా దుకాణాలను లక్ష్యంగా చేసుకుని అందులో ఉన్న పురుషుల వద్ద మాత్రమే బంగారం తస్కరించేందుకు నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో నెలరోజుల వ్యవధిలోనే రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు చోట్ల కిరాణ దుకాణాల్లో ఉన్న వ్యక్తుల మెడలోంచి చైన్‌లు దొంగలించి పరారయ్యాడు, మరో చోట చైన్‌స్నాచింగ్‌ ప్రయత్నించాడు. సీసీ  పుటేజీ ఆధారంగా యువకుడు తిరుగుతున్న బైక్‌తో పాటు అతడి ఆనవాళ్లను  కనిపెట్టిన రాజేంద్రనగర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లక్ష్మీగూడ వద్ద బైక్‌పై సంచరిస్తున్న అతడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరాలను బయటపెట్టాడు. అతడి వద్ద నుంచి నాలుగున్నర తులాల బంగారం, ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. యువకుడిని రిమాండ్‌కు తరలించారు. కేసును చేధించడంతో ప్రతిభను చూపిన రాజేంద్రనగర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ ఇతర సిబ్బందిని డీసీపీ ప్రశంసించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top