
సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడు కె.వరప్రసాద్
రామకుప్పం: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన రామకుప్పం మండలం కెంపసముద్రం జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డీఈవో పాండురంగస్వామి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కెంపసముద్రం జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కె.వరప్రసాద్ (49) తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ప్రధానోపాధ్యాయురాలు కె.శ్యామలాదేవికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆమె పీఈటీ శుభలేఖతో పాటు బాలికలను విచారించారు.
తెలుగు ఉపాధ్యాయుడు పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించినట్టు నిర్ధారించుకున్నారు. అనంతరం ఉపాధ్యాయుడు వరప్రసాద్‌కు సంజాయిషీ నోటీసు ఇచ్చారు. సోమవారం లోపు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ఇంతలో విద్యార్థులు 1100 నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సీఎం పేషీ నుంచి వచ్చిన సమాచారంతో స్పందించిన డీఈవో విచారణ చేపట్టాలని రామకుప్పం ఎంఈవో ధనరాజ్‌ను ఆదేశించారు. ఆయన హుటాహుటిన కెంపసముద్రం పాఠశాలకు వెళ్లి విచారించారు. అనంతరం డీఈవో పాండురంగస్వామికి నివేదిక అందజేశారు. దీంతో తెలుగు ఉపాధ్యాయుడు వరప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో పాండురంగ స్వామి ఉత్తర్వులు జారీ చేశారని, తదుపరి ఉత్తర్వులు అందేవరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఎంఈవో ధనరాజ్ తెలిపారు.