కొత్తగా భద్రావతి గ్యాంగ్‌.. పొడి వేస్తారు.. దోచేస్తారు! | Badravathi Gang Arrest in YSR kadapa | Sakshi
Sakshi News home page

పొడి వేస్తారు.. దోచేస్తారు!

Sep 22 2018 11:30 AM | Updated on Sep 22 2018 11:30 AM

Badravathi Gang Arrest in YSR kadapa - Sakshi

నిందితుడితో డీఎస్పీ, సిబ్బంది

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : భద్రావతి గ్యాంగ్‌.. బహుశా ఈ గ్యాంగ్‌ పేరు ఎప్పుడూ విని ఉండరు. కర్ణాటకకు చెందిన ఈ గ్యాంగ్‌లో ఐదుగురు ఉన్నారు. డబ్బుతో వెళ్తున్న వ్యక్తులను గుర్తించి వారిపై జిల కలిగించే పొడి చల్లుతారు. వారు జిలతో ఇబ్బంది పడుతుండగా డబ్బుతో ఉడాయిస్తారు. వీరు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో చోరీకి పాల్పడ్డారు. కర్ణాటకలోని భద్రావతి గ్యాంగ్‌కు చెందిన రవిబాబు అనే ప్రధాన నిందితుడ్ని అరెస్ట్‌ చేసి అతని వద్ద నుంచి రూ.1.92 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను శుక్రవారం డీఎస్పీ శ్రీనివాసరావు తనకార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

టీమ్‌ ఇలా..
కర్నాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా, భద్రావతి పట్టణానికి చెందిన రవిబాబు బట్టల వ్యాపారం చేసేవాడు. వ్యాపారంలో నష్టం రావడంతో లక్షలాది రూపాయలు అప్పులు చేశాడు. అదే ప్రాంతానికి చెందిన అతని స్నేహితులు సురేష్, శివ, ఆశీష్, విక్రం జులాయిగా తిరుగుతూ డబ్బు కోసం దొంగతనాలు చేసేవారు. గతంలో ఉన్న పరిచయం కారణంగా రవిబాబు వారి గ్యాంగ్‌లో చేరాడు. అందరూ కలిసి కర్నాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లోని రద్దీగా ఉండే పట్టణాల్లో చోరీకి వ్యూహ రచన చేసేవారు.

పొడి చల్లి.. దృష్టి మల్లించి
అందరూ కలిసి జిల కలిగించే పొడిని తయారు చేశారు. కరక్కాయ పొడిలో పాండ్స్‌ పౌడర్‌ కలిపి వీరు జిల పొడిని తయారు చేశారు. సురేష్, శివ డబ్బు ఉన్న మనుషులను గుర్తించగా ఆశీష్‌ ఎవ్వరికీ అనుమానం రాకుండా వెనకవైపున వారిపై పొడి చల్లుతాడు. జిలతో వారి దృష్టి మరల్చగా మైనర్‌ బాలుడైన శివ ముందు వైపున ఉండి డబ్బును చాకచక్యంగా కొట్టేయగా కొంత దూరం వెళ్లగానే ఆ డబ్బును రవిబాబు తీసుకుంటాడు. తర్వాత ఆ డబ్బును అందరు సమానంగా పంచుకుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్‌ 26న భద్రావతి గ్యాంగ్‌ సభ్యులు ఐదుగురు ప్రొద్దుటూరుకు వచ్చారు. రద్దీగా ఉన్న శివాలయంవీధి, లైట్‌పాలెం చోరీ చేయడానికి అనువుగా ఉంటుందని అక్కడే మాటేశారు. రాత్రి 9.30 గంటల సమయంలో పట్టణానికి చెందిన తిరువీధి వెంకటసత్యనారాయణ రిటైల్‌ వ్యాపారి కమీషన్‌ వ్యాపారం చేస్తుంటాడు. అతను రోజు దుకాణాల వద్దకు వెళ్లి డబ్బు వసూలు చేస్తుంటాడు.

ఈ క్రమంలో అతను డబ్బు కలెక్షన్‌ చేయడానికి లైట్‌పాలెంలోని గోమతి జనరల్‌ స్టోర్‌కు వెళ్లాడు. దుకాణ దారుడు ఇచ్చిన డబ్బును బ్యాగ్‌లో వేసుకొని స్కూటర్‌ డిక్కీలో పెట్టాడు. స్కూటర్‌ స్టార్ట్‌ చేసుకొని వెళ్లే సమయంలో అతని వెనుక వైపున సురేష్, శివ పొడి చల్లారు. దీంతో వెంకటసత్యనారాయణకు జిల, మంట కలగడంతో పక్కనే దుకాణంలోకి   వెళ్లి చొక్కా విప్పి చూసుకుంటుండగా మైనర్‌ బాలుడు విక్రం స్కూటర్‌ డిక్కీలోని డబ్బు బ్యాగ్‌తో ఉడాయించాడు. కొద్ది సేపటి తర్వాత అతను వచ్చి డిక్కీలో చూడగా డబ్బు బ్యాగ్‌ కనిపించలేదు. అందులో రూ.2 లక్షలు ఉన్నట్లు టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నిందితుడు రవిబాబు ఆర్టీసీ బస్టాండులో ఉన్నాడని సమాచారం రావడంతో శుక్రవారం టూ టౌన్‌ ఎస్‌ఐ మధుమళ్లేశ్వరరెడ్డి సిబ్బందితో కలిసి అతన్ని అరెస్ట్‌ చేశారు. అతని వద్ద రూ.1.92 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. గ్యాంగ్‌లోని నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. టూ టౌన్‌ సీఐ మల్లికార్జునగుప్త పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement