సీతారామా.. ఎంత ఘోరం జరిగిందయ్యా!

Auto And Lorry Accident In Kodad - Sakshi

సీతారాముల కల్యాణ రమణీయ ఘట్టాన్ని కనులారా వీక్షించి తరించారు.. తమ జీవితాలు సాఫీగా సాగిపోవాలని భక్తిశ్రద్ధలతో ఏక పత్నీవ్రతుడిని వేడుకున్నారు.. అప్పటి వరకు భక్తిపారవశ్యంలో మునిగితేలిన ఆ భక్తులు.. ఆటోలో స్వస్థలానికి బయలుదేరారు. మరికొద్ది నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటారనే లోపలే ఘోరం జరిగిపోయింది. విధి వైపరిత్యమో.. మరో కారణమో తెలియదు కానీ ..ఆటో వారి పాలిట మృత్యుశకటంగా మారింది. మితిమీరిన వేగం.. ఆపై డ్రైవర్‌ నిర్లక్ష్యం వెరసి.. ముందుగా వెళుతున్న బస్సును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ దుర్ఘటన ఆదివారం మధ్యాహ్నం కోదాడ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు, మృతుడి బంధువుల కథనం మేరకు...  

కోదాడరూరల్‌ : కోదాడ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ్మర సీతారామాదేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కోదాడకు చెందిన పలువురు భక్తులు అక్కడ జరిగే వేడుకలకు వెళ్లివస్తారు. ఈ క్రమంలో పట్టణంలోని  సిరి అపార్ట్‌మెంట్‌కు చెందిన నలుగురు మహిళలు కల్యాణానికి వెళ్లారు. కల్యాణం అనంతరం అక్కడి నుంచి ఆటోలో కోదాడకు బయలుదేరారు. వీరితో పాటు పట్టణానికి చెందిన మరో ఐదుగురు ఆటోలోకి ఎక్కారు. డ్రైవర్‌తోపాటు మొత్తం ఆటోలో పది మంది ఉన్నారు.

తమ్మర నుంచి ఆటో బయలుదేరి కోదాడ–ఖమ్మం ప్రధాన రహదారి మీదుగా కోదాడకు వస్తోంది. ఈ క్రమంలో ఖమ్మం క్రాస్‌ రోడ్డు సమీపంలో ముందు ఉన్న బస్సును ఆటో ఓవర్‌టెక్‌ చేస్తూ అకస్మాత్తుగా ఎడమవైపు నుంచి రోడ్డు కుడివైపునకు వచ్చాడు. అదే సమయంలో కోదాడ నుంచి ఖమ్మం పట్టణానికి  సిమెంట్‌ లోడ్‌తో ఎదురుగా వస్తున్న లారీని ఆటో వెళ్లి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న కోదాడకు చెందిన బేతు లక్ష్మయ్య (60) ఆయన భార్య బేతు నాగసులోచన (57), తమ్మరకు చెందిన ఆటోడ్రైవర్‌ అబ్బాస్‌ (48), పట్టణంలోని మాతానగర్‌కు చెందిన నరిమినేని సుగుణమ్మ (45), రెడ్‌చిల్లి వెనుక నివాసముంటున్న గుండపనేని పద్మ (56) అక్కడికక్కడే మృతిచెందారు.

సిరి అపార్టుమెంట్‌కు చెందిన అంబటి సైదమ్మ (38), వట్టికొండ శైలజ (40)లు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం తరలించారు. అక్కడికి చేరుకొనే లోపే ఈ ఇద్దరు కూడా మార్గమధ్యలో మృతిచెందారు.  ఆటోలో ఉన్న మరో ముగ్గురు మహిళలు లక్ష్మి, రేణుక, మంగతాయారుకు గాయాలయ్యాయి. రేణుక పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ఆమెను ఖమ్మం నుంచి హైదరబాద్‌కు తరలించారు. లక్ష్మీ విజయవాడలో చికిత్స పొందుతుండగా మంగతాయారు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతోంది.

ఆటోలో ఇరుక్కుపోయిన మృతదేహాలు...
ప్రమాద ఘటనలో లారీని ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఆటోను ముందుకు నెట్టుకుంటూ వెళ్లింది. దీంతో  ఆటో నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలు, క్షతగాత్రులు కడ్డీల మధ్యలో ఇరుక్కుపోయారు. స్థానికులు వాహనదారులు అక్కడకు చేరుకుని దాదాపుగా 20 నిమిషాలు శ్రమించి ముందుగా గాయాలపాలైన వారిని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించి , మృతదేహాలను బయటకు తీసారు.

ప్రభుత్వాస్పత్రిలో మిన్నంటిన రోదనలు
కోదాడకు చెందిన ఏడుగురు ఒక్కసారే మృతిచెందడంతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన వారి కుటుంబాలన్ని దాదాపుగా పట్టణంలో అందరికి పరిచయాలు  ఉండటంతో మృతదేహాలను చూసేందుకు వందల సంఖ్యలో ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. వైద్యశాల ఆవరణలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఆటోడ్రైవర్‌ తొందరపాటే కారణమా...?
ఘోర రోడ్డు ప్రమాదానికి ఆటో డ్రైవర్‌ తొందరపాటే కారణమని తెలుస్తోంది.  శ్రీరామ నవమి కావడంతో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఉం డటంతో మరిన్ని ట్రిప్పులు తోలుకోవచ్చనే ఆశతో ఎదురుగా బస్సు ఆగి ఉన్న ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఆటో డ్రైవర్‌ తొందరపాటుతో ఎదురుగా వాహనాలు వస్తున్నాయో లేదో చూసుకోకుం డా ఒక్కసారే  పక్కకు  మలపడంతో లారీ ఢీకొ ట్టింది. ఇక్కనిమిషం ఆగితే అందరు క్షేమంగా  ఇళ కు చేరేవారు. మరణించిన వారిలో నలుగురు కూ డా రెండు నిమిషాలు ఆగితే ఖమ్మం క్రాస్‌రోడ్, బీ ఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద దిగేవారే ఉన్నారు.

మృతుల వివరాలు రాసుకోవడానికి వెళితే...
తమ్మర నుంచి కోదాడకు వస్తున్న ఆటో లారీని ఢీకొట్టిందని, ఈ ప్రమాదంలో ఏడుగురు మతి చెందారనే సమాచారం కోదాడ పట్టణ పోలీసులకు అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి  బయలుదేరారు. పట్టణ సీఐ శ్రీనివాసులరెడ్డితో పాటు రైటర్‌ వట్టికొండ రామారావు కూడా పెన్ను పేపర్‌లు తీసుకుని సంఘటన స్థలానికి బయలుదేరారు. ఘటనాస్థలిలో మృతుల , గాయపడిన వారి వివరాలు రాసుకోవడానికి రైటర్‌ రామారావు సిద్ధమవుతున్నాడు. కానీ అక్కడ కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతూ తన భార్య వట్టికొండ శైలజ పడి ఉండడంతో రామారావుకు దిక్కుతోచలేదు. అపార్టుమెంట్‌ వాసులతో కలిసి ఆమె తమ్మర దేవాలయానికి వెళ్లి వస్తూ ప్రమాదానికి గురైంది. వెంటనే తేరుకున్న ఆయన ఆమెను హుటాహూటిని అంబులెన్స్‌లో ఖమ్మం తరలించాడు.  కాని ఖమ్మం చేరుకొనే లోపే ఆమె మృతిచెందింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ముగ్గురి వివాహాలు చేసి..
తమ్మరబండపాలెం గ్రామానికి చెందిన ఎస్‌కె. అబ్బాస్‌  ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ముగ్గురు వివాహాలు చేయగా మరో కుమారుడు వివాహానికి ఉన్నాడు.

ఒంటరిని చేసి వెళ్లిపోయావా..
సైదమ్మ భర్త వీరారెడ్డి పట్టణంలో వ్యాపారం చేస్తుంటాడు. ఇతడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సైదమ్మ మృతితో వారి కుటుంబం దిక్కుతోని స్థితిలోకి వెళ్లిపోయింది. పిల్లలను, నన్ను ఒంటరిని చేసి వేళ్లిపోయావా అంటూ ఆమె భర్త బోరున విలపించాడు.  

కోదాడకు చేరుకున్న ఎస్పీ... 

ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు కోదాడకు చేరుకున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న మృతదేహాలను సందర్శించి మృతుల కుటుంబాలతో మాట్లాడారు. కార్యక్రమాలు వెంటనే జరిగే విధంగా చూడాలని స్థానిక పోలీసులకు తెలిపారు. ఆయన వెంట పట్టణ, రూరల్‌ సీఐలు, స్థానిక ఎస్‌ఐలు సిబ్బంది ఉన్నారు.          

 ప్రశాంతంగా జీవించే సమయంలో...
గుండపనేని పద్మ ,భర్త సత్యనారాయణ పట్టణంలో కిరణాషాపు నిర్వహిస్తూ ఇద్దరు కుమారులు, ఓ కుమార్తెను ఉన్నత చదువులు చదివించారు. వీరిలో చిన్నకొడుకు, కుతూరు అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఇటీవల కాలంలోనే  రెడ్‌చిల్లీ వెనుక బజారులో ఇంటిని కొనుగోలు చేసి నెలరోజుల క్రితం చిన్నకుమారుడి వివాహం చేశారు. పిల్లలు ఉన్నతంగా ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటిలో ఉంటూ ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో పద్మ దుర్మరణం చెందడం ఆ కుటుంబాన్ని కలచివేసింది.

 ఒక్క దేవుడూ కాపాడలేక పోయాడా..
మృతుల్లో ఇద్దరు బేతులక్ష్మయ్య నాగసులోచన దంపతులు. వీరు బీఎస్‌ఎన్‌ కార్యాలయం ఎదురుగా గల వీధిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరి కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. వీరందరికీ వివాహాలు చేసిన లక్ష్మయ్య ఓ కిరణాషాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. గృహిణిగా ఉంటున్న నాగసులోచనకు దైవభక్తి ఎక్కువ. ‘‘నువ్వు దేవుడికి రోజు పూజ చేస్తున్నా ఒక్క దేవుడన్నా మిమ్మల్ని కాపడలేదా అమ్మా.. ఇద్దరూ ఒక్కసారే మమ్మల్ని వదిలిపోయరా’’ అంటూ  వారి కూతుళ్లు, కుమారుడు గుండెలవిసేలా రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

 ఘటన స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే...
ప్రమాద జరిగిన విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించేందుకు తగు చర్యలు తీసుకున్నారు.  ఆతర్వాత వైద్యశాలో చికిత్స పొందుతున్న పలువురుని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. విషమంగా ఉన్న వారిని ఖమ్మం, విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

కూరగాయల మార్కెట్‌లో పనిచేస్తూ..
మాతానగర్‌కు చెందిన సుగుణకు భర్త, కొడుకుతో ఉంటూ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న కూరగాయాల మార్కెట్‌లో పనిచేస్తోంది. భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.  ఆమె మృతితో కొడుకు, భర్త,  తీవ్రంగా రోదిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top