ఉగ్రదాడుల్లో ఆర్మీ జవాన్‌ వీర మరణం

Army jawan died in Terrorist attacks - Sakshi

పాతపట్నం: జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రం శ్రీనగర్‌లో బుధవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పాతపట్నం మండలం ఎ.ఎస్‌.కవిటి గ్రామానికి చెందిన సాధ గుణకరరావు (25) అనే ఆర్మీ జవాన్‌ మృతి చెందాడు. తోటి డ్రైవర్‌తో కలిసి జీపులో వెళ్తుండగా ఉగ్రమూకలు ఈ దారుణానికి ఒడిగట్టాయి.

కుమారుడు మృతి వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు, గ్రామ సర్పంచ్‌ అంపోలు భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం.. 
శ్రీనగర్‌లో మూడు రోజులుగా ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య కాల్పులు జరుగుతున్నాయి.

ఎ.ఎస్‌.కవిటికి చెందిన సాధ గుణకరరావు ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా మరో అసిస్టెంట్‌ డ్రైవర్‌తో కలిసి బుధవారం తెల్లవారుజామున జీపుతో వెళుతుండగా ఉగ్రవాదులు కాల్పులకు ఎగబడ్డారు.

ఈ ఘటనలో ముందుగా అసిస్టెంట్‌ డ్రైవర్‌కు, తరువాత గుణకరరావుకు తూటాలు తగిలాయి. అసిస్టెంట్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన గుణకరరావును ఆస్పత్రికి తరలించారు. ఉదయం 8 గంటల సమయంలో గుణకరరావు మృతి చెందిన విషయాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు తల్లి సాధ జయమ్మకు ఫోన్‌లో తెలియజేశారు.

తల్లడిల్లిన తల్లిదండ్రులు..

గుణకరరావు తండ్రి మల్లేశ్వరరావు వ్యవసాయకూలీ కాగా, ముగ్గురు అక్కలు కృపారాణి, సుశీల, సావిత్రిలకు వివాహాలు జరిగాయి. మరో ఆరు నెలల్లో పెళ్లి చేసుకుంటానని, ఇల్లు కట్టమని చెప్పి ఇంతలోనే కుమారుడు మృత్యువాతపడటంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు.

2012 సెప్టెంబర్‌లో విధుల్లో చేరిన గుణకరరావు పంజాబ్‌ రాష్ట్రం పఠాన్‌కోఠ్‌ యూనిట్‌ ఎం.ఈ.జీ ట్రైనింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందాడు. ప్రస్తుతం శ్రీనగర్‌లోని 1 ఆర్‌ఆర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. పదేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన అంపోలు తారకేశ్వరరావు కూడా శ్రీనగర్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు.

నేడు మృతదేహం రాక!

మృతదేహం శ్రీనగర్‌ నుంచి ఢిల్లీ వస్తుందని, అక్కడి నుంచి విశాఖపట్నం చేరుకుంటుందని గ్రామస్తులు తెలిపారు. అక్కడి నుంచి గురువారం సాయంత్రం గ్రామానికి మృతదేహం తీసుకొస్తారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఆర్‌ఐ బి.సోమేశ్వరరావు, వీఆర్‌ఓ కె.సూర్యనారాయణలు గ్రామానికి వెళ్లి  కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top