రాడ్లు, కత్తులతో బీభత్సం

Attempt To Murder On Eluru Person West Godavari - Sakshi

ఏలూరులో వ్యక్తిపై హత్యాయత్నం

పరిస్థితి విషమం, గుంటూరు తరలింపు

పాతకక్షల నేపథ్యంలోనే దాడి

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌: ఏలూరు తంగెళ్ళమూడి కబాడీగూడెంలో ఒక వ్యక్తిపై ఐదుగురు రాడ్లు, కత్తులతో దాడి చేసి హత్యచేసేందుకు ప్రయత్నించారు. నడిరోడ్డుపై సినీ ఫక్కీలో దాడికి తెగబడడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. తలపై తీవ్ర గాయాలు కావటంతో వెంటనే బాధితుడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్సనిమిత్తం గుంటూరు తరలించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద బాధితుడి బంధువులు, కుటుంబ సభ్యులు చేరటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కబాడీగూడెంలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు భయాం దోళనలకు గురవుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏలూరు తంగెళ్ళమూడి 50వ డివిజన్‌ కబాడీగూడెంకు చెందిన కాశీ సత్యనారాయణ అలియాస్‌ సతీష్, అలియాస్‌ కాశీ (28)పై గురువారం రాత్రి 8గంటల ప్రాంతంలో అతని ఇంటివద్దనే ఐదుగురు వ్యక్తులు రాడ్లు, కత్తులతో తీవ్రంగా నరికారు. అక్కడే ఉన్న రాళ్ళతో తలపైనా, చాతీపైనా కొట్టటంతో తీవ్ర గాయాలయ్యాయి.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే సతీష్‌ను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. తలపై కత్తులతో నరకటంతో తీవ్రంగా రక్తస్రావం కావటంతో పరిస్థితి విషమంగా మారింది. వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు తరలించారు. కాశీ సత్యనారాయణ అలియాస్‌ సతీష్‌పై పాతకక్షల నేపథ్యంలోనే హత్య చేసేందుకు కుట్ర చేశారని చెబుతున్నారు. సతీష్‌పై కత్తులు, రాడ్లతో దాడి చేసిన వారిలో మున్నుల సీతయ్య, మున్నుల సాయి, మున్నుల శివ, మున్నుల మూర్తి, మున్నుల వెంకన్న అనే వ్యక్తులు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే గతంలో రౌడీషీటర్‌ జొన్నకూటి రాటాలుతో గొడవలు జరగటం, కొంత వివాదం నేపథ్యంలో అదను కోసం వేచిఉన్నట్లు సమాచారం. దీంతో గురువారం ఉదయం నుంచి కొబ్బరి శివ, జొన్నకూటి రాటాలు సతీష్‌కు బాగా మద్యం తాగించారని తెలుస్తోంది. మద్యం సేవించి ఉన్న సతీష్‌పై దాడి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇవ్వటంతో ఐదుగురు వ్యక్తులు రాడ్లు, కత్తులతో హత్యాయత్నం చేశారని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఏలూరు టూటౌన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు.కాశీ సత్యనారాయణపై హత్యాయత్నంతో కబాడీగూడెం ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయపడుతున్నారు. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇరు వర్గాలు దాడులకు తెగబడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేయాలని మాజీ మేయర్‌ కారే బాబూరావు పోలీసులను కోరారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top