
గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి పంపేందుకు ఆటో ఎక్కిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే, వైఎస్సార్ సీపీ శ్రేణులు
గుంటూరు, తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని పోలకంపాడులో పాత జాతీయరహదారిపై బుధవారం ఆటో అదుపు తప్పి డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో అటుగా ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సేకరించిన వివరాల ప్రకారం... తాడేపల్లి పట్టణ పరిధి ముగ్గురోడ్డులో నివసించే దర్శపు మోషే విజయవాడ నుంచి తన ఆటోలో ఇంటికి వస్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా ఆటో పల్టీ కొట్టింది. ఆటో నడుపుతున్న మోషే రోడ్డుమీద పడడంతో తలకు తీవ్రంగా గాయమైంది. ఆ సమయంలో ఎమ్మెల్యే ఆర్కే నులకపేటనుంచి తన నివాసానికి వెళ్తుండగా, ప్రమాదం జరగడం చూసి, వెంటనే కారు నిలిపి, గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి పంపేందుకు 108కు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే 108 సిబ్బంది ఎవరూ స్పందించలేదు. దీంతో వెంటనే క్షతగాత్రుడిని తన కారులోఎక్కించమని తన సహచరులకు ఆదేశించారు. ఈలోగా గాయపడిన డ్రైవర్ మోషే బంధువులు మరో ఆటోలో రాగా, ఆ ఆటోలో మోషేను వైద్యం నిమిత్తం విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. మోషే తలకు తీవ్ర గాయమై రక్త స్రావం జరగడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న తాడేపల్లి సీఐ బ్రహ్మయ్య సంఘటనా స్థలానికి రాగా ప్రమాదం జరిగిన తీరును ఎమ్మెల్యే ఆర్కే సీఐకు వివరించారు.
ప్రభుత్వం 108ను నిర్వీర్యం చేస్తోంది
దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేద ప్రజల కోసం రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ప్రాణాలతో కాపాడేందుకు ఏర్పాటుచేసిన 108 పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. కనీసం సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వకుండా వారి జీవితాలతో ఆడుకుంటోందన్నారు. దివంగత నేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరు 108కి ఫోన్ చేసినా పది నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి క్షతగాత్రులకు ప్రథమ చికిత్స నిర్వహించి, ఆసుపత్రికి తీసుకువెళ్లేవారని, ఆ విధంగా వేలాదిమంది ప్రాణాలు కాపాడారని, ప్రస్తుత ప్రభుత్వం 108ను నిర్వీర్యంచేసి ప్రజలకు అన్యాయం చేస్తోందన్నారు. జననేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవగానే 108ను పునరుద్ధరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా చేస్తామని ఆర్కే అన్నారు.