నారాయణ ఈ టెక్నో స్కూల్‌పై కేసు

Case File Against Narayana E Techno Schools - Sakshi

ఒంగోలు: నగరంలోని నారాయణ ఈ టెక్నో స్కూల్‌పై జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్‌ సుబ్బారావు ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. డీఈవో కథనం ప్రకారం.. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో అన్ని యాజమాన్యాల్లోని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకూ సెలవులు ప్రకటించింది. అంజయ్య రోడ్డులోని నారాయణ ఈ టెక్నో స్కూల్‌లో ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారు. సమాచారం అందుకున్న డీఈవో సుబ్బారావు అప్రమత్తమై పోలీసులతో కలిసి గురువారం పాఠశాలకు వెళ్లి తనిఖీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా పాఠశాలను తెరవడం, ఉపాధ్యాయులను బలవంతంగా పాఠశాలకు పిలిపించి ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించడంతో పాటు వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నట్లు డీఈవో గుర్తించారు. ఇందుకు బాధ్యులుగా నారాయణ ఈ టెక్నో స్కూల్, అంజయ్య రోడ్డు ప్రిన్సిపాల్‌ అల్లం కిరణ్, అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ కంచిబొట్ల బాలాజీ, స్టాఫ్‌ టీచర్‌ షేక్‌ షర్మిల, ఉపాధ్యాయుడు ఎ.ప్రశాంత్‌కుమార్‌లను గుర్తించి వారిపై పోలీసులకు డీఈవో ఫిర్యాదు చేశారు. 

మార్కాపురంలో కూడా..
మార్కాపురం: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్థానిక నారాయణ స్కూల్‌ యాజమాన్యం గురువారం పాఠశాలను తెరిచి ఉంచింది. గమనించిన కొందరు జిల్లా విద్యాశాఖాధికారికి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్థానిక ఎంఈవో రాందాస్‌ నాయక్‌ను స్కూల్‌ వద్దకు పంపారు. స్కూల్‌ తెరిచి ఉండటాన్ని ఎంఈవో గుర్తించారు. వెంటనే పట్టణ పోలీసుస్టేషన్‌లో ఎంఈవో ఫిర్యాదు చేశారు. ట్రైనీ డీఎస్పీ స్రవంతి రాయ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top