పోలీసు కస్టడీకి ఆర్మీ మేజర్‌ నిఖిల్‌

Army Major arrested in murder case sent to 4-day police custody - Sakshi

4 రోజుల కస్టడీ విధించిన ఢిల్లీ కోర్టు  

న్యూఢిల్లీ: సహోద్యోగి భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు, ఆర్మీ మేజర్‌ నిఖిల్‌ హండాకు ఢిల్లీలోని ఓ కోర్టు 4 రోజుల పోలీసు కస్టడీ విధించింది. మేజర్‌ను పోలీసులు సోమవారం కోర్టులో ప్రవేశపెట్టారు. హత్య చేయడానికి అతను వాడిన కత్తి, హత్యసమయంలో అతను ధరించిన డ్రెస్, ఇతర కీలక సాక్ష్యాధారాల వివరాలు రాబట్టేందుకు నిఖిల్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు జడ్జిని కోరారు. దీంతో  నిందితుణ్ని కోర్టు పోలీసుల కస్టడీకి ఇచ్చింది.

ఆర్మీ మేజర్‌ అమిత్‌ ద్వివేది భార్య శైలజ (35)ను ప్రేమించిన నిఖిల్, ఆమె పెళ్లికి నిరాకరించడంతో శనివారం హత్య చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఆదివారం నిఖిల్‌ను  మీరట్‌లో పోలీసులు అరెస్టు చేశారు. శైలజ గతేడాది మిస్‌ ఇండియా ఎర్త్‌ అందాల పోటీల్లో పాల్గొన్నారు. అంతకుముందు ‘మిస్‌ ఎర్త్‌ క్రియేటివ్‌’ పోటీలోనూ గెలుపొందారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేవారు. 2008లో మేజర్‌ అమిత్‌తో పరిచయం ఏర్పడగా, 2009లో వారి పెళ్లి జరిగింది. ఈ జంటకు ఆరేళ్ల కొడుకు ఉన్నాడు.

1959లో నానావటి కేసు నుంచి 2008 నీరజ్‌ కేసుదాకా..
అత్యంత క్రమశిక్షణ గల వారిగా భావించే త్రివిధ దళాల ఉద్యోగులు నేరాలకు పాల్పడిన ఘటనలు గతంలోనూ జరిగాయి. 1959– నానావటి కేసుఈ కేసు ఆధారంగా అనేక సినిమాలు, పుస్తకాలొచ్చాయి. కేఎం నానావటి అనే నౌకాదళ కమాండర్‌ 1959 ఏప్రిల్‌ 27న తన భార్య సిల్వియా ప్రేమికుడు ప్రేమ్‌ ఆహుజాను హత్య చేశాడు. స్థానిక కోర్టు నానావటిని నిర్దోషిగా విడుదల చేసినా, బాంబే హైకోర్టు ఆ నిర్ణయాన్ని తోసిపుచ్చింది.  చివరకు బాంబే గవర్నర్, తొలి ప్రధానిæ నెహ్రూ సోదరి విజయలక్ష్మి ప్రజాభిప్రాయం ఆధారంగా నానావటికి క్షమాభిక్ష పెట్టారు.  

1982– సికంద్‌ హత్య కేసు
ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా పనిచేసిన ఎస్‌జే చౌదరి ఢిల్లీ వ్యాపారి కిషన్‌ సికంద్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. స్థానిక కోర్టు 26 ఏళ్లు విచారణ జరిపి ఆర్మీ అధికారికి జైలు శిక్షవేసింది. 2009లో ఢిల్లీ హైకోర్టు ఆ అధికారిని నిర్దోషిగా ప్రకటించి కేసు నుంచి విముక్తుణ్ని చేసింది. తర్వాత సుప్రీంకోర్టూ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. చౌదరి తన భార్య నుంచి విడిపోయి వేరుగా ఉంటుండటంతో కిషన్‌ ఆమెకు దగ్గరయ్యాడని, దీనిని భరించలేక చౌదరి సికంద్‌ను హత్యచేశాడని ఆరోపణ.  

2007– మేఘా రాజ్‌దాన్‌ కేసు
కెప్టెన్‌ మేఘా రాజ్‌దాన్‌ భారత ఆర్మీలో ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రెజిమెంట్‌లో అధికారిణి. ఆర్మీ అధికారి కెప్టెన్‌ చైతన్య భత్వాడేకర్‌ను 2006లో పెళ్లాడారు. తర్వాత చైతన్య పుణెకు చెందిన ఓ అమ్మాయితో సంబంధంపెట్టుకున్న విషయం మేఘాకు తెల్సింది. తర్వాత చైతన్య వేధింపులు భరించలేక మేఘా 2007లోఆత్మహత్య చేసుకున్నారు.

2008–నీరజ్‌ గ్రోవర్‌ కేసు
నటి మరియా సుసైరాజ్‌కు, నౌకాదళ అధికారి ఎమిలీ జెరోమ్‌కు 2008లో పెళ్లి సంబంధం కుదిరింది. నీరజ్‌ గ్రోవర్‌ అనే వ్యక్తితో మరియాకు సంబంధం ఉందన్న అనుమానంతో జెరోమ్‌ అతణ్ని హత్య చేశాడు. తర్వాత మరియా, జెరోమ్‌లు కలిసి నీరజ్‌ శరీరాన్ని ముక్కలుగా చేసి పడేశారు. త కేసులో జెరోమ్‌ను కోర్టు శిక్షించింది. సుసైరాజ్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది.  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top