నడిరోడ్డుపై హత్యాయత్నం

Attempt To Murder on Auto Driver On Road hyderabad - Sakshi

సైదాబాద్‌ పరిధిలో ఆటో డ్రైవర్‌పై దాష్టీకం

పాతగొడవల నేపథ్యంలో ఆదివారం ఘటన  

చూస్తూ పట్టనట్లు వ్యవహరించిన వాహనచోదకులు

సైదాబాద్‌: మొన్న ఎర్రగడ్డలో మాధవిపై దాడి చేసిన మనోహరాచారి... నిన్న అత్తాపూర్‌లో రమేష్‌ను నరికిచంపిన కిషన్, మల్లేష్‌... తాజాగా ఆదివారం రాత్రి సైదాబాద్‌లో ఆటోడ్రైవర్‌ అర్జున్‌పై హత్యాయత్నం... నగరంలో వరుసపెట్టి నడిరోడ్డుపై జరిగిన దారుణాలివి. పాత కక్షల నేపథ్యంలో ఆటో డ్రైవర్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దాడి దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. గతంలో జరిగిన రెండు ఉదంతాల మాదిరిగానే అర్జున్‌ విషయంలోనూ స్థానికులు సరైన రీతిలో స్పందించకుండా చోద్యం చూశారు. ఈ ఘటన పూర్వాపరాలివీ... ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ సింగరేణి గుడిసెల్లో నివసించే గోపి, మహేష్, సభావత్‌ లక్ష్మణ్, పవన్‌ ఫంక్షన్‌ హాళ్లలో క్యాటరింగ్‌ పనులు చేస్తుంటారు.

వారం రోజు క్రితం ఓ  ఫంక్షన్‌ హాల్‌లో పని చేసిన వీరు అర్ధరాత్రి వేళ చంపాపేట్‌ నుంచి తమ ఇళ్లకు వెళ్లేందుకు మాదన్నపేటకు చెందిన అర్జున్‌ ఆటోను మాట్లాడుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత కిరాయి విషయంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. అర్జున్‌ ఎక్కువ మొత్తం డిమాండ్‌ చేయడంతో వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నా ఆపై ఎవరికి వారు తమ తమ ఇళ్ళక వెళ్లిపోయారు. ఆదివారం రాత్రి అర్జున్‌ ఓ ప్రయాణికుడిని భానునగర్‌లో దించేందుకు వెళుతుండగా భానునగర్‌ సమీపంలో వీరు నలుగురు డ్రైవింగ్‌ సీటులో ఉన్న అర్జున్‌ గుర్తించి ఆటోను ఆపారు. అతడిని ఆటోలోంచి బయటికి లాగి దాడికి పాల్పడ్డారు. రోడ్డుపై పడేసి కాళ్ళు, చేతులతో విచక్షణారహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా సమీపంలో ఉన్న రాళ్లు తెచ్చి అర్జున్‌ తల, మెడ, వీపు భాగాల్లో ఒకరి తరా>్వత ఒకరు కొట్టారు.

ఆ సమయంలో ఆటోలో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోగా... రోడ్డుపై వెళ్తున్న వాహనచోదకులు చూస్తూ కూడా పట్టనట్లు వ్యవహరించారు. దాదాపు పది నిమిషాల పాటు అర్జున్‌పై దాడి జరుగుతున్నా ఎవరూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వారు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత తీవ్రంగా గాయపడిన బాధితుడు తేరుకుని తానే ఫోన్‌ తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు వచ్చేవరకు రోడ్డు పైనే పడిపోయి ఉన్న అర్జున్‌ను కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆపై సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించారు. సోమవారం నలుగురినీ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రావు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top