డ్రగ్స్‌ రాకెట్‌ నిందితుడికి బెయిల్‌

Bail to the accused of Drugs Rocket - Sakshi

దేశం విడిచి వెళ్లకూడదంటూ హైకోర్టు షరతులు..

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల సినీరంగాన్ని కుదిపేసిన డ్రగ్స్‌ రాకెట్‌ వ్యవహారంలోని ప్రధాన నిందితుడు మైక్‌ కమింగకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఎక్సైజ్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేసింది. రూ.25 వేలతో రెండు పూచీకత్తు సమర్పించాలని, దేశం విడిచి వెళ్లకూడదని పలు షరతులు విధించింది. ప్రతీ రెండో శనివారం సంబంధిత పోలీసుల ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డ్రగ్స్‌ రాకెట్‌ వ్యవహారంలో ఎక్సైజ్‌ పోలీసులు డచ్‌ దేశస్తుడైన కమింగను జూలై 26న అరెస్ట్‌ చేసి, అతని ఇంటి నుంచి కొన్ని మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటినుంచి అతను జైలులోనే ఉన్నాడు.

ఈ నేపథ్యంలో కమింగ తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. కమింగ ఇంటిలో సోదాలు జరిపి డైమిథిల్‌ ట్రైపటమైన్‌ (డీఎంటీ)ని స్వాధీనం చేసుకున్నారని.. ఆ సమయంలో ఎక్సైజ్‌ అధికారులు తమ సొంత కానిస్టేబుళ్లను సాక్షులుగా చూపారని అన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని వివరించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను ఇప్పటివరకు నిర్ధారించ లేదని వెల్లడించారు. దీనిపై న్యాయమూర్తి ఎక్సైజ్‌ అధికారుల వివరణ కోరగా.. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికను సమర్పిస్తామని చెప్పారు. సోమవారం నాటి విచారణకు ఈ రిపోర్టును అధికారులు కోర్టుకు అందజేయలేకపోయారు. నివేదిక సమర్పణకు తమకు మరింత గడువు కావాలని కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కమింగకు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top