అతివేగం తెచ్చిన అనర్థం | Sakshi
Sakshi News home page

అతివేగం తెచ్చిన అనర్థం

Published Tue, Jul 2 2019 8:20 AM

 Bolero Vehicle Collided With A Lorry - Sakshi

సాక్షి, మదనపల్లె టౌన్‌ : అతివేగం కారణంగా ముగ్గురు మున్సిపల్‌ ఉద్యోగులు, డ్రైవర్‌ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలయ్యారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ములకలచెరువు మండలంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి ఇన్‌చార్జి ఏఎస్‌ఐ శ్రీహరి కథనం మేరకు.. మదనపల్లె మున్సిపల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఏ–1 క్లర్క్‌ బి.పాండురంగయ్య(56), లైటింగ్‌ సెక్షన్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న జి.నాగరాజ(58), ఆయన భార్య జి.రెడ్డీశ్వరి(ఏ–1 క్లర్క్‌)లు అనంతపురంలో సోమవారం మున్సిపల్‌ ఆర్డీ నిర్వహిస్తున్న బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు మదనపల్లె నుంచి బొలెరో వాహనంలో బయలుదేరారు.

వాహనం ములకలచెరువు మండలం వేపూరికోట వద్ద వెళుతున్న సమయంలో ముందు వెళుతున్న స్కూటర్‌ను అధిగమించబోయి అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో బి.పాండురంగయ్య, నాగరాజ, రెడ్డీశ్వరితో పాటు బొలెరో వాహన డ్రైవర్‌ సురేంద్ర(29) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న బి.కొత్తకోట 108 సిబ్బంది రాజు, లోకేష్‌ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
 


ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రెడ్డీశ్వరి 

గాయపడిన వారిలో పాండురంగయ్య, రెడ్డీశ్వరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యంకోసం తిరుపతికి వెళ్లాలని డాక్టర్లు సూచించారు. క్షతగాత్రులను మున్సిపల్‌ కమిషనర్‌ జశ్వంతరావు, డీఈ మహేష్‌తో పాటు సహచర ఉద్యోగులు పరామర్శించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ములకలచెరువు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement