ఎన్‌డీఏలో ఐదుగురు సిబ్బందిపై సీబీఐ కేసు | CBI books National Defence Academy principal, conducts raids | Sakshi
Sakshi News home page

ఎన్‌డీఏలో ఐదుగురు సిబ్బందిపై సీబీఐ కేసు

Jun 7 2018 2:26 AM | Updated on Oct 8 2018 5:45 PM

CBI books National Defence Academy principal, conducts raids - Sakshi

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని ఖడక్‌వాస్లాలో ఉన్న నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ) ప్రిన్సిపాల్‌తో పాటు నలుగురు బోధనా సిబ్బందిపై సీబీఐ బుధవారం కేసు నమోదుచేసింది. బోధనారంగంలో అనుభవం, పనీతీరుపై నకిలీ సర్టిఫికెట్లతో ఈ ఐదుగురు నిందితులు ఎన్‌డీఏలో ఉద్యోగాలు పొందారని అరోపించింది. కేసు నమోదుచేసిన అనంతరం సీబీఐ అధికారులు ఖడక్‌వాస్లాలోని ఎన్‌డీఏ ప్రాంగణంతో పాటు నిందితుల ఇళ్లపై దాడిచేసి కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై సీబీఐ అధికార ప్రతినిధి ఆర్కే గౌర్‌ స్పందిస్తూ.. పుణేలో ఉన్న ఎన్‌డీఏ–ఖడక్‌వాస్లా ప్రిన్సిపాల్‌ ఓంప్రకాశ్‌ శుక్లా, ప్రొఫెసర్‌ జగ్‌మోహన్‌ మెహెర్‌(పొలిటికల్‌ సైన్స్‌) అసోసియేట్‌ ప్రొఫెసర్లు వనీతా పూరి (కెమిస్ట్రీ), రాజీవ్‌ బన్సల్‌(గణితం), కెమిస్ట్రీ విభాగం హెచ్‌వోడీ మహేశ్వర్‌ రాయ్‌పై కేసు నమోదుచేశామని తెలిపారు.

అలాగే యూపీఎస్సీ, ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ ప్రధాన కార్యాలయానికి(హెచ్‌క్యూ–ఐడీఎస్‌) చెందిన గుర్తుతెలియని అధికా రిపైన కూడా కేసు నమోదుచేశామన్నారు. ఖడక్‌వాస్లాలోని ఎన్‌డీఏలో 13 మంది అర్హతలేని బోధనా సిబ్బంది అక్రమంగా ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలపై గతేడాది ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు గౌర్‌ తెలిపారు. సాధారణంగా ఎన్‌డీఏలో బోధనా సిబ్బందిని యూపీఎస్సీ ఎంపిక చేస్తుందనీ, యూపీఎస్సీ సిఫార్సు ఆధారంగా రక్షణశాఖ నియామకాలు చేపడుతుందని పేర్కొన్నారు. యూపీఎస్సీతో పాటు హెచ్‌క్యూ–ఐడీఎస్‌లోని కొందరు అధికారుల సాయంతో ఈ ఐదుగురు నిందితులు 2007–08, 2012–13 మధ్యకాలంలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరినట్లు విచారణలో తేలిందన్నారు. దీంతో కేసు నమోదుచేశామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement